జమ్మూ కాశ్మీర్ కు ‘రాష్ట్ర హోదా’ పై కేంద్రం కీలక ప్రకటన

జమ్మూ కాశ్మీర్ లో టెర్రరిజాన్ని రూపుమాపడానికి భారత ప్రభుత్వం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉంది. అందులో భాగంగానే.. జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 ఎత్తివేయడంతో రాష్ట్ర హోదా కోల్పోయింది. కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని, అయితే, అక్కడ పరిస్థితులన్నీ సాధారణ స్థాయికి చేరిన వెంటనే ప్రక్రియ మొదలవుతుందని తాజాగా కేంద్ర హోం శాఖ పేర్కొంది. జమ్మూకాశ్మీర రాష్ట్ర హోదా, అక్కడ ఉగ్రవాద సమస్యలపై పార్లమెంటులో పలువురు ఎంపీలు అడిగిన ప్రశ్నలకు కేంద్ర హోం శాఖ బుధవారం లిఖితపూర్వక సమాధానాలిచ్చింది.
ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న జమ్ముకశ్మీర్‌కు సరైన సమయంలో రాష్ట్రహోదా కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా ఎప్పుడు కల్పిస్తారంటూ రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ఈ విధంగా లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. జమ్మూ కాశ్మీర్లో సాధారణ పరిస్థితులు పునరుద్ధరించబడిన తర్వాత సరైన సమయం చూసి రాష్ట్ర హోదా కల్పిస్తామని నిత్యానంద్ రాయ్ తన సమాధానంలో పేర్కొన్నారు. అక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు ప్రస్తుతం తగ్గాయని నిత్యానంద్ రాయ్ రాజ్యసభకు తెలిపారు. 2019తో పోల్చితే 2020లో ఉగ్రవాద ఘటనలు 59 శాతం తగ్గాయని.. అదేవిధంగా 2020లో జూన్ వరకు జరిగిన ఉగ్రవాద ఘటనలతో పోల్చితే 2021 జూన్ వరకు జరిగిన ఉగ్రవాద ఘటనలు 32 శాతం తగ్గాయని ఆయన తెలిపారు. కాశ్మీర్ లో సాధారణ పరిస్థితులు ఏర్పడగానే తిరిగి రాష్ట్ర హోదాను కల్పిస్తామని కేంద్రం చెబుతోంది. ఆ సమయం కోసం యావత్ భారతావని ఎదురుచూస్తూ ఉంది. శాంతి కోసం భారత్ ఓ వైపు ప్రయత్నిస్తూ ఉంటే పాకిస్తాన్ తీవ్రవాదాన్ని పెంచే పనిలో ఉంది. ఉగ్రవాదాన్ని తుదముట్టించడానికి అవసరమైన అన్ని చర్యలను కేంద్రం అమలు చేస్తున్నదని, కాశ్మీర్ లో అన్ని వర్గాల మద్దతుతో ప్రక్రియ ముందుకు సాగుతున్నదని హోం శాఖ తెలిపింది.
ప్రసుతం కాశ్మీర్ లో 900 కాశ్మీరీ పండిట్లు, డోగ్రా హిందూ కుటుంబాలు ఉన్నాయని, వారి భద్రతకు ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని నిత్యానంద రాయ్ వెల్లడించారు.