చైనా ఉచ్చులో పడ్డ శ్రీలంక.. బయటకు వచ్చే దారే లేదా..?

చైనా.. తన చుట్టు పక్కల ఉన్న దేశాల్లో తన ఆధిపత్యం చెలాయించాలని అనుకుంటూ ఉంది. ఇప్పటికే చాలా దేశాలు చైనాకు వత్తాసు పలికాయి. అయితే భారతదేశం మాత్రం చైనా నక్కవినయాలను, కుతంత్రాలను అసలు నమ్మడం లేదు. ముఖ్యంగా హిందూ మహా సముద్రంలో చైనా పాగా వేయాలని భావిస్తూ ఉంది. ఇప్పటికే చైనాకు పాకిస్థాన్ దాసోహం అయిపోయింది. ఎలాగూ భారత్ చైనాను నమ్మదు కాబట్టి.. భారత్ చుట్టూ ఉన్న బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్, మాల్దీవులు తదితర దేశాలను తన గుప్పిట్లో పెట్టుకుంటోంది. తాజాగా శ్రీలంక కూడా చైనా ఉచ్చులో ఇరుక్కుంది. బయటకు వచ్చే దారి లేక తమ దేశ సార్వభౌమత్వాన్ని చైనా చేతుల్లోకి పెట్టేసింది.

చైనా తలపెట్టిన ‘బెల్ట్ రోడ్’ ప్రాజెక్టులో శ్రీలంకను ముఖ్యమైన భాగస్వామిగా చేసింది. హిందూ మహా సముద్రాన్ని దాటుకొని దక్షిణ పసిఫిక్, ఆఫ్రికా, ఐరోపాల్లోని 65 దేశాలతో వాణిజ్య బంధాలు నెలకొల్పుకోవాలని భావిస్తున్న చైనా.. శ్రీలంక ను కూడా ప్రస్తుతానికి వాడుకుంటోంది. చైనా కోరినట్లుగానే శ్రీలంక పార్లమెంట్ కీలక బిల్లుకు గత గురువారం ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు అనుకూలంగా 149 ఓట్లు, వ్యతిరేకంగా 58 ఓట్లు వచ్చినట్టు చైనా చెబుతోంది. సముద్రం నుంచి స్వాధీనం చేసుకున్న 269 హెక్టార్ల భూమిని అధికారికంగా కొలంబో నగరానికి సేవల-ఆధారిత పరిశ్రమల కోసం వినియోగించనున్నారు. దేశంలో మొట్టమొదటి ప్రత్యేక ఆర్థిక జోన్ (సెజ్)ను ఏర్పాటు చేస్తూ పోర్ట్ సిటీ ఎకనమిక్ కమిషన్ బిల్లును ఆమోదించింది. బిల్లుకు ఆమోదం లభించడంతో ఎస్ఈజెడ్ కమిషన్ త్వరలో ఏర్పాటుకానుంది. ఈ బిల్లు అమల్లోకి వస్తే కొలొంబోలో ఏ దేశం కరెన్సీతో అయినా వ్యాపార కార్యకలాపాలను నిర్వహించవచ్చు. పోర్ట్ సిటీ బిల్లును ఏప్రిల్ 8న పార్లమెంట్ ముందుకు తీసుకురాగా దీనికి వ్యతిరేకంగా శ్రీలంక సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది. బిల్లుకు అనుకూలంగా గత మంగళవారం న్యాయస్థానం తీర్పు వెలువరిస్తూ కొన్ని సవరణలు చేయాలని సూచించింది. పార్లమెంట్లో రెండు రోజుల పాటు దీనిపై చర్చ జరిపగా.. కొన్ని సవరణల అనంతరం మెజార్టీ ప్రజాప్రతినిధులు అనుకూలంగా ఓటేశారు.

తూర్పు ఆఫ్రికా, చైనాల మధ్య కీలక వారధిగా శ్రీలంక ను వాడుకోవచ్చని చైనా భావిస్తోంది. గతంలో శ్రీలంకకు భారీగా రుణాలు మంజూరు చేసింది చైనా. శ్రీలంకకు చైనా 800 కోట్ల డాలర్ల రుణం ఇవ్వడంతో.. శ్రీలంక ప్రభుత్వం కూడా పెద్దగా నోరు మెదపలేని పరిస్థితి నెలకొంది. శ్రీలంక తిరిగి చెల్లించేలా కనిపించకపోవడంతో చైనా మరిన్ని మాయమాటలు శ్రీలంకకు చెప్పింది. ఈ రుణాన్ని అడ్డుపెట్టుకొని శ్రీలంక దక్షిణ భాగంలోని హాంబన్టొట ఓడరేవును తన సైనిక స్థావరంగా మార్చుకునేందుకు చైనా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇది భారత్లోని కన్యాకుమారికి కేవలం 200 కిలోమీటర్ల దూరంలోనే ఈ నగరం ఉంది. ఓ వైపు శ్రీలంకలో ఉపాధి కల్పన తమతోనే సాధ్యం అని చెబుతున్న డ్రాగన్ కంట్రీ.. శ్రీలంకను మెల్లగా తమ ఉచ్చులోకి లాక్కుంది. రాబోయే రోజుల్లో చైనా ఆధిపత్యంతో శ్రీలంక ఎలా తయారవుతుందోనని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు.

ఈ ప్రాజెక్టు వల్ల తొలి ఐదేళ్లలో 2 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని శ్రీలంక ప్రధాని మహేంద్ రాజపక్స చెబుతూ ఉన్నారు. పెట్టుబడులను ఆకర్షించవచ్చని అన్నారు. శ్రీలంక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని పలు పార్టీలు తప్పుబడుతూ ఉన్నాయి.

సమాగి జన బలవేగాయ, విముక్తి పెరమున పార్టీలు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా దేశ సార్వభౌమత్వానికి నష్టం వాటిల్లే అవకాశం ఉందని బలంగా వాదిస్తూ ఉన్నాయి. మన దేశం మీద ఇతర దేశాలకు అధికంగా అధికారాలు ఇచ్చినట్లేనని ప్రతి పక్షాలు తీవ్ర వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకుని వెళ్లే అవకాశం ఉంది.

శ్రీలంక లోని తమిళ ఎంపీలు కూడా దీన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఉత్తర ప్రావిన్స్ కు చెందిన ఎంపీ సి.వి.విగ్నేశ్వరన్ ప్రభుత్వ తీరును తీవ్ర స్థాయిలో ఎండగట్టారు. ‘ఒకే దేశం.. ఒకే లా’ అని ప్రభుత్వం చెబుతూ ఉంది.. అంటే ‘చైనీస్ లా’ అనే అర్థం కదా అని ప్రశ్నించారు. చైనాకు ప్రస్తుత ప్రభుత్వం కొమ్ము కాస్తోందంటూ పార్లమెంట్ లో ఆయన బలంగా దుయ్యబట్టారు. ప్రభుత్వం చేస్తున్న తప్పును ప్రజలు అసలు ఒప్పుకోరంటూ చెప్పుకొచ్చారు. తమిళ్ నేషనల్ పీపుల్ ఫ్రంట్ లీడర్ గజేన్ పొన్నాంబళం మాట్లాడుతూ గతంలో ప్రభుత్వాలు చేసిన తప్పులనే ప్రస్తుత ప్రభుత్వం చేస్తోందని.. కోల్డ్ వార్ సమయంలో శ్రీలంక అమెరికాకు దగ్గరవ్వడం వలన తమిళ మిలిటెంట్ గ్రూపులు ఎక్కువగా తయారయ్యాయని.. ఇప్పుడు చైనాకు దగ్గరవవుతూ ఉండడం కూడా మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. చైనాకు రాజపక్ష దగ్గరవుతూ ఉండడం ఘోర తప్పిదంగా మారే అవకాశం ఉందని అన్నారు. గతంలో శ్రీలంక ఇలాంటి తప్పులే చేసిందని.. మరోసారి అలాంటి తప్పులు చేయకూడదని బిల్ గురించి చర్చించే సమయంలో గజేన్ పొన్నాంబళం సూచించారు.

తమిళనేషనల్ అలియన్స్ ఎంపీ, సీనియర్ లాయర్ ఎం.ఏ.సుమంతిరన్ మాట్లాడుతూ సుప్రీం కోర్టు కేవలం చిన్న చిన్న మార్పులను మాత్రమే చేసిందని.. ఈ మార్పుల వలన పెద్దగా ప్రయోజనం కూడా లేదని తేల్చి చెప్పారు. ఈ బిల్లుతో శ్రీలంకకు చాలా నష్టం కలుగుతుందని అన్నారు. త్వరలో శ్రీలంక కాస్తా చీలమ్ గా మారిపోయే అవకాశం ఉందని అన్నారు.
