ఆపద సమయంలో భారత్ శ్రీలంకకు భారీ సాయం చేసింది. ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న పొరుగుదేశం శ్రీలంకకు మరోసారి సహాయం అందించింది. ద్వీప దేశంలో ఇంధన కొరతను తగ్గించేందుకు 40వేల మెట్రిక్ టన్నుల డీజిల్‌ను సరఫరా చేసినట్లు భారత్ తెలిపింది.
విదేశీ మారకద్రవ్య నిలువ అడుగుంటడంతో.. కరెన్సీ విలువ తగ్గింది. ద్రవ్యోల్బణం భారీగా పెరిగింది. ఈ క్రమంలో ఇంధనం దిగుమతి చేసుకునేందుకు సహాయం అందించేందుకు భారత్ గత నెలలో శ్రీలంకకు అదనంగా 500 మిలియన్ డాలర్ల క్రెడిట్ లైన్‌ను పొడగించింది. ఈ మేరకు ఫ్రిబవరి 2, 2022న పెట్రోలియం ఉత్పత్తుల కోసం కొనుగోలు భారత్ క్రెడిట్ ఒప్పందంపై సంతకాలు చేశాయి.
భారత్ నుంచి శ్రీలంకకు 40వేల మెట్రిక్ టన్నుల డీజిల్ ఈ నెల 23న పంపగా.. సోమవారం సాయంత్రం కొలంబోకు చేరిందని భారత హైకమిషన్ ట్వీట్ చేసింది. 1948లో స్వాతంత్య్రం పొందిన తర్వాత తొలిసారిగా శ్రీలంక తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ఫలితంగా ఇంధనం, వంటగ్యాస్, నిత్యవసరాల కొరతతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అలాగే విద్యుత్ కోతల కారణంగా నెలల తరబడిగా జనం ఇక్కట్ల పాలవుతున్నారు. ఈ క్రమంలోనే భారత్ ‘నైబర్ హుడ్ ఫస్ట్’ విధానానికి అనుగుణంగా శ్రీలంకకు ఈ ఏడాది 3.5 బిలియన్ డాలర్లకుపైగా విలువైన సహాయాన్ని అందించింది.