నంద్యాల జిల్లా: కార్తీక మాసోత్సవాల సందర్భంగా శ్రీశైలంలోని మల్లన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు కూడా కలిసిరావడంతో క్షేత్రం భక్తులతో కిక్కిరిసింది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుండి సైతం శ్రీశైల ముక్కంటి క్షేత్రానికి భారీగా తరలివచ్చారు. వేకువజామునే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి భక్తి భావంతో కార్తీక దీపాలను వెలిగించారు. శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా కార్తీకమాసంలో ప్రభుత్వ సెలవు, కార్తీక సోమవారాలు స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే భక్తులను అనుమతిస్తామని ఈవో లవన్న తెలిపారు. మరోవైపు వేకువ జామున నుంచే ఆలయ క్యూలైన్ల ద్వారా స్వామి అమ్మవార్లను దర్శించుకుని ఆలయ ముందు భాగంలో గల గంగాధర మండపం వద్ద ఉత్తర శివమాడవీధిలో ఉసిరిచెట్ల వద్ద భక్తులు కార్తీక దీపాలను వెలిగించి కార్తీక నోములు నోచుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ ఈవో ఎస్.లవన్న తెలిపారు.