భారత్-శ్రీలంక సిరీస్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తూ ఉన్నారు. యంగ్ ట్యాలెంట్ కు మంచి అవకాశం రావడంతో వారి ప్రదర్శన ఎలా ఉంటుందా అన్నది చూడాలని భారత క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో సిరీస్ వాయిదా పడింది.ఈ నెల 13న శ్రీలంక, శిఖర్ ధావన్ నేతృత్వంలోని భారత జట్టు పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడాల్సి ఉంది. అయితే ఈ టూర్ పై కూడా కరోనా ప్రభావం పడింది.
ఇంగ్లండ్ పర్యటన నుంచి వచ్చిన లంక బృందంలో ఇద్దరికి కరోనా పాజిటివ్ గా తేలడంతో భారత్ తో సిరీస్ ను వాయిదా వేశారు. బ్యాటింగ్ కోచ్ గ్రాంట్ ఫ్లవర్, డేటా విశ్లేషకుడు నిరోషన్ కరోనా బారిన పడ్డారని శ్రీలంక క్రికెట్ బోర్డు అధికారులు తెలిపారు. వారు ఆటగాళ్లతో కలిసే ఉండడంతో, లంక జట్టు మొత్తాన్ని క్వారంటైన్ కు తరలించారు. ముందు జాగ్రత్త చర్యగా సిరీస్ 4 రోజులు వాయిదా పడింది. బీసీసీఐ వర్గాలు స్పందించాయి. శ్రీలంకతో వన్డే సిరీస్ ను రీషెడ్యూల్ చేసినట్టు తెలిపాయి. లంకతో సిరీస్ ఈ నెల 17న ప్రారంభం అవుతుందని ఓ అధికారి వెల్లడించారు. ప్రస్తుతం లంక క్రికెటర్లు ఓ హోటల్లో క్వారంటైన్ లో ఉన్నట్టు తెలుస్తోంది.
జూలై 8 మరియు 9 తేదీలలో కరోనా టెస్టులు చేశారు. ఆ సమయంలోనే ఇద్దరికీ కరోనా వచ్చినట్లు తెలుసుకున్నారు. ఇరు జట్లు జులై 13 నుండి కొలంబోలో 3 వన్డేలు మరియు 3 టి 20 మ్యాచ్ లను ఆడనున్నాయి. శ్రీలంకకు చెందిన బ్యాటింగ్ కోచ్ గ్రాంట్ ఫ్లవర్ కు గురువారం కోవిడ్ -19 కు పరీక్షలు జరిపారు, ఆ తర్వాత స్క్వాడ్ సభ్యులు మరియు సహాయక సిబ్బంది మళ్లీ పరీక్షించారు. దాని ఫలితాలు శుక్రవారం బయటకు వచ్చాయి.
బిసిసిఐ కార్యదర్శి జే షా శ్రీలంక క్రికెట్ చైర్మన్ షమ్మీ షిరాజ్ సిల్వాతో మాట్లాడారు. బయో బబుల్ లో వైరస్ కేసులు రావడంపై ఆందోళన వ్యక్తం చేశారు. లంక బోర్డు వన్డేల కోసం కొత్త జట్టును తీసుకుని రాబోతోందనే ప్రచారం జరిగినప్పటికీ.. సిరీస్ ను ప్రస్తుతానికి నాలుగు రోజులకు వాయిదా వేశారు. శ్రీలంక క్రికెట్ బోర్డు ఈ సిరీస్ నుండి 12 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని పొందుతుంది. అందుకే ఈ సిరీస్‌ను నిర్వహించడానికి అన్ని ప్రయత్నాలను చేస్తోంది. ఆరు మ్యాచ్ ల సిరీస్ కోసం బీసీసీఐని శ్రీలంక క్రికెట్ బోర్డు చాలా కష్టపడి ఒప్పించింది. మొదట మూడు మ్యాచ్ ల సిరీస్ మాత్రమే ఉండగా.. వాటిని మరో మూడు మ్యాచ్ లకు పొడిగించారు. “మేము మొదట మూడు మ్యాచ్‌లను నిర్వహించడానికి ఖరారు చేసాము. కానీ భారత క్రికెట్ బోర్డుతో కొన్ని చర్చల తరువాత, మేము మ్యాచ్ లను ఆరుకు పెంచగలిగాము, ఇది అదనంగా 6 మిలియన్ల ఆదాయాన్ని సమకూర్చుతుంది” అని షమ్మీ షిరాజ్ సిల్వా మీడియాకు తెలిపారు.