తల్లికి తీవ్ర అనారోగ్యంగా ఉండడంతో ఆస్ట్రేలియా జట్టు రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ స్వదేశానికి వెళ్లిపోయాడు. టీమిండియాతో రెండో టెస్టు ముగిసిన వెంటనే కమిన్స్ ఆస్ట్రేలియాకు వెళ్లిపోగా.. అతడి స్థానంలో మూడో టెస్టుకు స్టీవ్ స్మిత్ నాయకత్వం వహించాడు. ఈ మ్యాచ్ లో ఆసీస్ ఘన విజయం సాధించింది. తల్లికి చికిత్స కొనసాగుతుండడంతో కమిన్స్ ఇంకా ఆస్ట్రేలియాలోనే ఉన్నాడు. మార్చి 9న భారత్ తో నాలుగో టెస్టు జరగనున్న నేపథ్యంలో, ఆసీస్ కెప్టెన్ గా స్టీవ్ స్మిత్ నే కొనసాగించనున్నారు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా చివరి టెస్టు మ్యాచ్ అహ్మదాబాద్‌లో మార్చి 9 నుంచి మొదలు కానుంది. ఈ మ్యాచ్ ను భారత్, ఆస్ట్రేలియా దేశాల ప్రధానులు నరేంద్ర మోదీ, ఆంథోనీ అల్బనీస్ కలిసి వీక్షించనున్నారు. మార్చి 8 నుండి 11 వరకు భారత్ లో పర్యటించనున్నారు ఆంథోనీ అల్బనీస్. మొదటి రోజు మ్యాచ్ ను మోదీతో కలిసి చూడనున్నారు. 2017 తర్వాత ఆస్ట్రేలియా ప్రధాని భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి.