More

    నిన్న సర్కార్ వెనక్కి తగ్గింది.. నేడు గవర్నర్ ఆమోదించింది..!

    తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం మధ్య కొంతకాలంగా కొనసాగుతోన్న ప్రచ్ఛన్న యుద్ధానికి తెర పడినట్టే కనిపిస్తోంది. ఘర్షణ వైఖరికి పుల్ స్టాప్ పడింది. ఎట్టకేలకు 2023-2024 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌కి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం తెలిపారు. సోమవారం పుదుచ్చేరిలో ఉన్న ఆమె… మంగళవారం ఉదయమే బడ్జెట్‌ని ఆమోదించినట్లు తెలిసింది. గ్రీన్ సిగ్నల్ రావడంతో.. బీఆర్ఎస్ ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది.

    అంతకుముందు తమిళిసైపై న్యాయపరమైన యుద్ధానికి దిగిన కేసీఆర్ ప్రభుత్వం.. కొన్ని గంటల వ్యవధిలోనే అనూహ్యంగా ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో- బడ్జెట్ ప్రతిపాదనలు, ప్రసంగానికి రాజ్ భవన్ ఇంకా ఆమోదం తెలపట్లేదనే కారణంతో కేసీఆర్ ప్రభుత్వం న్యాయపోరాటానికి దిగింది. ఇందులో భాగంగా తమిళిసై సౌందరరాజన్ పై హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేసింది. ఈ నెల 3వ తేదీన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ప్రారంభించాల్సి ఉందని, దీనికి అవసరమైన ప్రతిపాదనలను రాజ్ భవన్ కు పంపించినప్పటికీ ఇంకా ఆమోదం లభించట్లేదని చెప్పింది.

    ఈ ప్రతిపాదనలను ఆమోదించేలా గవర్నర్ కార్యాలయాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు లంచ్ మోషన్ పిటీషన్ ను దాఖలు చేసింది. ఈ పిటీషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించిన ప్రస్తుత పరిస్థితుల్లో కేసీఆర్ ప్రభుత్వం ఆ వెంటనే అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఈ పిటీషన్ ను ఉపసంహరించుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు హైకోర్టు ధర్మాసనానికి సమాచారాన్ని పంపించింది. ప్రభుత్వ తరఫు న్యాయవాది దుష్యంత్ దవే ఈ విషయాన్నీ వెల్లడించారు.

    తాజాగా చోటు చేసుకున్న ఈ పరిణామంతో కేసీఆర్ ప్రభుత్వం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీల్లో సవరణలను చేసింది. ముందుగా నిర్దేశించుకున్న షెడ్యూల్ ప్రకారం.. ఫిబ్రవరి 3వ తేదీన ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు బడ్జెట్ ప్రతిపాదనలను ప్రవేశపెట్టాల్సి ఉంది. దీనికి ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకుంది కూడా. తాజాగా సంభవించిన ఈ పరిణామంతో ఈ తేదీలో మార్పులు చేసింది. 6వ తేదీకి వాయిదా వేసింది.

    కేసీఆర్ సారథ్యంలోని భారత్ రాష్ట్ర సమితి ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోన్నది. ఆగస్టు-సెప్టెంబర్ మధ్య షెడ్యూల్ వెలువడటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. దీని ప్రకారం చూస్తే ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్ అవుతుంది. వచ్చే బడ్జెట్ ను కొత్త ప్రభుత్వం ప్రతిపాదించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో బడ్జెట్ సమావేశాలను సజావుగా కొనసాగింపజేసేలా కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అంటోన్నారు.

    Trending Stories

    Related Stories