Sports

ఇంత దారుణమైన జట్టు ఏంటండీ.. శ్రీలంక చెత్త రికార్డు..!

శ్రీలంక క్రికెట్ జట్టు.. ఒకప్పుడు అద్భుతమైన ఆటగాళ్లు ఆ జట్టులో ఉండే వారు. సంగక్కర, జయవర్ధనే, దిల్షాన్ వంటి స్టార్ ఆటగాళ్లు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత జట్టులో నమ్ముకోదగ్గ ఆటగాళ్లు లేకుండా పోయారు. అప్పుడప్పుడు మెరుపులు తప్పితే ఒక ఛాంపియన్ జట్టు ఎంతో దారుణంగా తయారైపోయింది. ఇటీవలి కాలంలో వరుస ఓటములు ఆదేశానికి ఎదురవుతూ ఉన్నాయి. స్వదేశంలో అయినా విదేశంలో అయినా శ్రీలంక ఆట తీరు మాత్రం మారలేదు. ఇటీవలే ఇంగ్లండ్ టూర్ కు వెళ్లిన లంకకు వరుస పరాజయాలు ఎదురవుతూ ఉండడంతో ఇంత దారుణమైన జట్టు ఎవరు సెలెక్ట్ చేశారు అంటూ విమర్శలు వచ్చాయి. శ్రీలంక అభిమానులు సోషల్ మీడియాలో ఆ దేశ క్రికెటర్లను అన్ ఫాలో చేయడం.. దారుణమైన వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది.

తాజాగా శ్రీలంక అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకుంది. వన్డేల్లో ఎక్కువ మ్యాచ్ లు ఓడిపోయిన టీమ్ గా నిలిచింది. ఇంగ్లండ్ తో జరుగుతున్న వన్డే సిరీస్ లో ఓటముల కారణంగా ఆ దేశం జాబితాలో 428 పరాజయాలు వచ్చి చేరాయి. ఇప్పటిదాకా 858 మ్యాచ్ లను శ్రీలంక ఆడింది. అందులో 390 విజయాలను నమోదు చేసింది. ఈ జాబితాలో శ్రీలంక తర్వాత భారత్ ఉంది. భారత్ మొత్తంగా ఇప్పటిదాకా 993 మ్యాచ్ లు ఆడి 427 ఓడిపోయింది. గెలుపు రేటు పరంగా చూస్తే శ్రీలంక కన్నా భారత్ మెరుగైన స్థానంలోనే ఉంది. 54.67 శాతం మ్యాచ్ లను టీమిండియా గెలిస్తే.. 47.69 శాతం మ్యాచ్ లను శ్రీలంక గెలిచింది. పాకిస్థాన్ 414 ఓటములతో మూడో స్థానంలో ఉంది. టీ 20లోనూ అత్యధిక మ్యాచ్ లు ఓడిపోయిన జట్టుగా శ్రీలంక ఉంది. మొత్తం 70 మ్యాచ్ లను ఆ టీమ్ చేజార్చుకుంది. ఆ తర్వాత వెస్టిండీస్ 67 మ్యాచ్ లు, పాకిస్థాన్ 65 మ్యాచ్ లు ఓడిపోయాయి.ప్రస్తుతం జులై 13 నుంచి ఆరంభం కాబోతున్న సిరీస్ లో శిఖర్ ధావన్ నేతృత్వంలోని భారత్ ను ఆ జట్టు ఎదుర్కోబోతోంది.

భారత్ ఇప్పుడు రెండు జట్లను పంపిస్తూ ఉంది. ఒక జట్టు ఇంగ్లండ్ లో ఉండగా.. ఇంకో జట్టు లంకకు బయలుదేరింది. బీసీసీఐ శిఖర్ ధావన్ నేతృత్వంలో మరో జట్టును ఎంపిక చేసి శ్రీలంక పర్యటనకు పంపింది. దీనిపై శ్రీలంక మాజీ సారథి అర్జున రణతుంగ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జులై 13 నుంచి భారత్, శ్రీలంక మధ్య పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్ లు జరగనున్నాయి. ధావన్ నేతృత్వంలోని భారత జట్టులో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నప్పటికీ రణతుంగ మాత్రం ఇది ద్వితీయ శ్రేణి జట్టు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. శ్రీలంక వచ్చిన భారత జట్టు వారి అత్యుత్తమ జట్టు కాదు. ఇదొక ద్వితీయ శ్రేణి జట్టు. దేశ క్రీడల మంత్రికి, క్రికెట్ బోర్డు పెద్దలకు ఈ విషయం తెలియదా అని అడిగారు. ర్యాంకింగ్స్ లో శ్రీలంక కిందికి పడిపోయి ఉండొచ్చు గాక, కానీ క్రికెట్ ఆడే దేశంగా శ్రీలంకకు మంచి గుర్తింపు ఉందని అన్నారు. భారత బి జట్టుతో మన అత్యుత్తమ జట్టును ఆడించరాదని పేర్కొన్నారు. టెలివిజన్ ప్రసారహక్కుల కారణంగానే ఈ సిరీస్ ఒప్పుకున్నారని రణతుంగ ఆరోపించారు. ప్రత్యర్థి బి టీమ్ అయినా సరే మ్యాచ్ లు ఆడించి డబ్బు సంపాదించాలని శ్రీలంక క్రికెట్ బోర్డు భావిస్తోందని విమర్శించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

4 × 5 =

Back to top button