More

  స్టాలిన్ నోట హిందుత్వం మాట..!

  ఆ పార్టీ పుట్టిందే నాస్తికవాదం పునాదిపైనా…! పైగా హిందుత్వాన్ని వ్యతిరేకించడమే ఆ పార్టీ అజెండా ఉండేది. అంతేకాదు రాముడిని దూషించిన పార్టీగా కూడా దానికి పేరు..! ఇక మీకు అర్థమైపోయి ఉంటుంది. ఆ పార్టీ పేరేంటో. డీఎంకే పార్టీ ప్రస్తుతం పదేళ్ళపాటు అధికారానికి దూరంగా ఉంది. ఆ పార్టీకి పెద్దదిక్కుగా ఉన్న కరుణానిధి కాలం చేశారు. పార్టీ పగ్గాలు స్టాలిన్ కు దక్కాయి. తమ కుటుంబం నుంచి ముచ్చటగా మూడో వారసుడినిగా కూడా రంగంలోకి దించారు. ఈ సారి ఎలాగైనా సరే అధికారంలోకి రావాలనే లక్ష్యంతో స్టాలిన్ ప్రచారం నిర్వహిస్తున్నాడు.

  2016లో జరిగిన ఎన్నికల్లో అన్నాడీఎంకే పార్టీ కూటమి 136 స్థానాలను గెలుచుకుని వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చింది. డీఎంకే పార్టీ 98 సీట్లు మాత్రమే గెలుచుకుంది. అన్నాడీఎంకే కు 40.88 శాతం ఓట్లు రాగా…, డీఎంకే పార్టీకి 39.85 శాతం ఓట్లు వచ్చాయి. కేవలం రెండు శాతం ఓట్ల తేడాతో అన్నాడీఎంకే చేతిలో డీఎంకే పరాజయం పాలైంది. 2016లో జరిగిన ఎన్నికల్లో అన్నాడీఎంకేను జయలలితా ఒంటిచెత్తో గెలిపించారు. ఆమె కన్నుమూయడంతో అన్నాడీఎంకే నాయకత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. శశికళ జైలుకు వెళ్లి రావడం, తాను ఎంతగానో నమ్మి సీఎం పదవిలో కూర్చొబెట్టిన  పళనిస్వామి ఎదురుతిరగడం, అలాగే పార్టీ నుంచి విడిపోయిన పన్నీర్ సెల్వం… పళనిస్వామి ఒక్కటై ఇప్పుడు అన్నాడీఎంకేను నడిపిస్తున్నారు. చక్రం తిప్పుతారనుకున్న శశికళ రాజకీయ సన్యాసం ప్రకటించారు. అయితే అన్నాడీఎంకే ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల కారణంగా…ఆ పార్టీకి కొంత అనుకూలత ఉందని గుర్తించిన డీఎంకే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అందివచ్చిన ఏ ఒక్క అంశాన్ని వదిలి పెట్టకూడదనే తలంపుతో… డీఎంకే ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పనలో హిందుత్వ కార్డుకు సంబంధించి కొన్ని సలహాలు ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది.

  దీంతో మొదటి నుంచి కూడా హిందుత్వాన్ని ద్వేషించే పార్టీగా ముద్రపడిన డీఎంకే పార్టీ తొలిసారిగా తన మెనిఫెస్టోలో హిందుత్వకు ప్రాధాన్యం ఇచ్చింది. రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధి కోసం రూ. 1000 కోట్లు కేటాయిస్తామని తెలిపింది. తమిళనాడులో దాదాపు 43వేల హిందూ ఆలయాలు ఉన్నాయి. వీటిలో కొన్ని జీర్ణావస్థలో ఉన్నాయి. వాటిని తిరిగి పునరుద్ధించడంతోపాటు, లక్షల ఏకాల ఆలయాల భూములను పరిరక్షిస్తామని తెలిపింది.  తిరుత్తణి, శోలింగార్‌, తిరునీర్‌మలై, తిరుచ్చి, మలైకొట్టై, తిరుచెంగాడ్‌ ఆలయాల్లో కేబుల్‌ కార్‌ సౌకర్యం ఏర్పాటు చేయడంతోపాటు, తిరువణ్ణామలైలో గిరిప్రదక్షిణం చేసే మార్గం చుట్టుతా హరిత వననాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. అలాగే గిరి ప్రదక్షిణం పరిధిలోని ఆలయాలను సైతం మరింత అభివృద్ధి పరుస్తామని తెలిపింది. అంతేకాదు కాశీ, కేదార్ నాథ్, బదరీనాథ్, పురి, గోకర్ణం, తిరుపతి, రామేశ్వరం,మథురతోపాటు దేశంలోని ఏ ప్రముఖ ఆలయానికి వెళ్లేందుకైనా రూ.  25 వేల నుంచి లక్ష రూపాయల వరకు సాయం అందజేస్తామని డీఎంకే తన ఎన్నికల మేనిఫెస్టోలో తెలిపింది.

  మరోవైపు డీఎంకే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హిందుత్వ హమీలను బీజేపీతోపాటు అన్నాడీఎంకే నేతలు వంటి బూటకంగా అభివర్ణించారు. హిందుత్వవాదులు..సాధారణ భక్తజనం అంతా కూడా తమ కూటమికే ఓట్లు వేస్తారని రెండు పార్టీల నేతలు చెప్పుకొస్తున్నారు. ఏదీ ఏమైనా… ద్రావిడవాదం, వేర్పటువాదం వినిపించిన పార్టీలు తాజాగా అనుసరిస్తున్న హిందూ అజెండాను స్వాగతిస్తున్నారు. అయితే ఓన్లీ ఎన్నికల టైమ్ లోనే డీఎంకే వంటి పార్టీలకు హిందువులు గుర్తుకువచ్చారా అంటూ కొంతమంది నెటిజన్లు ఆ పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు.

  Trending Stories

  Related Stories