More

  హిందూ ఆలయాలు కూల్చేస్తున్న స్టాలిన్ సర్కార్..!

  ఆలయం ఓ శక్తి క్షేత్రం. హిందువుల జ్ఙానకేంద్రం. హైందవ ధర్మానికి నిలువుటద్దం. ఆలయాన్ని, హిందూ ధర్మాన్ని వేరు చేసి చూడలేం. అసలు హైందవ చరిత్రకు పునాదులు ఆలయలే అనడంలో అతిశయోక్తి లేదు. ఆలయమే లేకుంటే హిందువు మనుగడ ప్రశ్నార్థకమే. ఇందులో ఎలాంటి సందేహం లేదు. హిందువుల జీవనానికి ఆయువుపట్టు ఆలయం. అందుకే, భారత దేశంపై జరిగిన దండయాత్రల్లో.. విదేశీయులు మొదట లక్ష్యంగా చేసుకున్నది ఆలయాలనే. ఆయువుపట్టుపై దెబ్బకొడితే.. ఎవరైనా బలహీనులు అవుతారు. మొదట ఆలయాన్ని ధ్వంసం చేస్తే.. హిందూ ధర్మం బలహీనవుతుందని.. ఆ తర్వాత హిందువులను సులభంగా మతం మార్చేయవచ్చని భావించారు. అరబ్బులు, మహమ్మదీయులు, తురుష్కులు, తైమూర్లు, సుల్తానులు, మొఘలు.. ఆ తర్వాత వచ్చిన డచ్, ఫ్రెంచ్, పోర్చుగీసు, బ్రిటీషర్లు లక్షలాది హిందూ ఆలయాలను ధ్వంసం చేశారు. హైందవ సాహిత్యాన్ని, విశ్వవిద్యాలయాలను నాశనం చేశారు.

  ముఖ్యంగా మొఘలుల కాలంలో అనేక దేవాలయాలు ధ్వంసమయ్యాయి. మొదటి మొఘల్ చక్రవర్తి బాబర్ అయోధ్యలో పురాతన రామాలయాన్ని కూల్చేసి.. దానిపై మసీదును నిర్మిస్తే.. ఆ తర్వాత వచ్చిన అతని వారసులు వేలాది ఆలయాలను నేలమట్టం చేశారు. చివరి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు.. ఎన్నో చారిత్రక పుణ్యక్షేత్రాలను ధ్వంసం చేయించాడు. సోమనాథ్ దేవాలయం, శ్రీకృష్ణుడి జన్మస్థానమైన మధురలోని కేశవ్ దేవ్ మందిరం, కాశీలోని విశ్వనాథ మందిరం, విశ్వేశ్వరుడి దేవాలయం, ఉజ్జయినీ.. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఔరంగజేబ్ మతోన్మాదానికి ఎన్నో ఆలయాలు నేలమట్టమయ్యాయి. ఇక, ఢిల్లీ సుల్తానులు, ఆంగ్లేయుల కాలంలోనూ లెక్కలేనన్ని దేవాలయాలు ధ్వంసమయ్యాయి.

  అయితే, దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత కూడా.. ఈ ఆలయాల ధ్వంసరచన కొనసాగుతుండటం విషాదకరం. పాలకుల స్వార్థపూరిత రాజకీయాలకు దేశంలో ఎన్నో ప్రముఖ ఆలయాలతో పాటు.. చిన్న చిన్న దేవాలయాలు కూడా బలవుతున్నాయి. చివరికి గ్రామ దేవతలను కూడా వదలడం లేదు. ఎక్కడపడితే అక్కడ విగ్రహాల ధ్వంసరచన కొనసాగుతూనేవుంది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతిరోజూ ఏదో ఒక చోట ఆలయం కూలిపోయిందనో.. లేక, విగ్రహాన్ని ధ్వంసం చేశారనో.. ఇలా ఏదో ఒక దుర్వార్త వినాల్సివస్తోంది. ముఖ్యంగా ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఆలయాలు కూల్చివేతలకు అడ్డూ అదుపూ లేకుండాపోయింది. దీదీ పాలనలో హిందూ ఆలయాలకు రక్షణ కరువైంది. దక్షిణాది రాష్ట్రాల్లోనూ అనేక ఆయాలు కూల్చివేతకు గురవుతున్నాయి.

  తెలుగు రాష్ట్రాల్లో మతోన్మాద రక్కసులు రెచ్చిపోతున్నారు. ఎన్నో ఆలయాలను, విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. మన కాలనీలో, మన ఇంటి పక్కనే వున్న ఆలయం.. మళ్లీ రేపు చూస్తామో లేదో అనేలా వుంది ప్రస్తుత పరిస్థితి. ఏపిలో రోజుకో ఆలయం చొప్పున కుప్పకూలిపోతున్నాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కొన్నాళ్ల క్రితం ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అంతర్వేదిలో రథం కాలిబూడిదైపోయింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైంది. ఈ ఘటనకు బాధ్యులెవరో.. ఏపీ ప్రభుత్వం ఇప్పటికీ గుర్తించలేకపోయింది. గతేదాడి విజయనగరం జిల్లా రామతీర్థంలో.. 400 ఏళ్ల చరిత్ర కలిగిన కోదండరామాలయంలోని రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. విగ్రహం నుంచి తల భాగాన్ని వేరు చేశారు. అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైంది. హిందూ ధార్మిక సంఘాలు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

  2021 జనవరిలో కర్నూలు జిల్లా కోసిగిలోనని మర్లబండ ఆంజనేయస్వామి ఆలయంలో.. దుండగులు సీతారాముల విగ్రహాన్ని ధ్వంసం చేశారు. మొన్నటికి మొన్న.. చిత్తూరు జిల్లాలోని గంగాధనెల్లూరు మండలం అగరమంగళంలోని ఓ దేవాలయంలో నంది విగ్రహాన్ని ఎవరో గుర్తు తెలియని దాడి చేసి ధ్వంసం చేశారు. ఇటీవల కృష్ణా జిల్లాలో ఓ పురాతన దేవాలయంలోని నంది విగ్రహాన్ని అర్థరాత్రి గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలంలో శివాలయం దగ్గరలో గల శ్రీ సీతారామాంజనేయ వ్యాయామ కళాశాల వద్ద ఆంజనేయ స్వామి విగ్రహం చేయిని గుర్తు తెలియని దుండగులు విరగ్గొట్టారు. దాదాపు ఏపీలో రోజుకో ఆలయం విధ్వంసానికి గురవుతున్నా.. జగన్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది.

  అటు, తెలంగాణలోనూ అడపాదడపా ఆలయాలు గురవుతున్నాయి. ఇటీవల హైదరాబాద్ లోని కూకట్‌పల్లి ప్రాంతంలోని సప్దర్ నగర్ దుర్గామాత ఆలయంలోని దేవతా విగ్రహాలను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఒక విగ్రహాన్ని పూర్తిగా తొలగించడంతోపాటు నాగదేవత విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఇది మచ్చుకుమాత్రమే. ఇలా ఓవైపు మతోన్మాదులు, దుండగుల చేతుల్లో ఆలయాలు విధ్వంసానికి గురవుతుంటే.. మరోవైపు కొన్ని ఆలయాలను ప్రభుత్వమే కూల్చివేస్తోంది. రోడ్డుకు అడ్డొస్తొందనే లేదా మరేదైనా కారణం చేతనో గుళ్లను కూల్చివేస్తున్నారు. చంద్రబాబు హయాంలో విజయవాడ నగరంలో పదులకొద్ది ఆలయాలను ప్రభుత్వం దగ్గరుండి మరీ కూల్చివేయించింది. కృష్ణ పుష్కరాల సమయంలో అనేక ఆలయాలను నేలమట్టం చేయించింది. అటు తాత్కాలిక రాజధాని అమరావతికి దగ్గరగా వుండటంతో.. వాహనాల రాకపోకలకు అడ్డంకిగా వుంటాయన్న సాకుతో నాడు చంద్రబాబు సర్కార్ పలు ఆలయాలను కూల్చివేసింది. వీటిలో చిన్నా, చితక, ఓ మోస్తరు పేరున్న ఆలయాలతో పాటు.. శతాబ్దాల నాటి చరిత్ర ఉన్న పురాతన ఆలయాలను కూడా వున్నాయి. దీనిపై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు ఎదురైనప్పటికీ.. పెద్దగా పట్టించుకోలేదు.

  తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దక్షిణాది రాష్ట్రాలైన కర్నాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఆలయాల విధ్వంసం యదేచ్ఛగా జరుగుతోంది. ముఖ్యంగా స్టాలిన్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. తమిళనాడులో ఆలయాల విధ్వంసం మరింత పెరిగింది. తాజాగా స్టాలిన్ సర్కార్ ఘోర పాతకానికి పాల్పడింది. అసలు డీఎంకే అంటేనే.. హిందూ వ్యతిరేక పార్టీని చెబుతూవుంటారు. అలాంటి పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో హిందువు వ్యతిరేక చర్యలు మరింత పెరిగిపోయాయి. స్టాలిన్ సీఎం పదవి చేపట్టిన రెండు నెలల్లోనే తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రాష్ట్రంలో హిందువుల గుర్తింపును చెరిపేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. హిందూ దేవాలయాలను నిర్దాక్షణ్యంగా కూల్చివేసే ప్రక్రియను ప్రారంభించాడు.

  తాజాగా ఆక్రమణల తొలగింపు పేరుతో.. కోయంబత్తూర్ కార్పొరేషన్ ఏకంగా ఏడు దేవాలయాలను కూల్చేసింది. ముత్తన్నకుళం ట్యాంక్ బండ్ వెంబడి వున్న ప్రముఖ ఆలయాలను నేలమట్టం చేసింది. ముత్తన్నకుళం చెరువు పునరుద్ధరణలో భాగంగా.. 2020 ప్రారంభంలో కార్పొరేషన్ దాదాపు 2,400 కుటుంబాలను ట్యాంక్ బండ్ నుంచి తొలగించింది. స్టాలిన్ ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా ఆలయాలనే కూల్చివేసింది. అయితే, విషయం తెలిసిన హిందూ మున్నానీ పార్టీ.. కూల్చివేతలకు వ్యతిరేకంగా నిరసనకు దిగింది. దీంతో పోలీసులు 240 మంది మున్నానీ సభ్యులను అరెస్ట్ చేసి మరీ ఆలయాలను కూల్చివేశారు.

  పైగా ఆలయాలను కూల్చివేసినట్టు కార్పొరేషన్ గర్వంగా ప్రకటించుకోవడం వారికే చెల్లింది. మొత్తం 90 ఎకరాల విస్తీర్ణం కలిగిన ముత్తన్నకుళం చెరువులో 15 ఎకరాలు ఆక్రమణకు గురైందని.. ఆ ఏరియాలో వున్న అక్రమ కట్టడాలన్నీ తొలగించామని.. కోయంబత్తూరు కార్పొరేషన్ అధికారులు ప్రకటించారు. ఇందులో భాగంగా ఏడు ఆలయాలను తొలగించామని.. ఆరు విగ్రహాలను స్థానిక ప్రజలకు అప్పగించామని.. మరో విగ్రహాన్ని కార్పొరేషన్ కార్యాలయంలో వుంచామని గొప్పంగా చెప్పుకున్నారు. ఇదిలావుంటే, ఆలయాల కూల్చివేతలపై హిందూ మున్నానీ పీఆర్వో సి. ధనగోపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందు విగ్రహారాధనకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరినప్పటికీ.. కార్పొరేషన్ ఏకపక్షంగా వ్యవహరించిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉదయం ఆరు గంటల ప్రాంతంలో ఎవరికీ సమాచారం ఇవ్వకుండా కూల్చివేతలకు పాల్పడ్డారని అన్నారు. మీడియా కంట పడకుండా తెల్లవారుఝామున ఆలయాల కూల్చివేతకు పాల్పడటం.. డీఎంకే కుట్రకు అద్దం పడుతోంది.

  ఏకపక్షంగా వ్యవహరిస్తున్న స్టాలిన్ సర్కార్ కేవలం హిందూ దేవాలయాలను మాత్రమే కూల్చడం పనిగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఇతర మతాలకు చెందిన ప్రార్థనాలయాలలో మాత్రం.. అనుకూలంగా వ్యవహరిస్తోంది. చెన్నైకి కేవలం 95 కిలోమీటర్ల దూరంలో క్రిస్టియన్ మాఫియా చేతిలో ఎన్నో అక్రమాస్తులున్నాయి. కానీ, వీటి విషయంలో స్టాలిన్ ప్రభుత్వం ఉదారంగా వ్యవహరిస్తోంది. చెంగల్పట్టులోని ఆచరపక్కం ప్రాంతంలో వున్న వజ్రగిరి కొండను చర్చి మాఫియా స్వాధీనం చేసుకుంది. వజ్రగిరి కొండపై 1500 ఏళ్ల చరిత్ర కలిగిన శివాలయం వుంది. అయితే, ఆ ప్రాంతాన్ని క్రైస్తవ మిషనరీలు ఆక్రమించకున్నాయి. హిందువులు శివాలయానికి వెళ్లకుండా అడ్డుపడుతున్నారు. పైగా 60 ఎకరాల భూమిని అటవీ భూమిగా క్రైస్తవ మిషనరీలు ఆరోపిస్తున్నాయి. అయినా, డీఎంకే సర్కార్ మాత్రం పట్టించుకోవడం లేదు.

  ద్రవిడ భావజాలం నుంచి పుట్టిన డీఎంకే.. ఎన్నోసార్లు హిందూ వ్యతిరేక, బ్రాహ్మణ వ్యతిరేక పార్టీగా ముద్రవేయించుకుని అభాసుపాలైంది. గతంలో దివంగత డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి రాముడిని తాగుబోతు అంటూ హిందూ వ్యతిరేక వైఖరిని ప్రదర్శించాడు. అంతేకాదు, హిందూ అనే పదానికి దొంగ అనే అర్థాన్ని అపాదిస్తూ.. హిందువుల ఆగ్రహానికి గురయ్యాడు. హిందూ అంటే దొంగ అని.. ఈ విషయాన్ని పెరియార్ రామస్వామి చెప్పారని అన్నాడు. ఇప్పుడు ఆయన వారసత్వాన్ని చేతుల్లోకి తీసుకున్న ఎం.కె. స్టాలిన్.. డీఎంకే హిందూ వ్యతిరేక వైఖరిని మరింత బలంగా ముందుకు తీసుకెళ్తున్నాడు. బ్రాహ్మణులు ధరించే గాయత్రి దారాన్ని తెంపివేసి.. వారు హిందువుల పండుగల్లో పూజలు చేయకుండా నిరోధించడం దగ్గర్నుంచి.. హిందూ వ్యతిరేకత విషయంలో డీఎంకే ఏ అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు.

  కుహనా లౌకిక పునాదులపై వెలసిన డీఎంకే.. ఎప్పుడూ హిందూ మతంపైనే తన అక్కసును వెళ్లగక్కుతూవుంటుంది. క్రైస్తవ లేదా ఇస్లామిక్ సంస్థలు ఎన్ని ఆక్రమణలకు పాల్పడినా.. వాటికి వ్యతిరేకంగా పోరాడే ధైర్యం ఆ పార్టీకి గానీ, ఆ పార్టీ వారసత్వ నాయకుడు స్టాలిన్ కు గానీ లేదు. ఒకవేళ, అలా చేస్తే, తమ విజయానికి కారణమైన ఓటు బ్యాంకును చేజేతులా కోల్పోయినట్టే. అదీ వారి భయం. అయినా.. ఇలాంటి హిందూ వ్యతిరేక పార్టీలకు అధికారం కట్టబెడుతున్నన్ని రోజులు.. హిందువులకు ఈ కష్టాలు తప్పవు. ఏదేమైనా.. కోయంబత్తూర్ ఆలయాల కూల్చివేత ఘటన.. డీఎంకేకు సనాతన హిందూ ధర్మం, దేవాలయాలు, నమ్మకాలు, ఆచారాల పట్ల వున్న ఏహ్యభావాన్ని స్పష్టం చేస్తోంది.

  Related Stories