పాకిస్తాన్ లో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. శ్రీలంక జాతీయుడిపై దాడిచేసి, సజీవ దహనం చేశారు. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు రేపింది. దైవదూషణ ఆరోపణలపై శ్రీలంకకు చెందిన వ్యక్తిని చిత్ర హింసలు పెట్టి నడిరోడ్డుపై సజీవ దహనం చేశారు.
సియోల్‌కోట్‌లోని వజీరాబాద్ రోడ్డులో ఉన్న ఓ ప్రైవేటు ఫ్యాక్టరీలో శ్రీలంకకు చెందిన ప్రియాంత కుమార (40) ఎక్స్‌పోర్టు మేనేజరుగా పనిచేస్తున్నారు. తెహ్రీక్-ఇ-లబ్బైక్ పాకిస్థాన్ (టీఎల్‌పీ) అనే కరడుగట్టిన మతవాద సంస్థ ఆయన కార్యాలయానికి సమీపంలోని గోడపై ఓ పోస్టరు అంటించింది. ఆ పోస్టర్‌పై ఖురాన్ పద్యాలు ముద్రించి ఉన్నాయి. తన కార్యాలయ గోడపై అంతికించిన ఆ పోస్టరును ప్రియాంత చింపి చెత్తబుట్టలో పడేశారు. అది గమనించిన కార్మికులు విషయాన్ని తోటి కార్మికులకు చెప్పడంతో వారిలో ఆగ్రహం పెరిగిపోయింది. అందరూ కలిసి అతడి కార్యాలయం వద్దకు చేరుకుని నినాదాలు చేశారు. దైవదూషణకు పాల్పడ్డాడంటూ ఆగ్రహం వ్యక్తం చేసి మూకుమ్మడిగా దాడిచేశారు. దాడిలో తీవ్రంగా గాయపడిన ప్రియాంతను బతికి ఉండగానే మంటలు అంటించి తగలబెట్టేశారు. ఈ ఘటనను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడంతో వైరల్ అయింది.

సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ ఈ ఘటనపై తీవ్రస్థాయిలో స్పందించారు. నిందితులను వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ స్పందిస్తూ.. సియోల్‌కోట్ ఫ్యాక్టరీపై జరిగినది భయంకరమైన దాడి అని.. సజీవంగా దహనం చేయడం పాక్ కు మాయనిమచ్చ అన్నారు. ఈ కేసు దర్యాప్తును తాను స్వయంగా పర్యవేక్షిస్తానని చెప్పారు. నిందితుల్లో ఏ ఒక్కరినీ వదిలి పెట్టబోమని, చట్టప్రకారం వారిని కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు.

శుక్రవారం నాటి ఘటన రాజధాని ఇస్లామాబాద్‌కు ఆగ్నేయంగా 200 కిలోమీటర్ల (125 మైళ్లు) దూరంలో ఉన్న సియాల్‌కోట్‌లో చోటుచేసుకుంది. సోషల్ మీడియాలో పంచుకున్న అనేక భయంకరమైన వీడియో క్లిప్‌లు దైవదూషణకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బాధితుడిని కొట్టడాన్ని చూపించాయి. పలు వీడియోలలో అతని శరీరానికి నిప్పంటుకోవడం, అతని కారును ధ్వంసం చేయడం చూడొచ్చు. గుంపులో చాలా మంది తమ గుర్తింపును దాచడానికి ప్రయత్నించలేదు. ఇంకొందరు కాలిపోతున్న శవం ముందు సెల్ఫీలు తీసుకున్నారు.

ఇప్పటికే 50 మందిని పోలీసులు అరెస్టు చేసినట్లు పంజాబ్ ప్రభుత్వ అధికార ప్రతినిధి హసన్ ఖవార్ లాహోర్‌లో విలేకరులతో అన్నారు. 48 గంటల్లోగా విచారణ పూర్తి చేయాలని ఆదేశించామని.. సీసీటీవీ ఫుటేజీలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నామని తెలిపారు. సోషల్ మీడియా వీడియోలలో వినిపించిన నినాదాలు, దైవదూషణ వ్యతిరేక పార్టీ అయిన తెహ్రీక్-ఇ-లబ్బైక్ పాకిస్తాన్ (TLP) మద్దతుదారులు ఉపయోగించారు. గతంలో ఫ్రాన్స్ వ్యతిరేక ప్రచారంతో సహా నిరసనలతో దేశాన్ని స్తంభింపజేసింది. దీంతో ఫ్రాన్స్ దేశస్థులు దేశం విడిచి వెళ్లిపోయారు. ఇప్పుడు ఈ ఘటన కారణంగా పాకిస్తాన్ లోకి అడుగుపెట్టాలంటేనే ఇతర దేశస్థులు భయపడుతూ ఉన్నారు.
