Sports

కోపంతో ఊగిపోయిన శ్రీలంక కోచ్

భారత్-శ్రీలంక జట్ల మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ లో ఒకానొక దశలో భారత్ కు శ్రీలంక జట్టు షాక్ ఇచ్చేలా కనిపించింది. 276 పరుగుల లక్ష్యాన్ని చేరుకోడానికి భారత్ చాలానే కష్టపడింది. 116 పరుగులకే అయిదు వికెట్లు కోల్పోయిన భారత్ కు సూర్య కుమార్ యాదవ్ ఉన్నాడు.. మ్యాచ్ ను ఫినిష్ చేస్తాడని అనుకున్నారు. కానీ సూర్య హాఫ్ సెంచరీ అవ్వగానే పెవిలియన్ చేరాడు. ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యా మీద భారం పడగా.. 193 పరుగుల వద్ద ఏడో వికెట్ గా కృనాల్ వెనుదిరిగాడు. శ్రీలంక విజయం దిశగా దూసుకుపోతూ కనిపించింది. కానీ దీపక్ చాహర్ బ్యాట్ తో అద్భుతంగా రాణించాడు. అతడికి భువనేశ్వర్ కుమార్ అండగా నిలబడడంతో భారత్ మూడు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.

ఇక శ్రీలంక జట్టు గెలుస్తున్న సమయంలో ఎంతో ఆనందంగా కనిపించిన శ్రీ‌లంక ప్రధాన కోచ్‌ మికీ ఆర్థర్‌.. ఆ తర్వాత శ్రీలంక జట్టు పట్టు కోల్పోతూ ఉంటే చూడకుండా ఉండలేకపోయాడు. కిందకూ పైకీ తిరుగుతూ కనిపించగా.. ఒకానొక దశలో గ్రౌండ్ లోకి కూడా వచ్చేశాడు. మ్యాచ్‌ చివరి ఓవ‌ర్ల స‌మ‌యంలో ఆర్థర్ మైదానంలోకి వచ్చి కెప్టెన్‌ షనకతో మాట్లాడారు. అదే స‌మ‌యంలో షనక కూడా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు. ఆ స‌మ‌యంలో ఇద్ద‌రి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. మికీ ఆర్థర్‌కు, దాసున్ షనకల మధ్య వాగ్వివాదంకు సంబంధించిన వీడియో వైర‌ల్ అవుతోంది. శ్రీ‌లంక ఆట‌గాళ్లు మ్యాచుపై ప‌ట్టు కోల్పోతున్న స‌మయంలో డ్రెస్సింగ్‌ రూమ్‌లో కోపంతో ఊగిపోయిన ఆర్థ‌ర్ ఆట‌గాళ్ల‌పై తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారు. గెలిచే ఛాన్స్ ను కోల్పోతున్నామనే తాపత్రయం శ్రీలంక కోచ్ లో కనిపించింది.

మూడు వన్డేల సిరీస్ లో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ సిరీస్‌ను కైవసం చేసుకుంది. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ దీపక్ చాహర్ 82 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్‌తో అజేయంగా 69 పరుగులు చేసి సిరీస్ విజయాన్ని అందించాడు. శ్రీలంక నిర్దేశించిన 276 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత జట్టు 116 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. పృథ్వీషా (13) ఇషాన్ కిషన్ (1) ఈసారి విఫలమయ్యారు. కెప్టెన్ శిఖర్ ధవన్ 29 పరుగులు చేసి అవుటయ్యాడు. మనీష్ పాండే (37), సూర్యకుమార్ యాదవ్ (53), కృనాల్ పాండ్యా (35) ఆదుకున్నారు. భారత ఓటమి ఖాయమనుకున్న వేళ చాహర్, భువనేశ్వర్ (19 నాటౌట్)తో కలిసి శ్రీలంక నిర్దేశించిన 276 పరుగుల విజయ లక్ష్యాన్ని భారత జట్టు 7 వికెట్లు కోల్పోయి, 49.1 ఓవర్లలో చేరుకుంది. శ్రీలంక బౌలర్లలో హసరంగా మూడు వికెట్లు తీసుకోగా, రజిత, లక్షణ్ శందాకన్, దాసున్ శనక చెరో వికెట్ తీసుకున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 275 పరుగులు చేసింది. ఓపెనర్ అవిష్క ఫెర్నాండో (50), చరిత్ అసలంక (65), భానుక 36, ధనంజయ డి సిల్వా 32, కరుణ రత్నె 44 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో చాహల్, భువనేశ్వర్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా, దీపక్ చాహర్ 2 వికెట్లు తీసుకున్నాడు. మూడో వన్డే ఈ నెల 23న జరుగుతుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

1 × 4 =

Back to top button