More

  మూడు రోజులు వ్యవసాయం.. నాలుగు రోజులు డ్యూటీ

  శ్రీలంక సంక్షోభం నుంచి ఇప్పట్లో బయట పడేలా కనపడటం లేదు. శ్రీలంకను గట్టెక్కించేందుకు అక్కడి ప్రభుత్వం సరికొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది.

  ప్రభుత్వ ఉద్యోగులు వారానికి నాలుగు రోజులు మాత్రమే పని చేసేందుకు శ్రీలంక ఆమోదించింది. అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభంతో పాటు పొంచి ఉన్న ఆహార కొరతను అరికట్టేందుకు ప్రభుత్వ రంగ కార్మికులు.. తమ పెరట్లో ఆహారాన్ని అందించే మొక్కలు పండించాలని లేదా వ్యవసాయం చేయాలని ప్రభుత్వం కోరుతోంది. వారానికి నాలుగు రోజులు పని దినాలు అయిపోయిన తర్వాత, పంటలపై దృష్టి పెట్టాలని ఉద్యోగులను కోరింది. శ్రీలంకలోని ప్రభుత్వ రంగంలో దాదాపు పది లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

  సంక్షోభం నేపథ్యంలో ఆ దేశ విదేశీ మారక నిల్వలు తరిగిపోయాయి. ఫలితంగా ఇంధనం, ఆహారం, మెడిసిన్ దిగుమతులకు చెల్లింపుల కోసం నిధులు అందుబాటులో లేవు. దేశంలోని 2.2 కోట్ల మంది ప్రజలలో చాలా మంది పెట్రోల్ బంకుల వద్ద గంటల తరబడి క్యూలో నిల్చొంటున్నారు. నెలల తరబడి విద్యుత్ కోతలు ఉంటున్నాయి. ఈ క్రమంలో శ్రీలంక క్యాబినెట్ తాజా నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ రంగ ఉద్యోగులకు వచ్చే మూడు నెలల పాటు ప్రతి శుక్రవారం సెలవు ఇవ్వాలనే ప్రతిపాదనను క్యాబినెట్ ఆమోదించింది. దీనికి కారణం ఆఫీస్‌లకు వారి ప్రయాణాలు ఆపేసి, ఇంధన అవసరాలను తగ్గించడం, వ్యవసాయం చేసేలా వారిని ప్రోత్సహించడం.

  ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులకు ఒక వర్కింగ్ డే అదనంగా సెలవు మంజూరు చేయడం ప్రస్తుతం సముచితంగా అనిపిస్తుంది. తమ పెరట్లో లేదా మరెక్కడైనా వ్యవసాయ కార్యకలాపాలలో పాల్గొనడానికి ప్రభుత్వ ఉద్యోగులకు అవకాశం కల్పించి, ఆహార కొరతకు ఈ నిర్ణయం పరిష్కారం చూపుతుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అదనపు రోజు సెలవు అనేది భవిష్యత్తులో సంభవించే ఆహార కొరతకు పరిష్కారం అని ప్రభుత్వం ప్రకటించింది. సివిల్ సర్వెంట్ రాకపోకలను తగ్గించడం ఇంధన వినియోగాన్ని తగ్గించడానికి కూడా సహాయపడుతుందని తెలిపారు.

  గత వారం ఐక్యరాజ్యసమితి శ్రీలంకలో భయంకరమైన మానవతా సంక్షోభం గురించి హెచ్చరించింది. 22 మిలియన్ల జనాభా ఉన్న దేశంలో.. ప్రతి ఐదుగురిలో నలుగురు, అంటే పది లక్షల కంటే ఎక్కువ మందికి ఆహారం కొరత ఏర్పడుతుందని ఐరాస తెలిపింది. దీంతో అక్కడి ప్రజలకు సహాయం చేయడానికి 47 మిలియన్ డాలర్ల సాయం అందించాలని నిర్ణయించింది. క్యాబినెట్ నిర్ణయం ప్రకారం, ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే మూడు నెలలపాటు జీతంలో కోత లేకుండా ప్రతి శుక్రవారం సెలవు ఉంటుంది, కానీ అత్యవసర సేవల సిబ్బందికి ఈ వెసులుబాటు వర్తించదు.

  ప్రభుత్వ రంగ ఉద్యోగి ఎవరైనా ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లాలనుకునే వారికి సీనియారిటీ లేదా పెన్షన్‌పై ప్రభావం లేకుండా ఐదేళ్ల వరకు జీతం లేని సెలవు ఇస్తామని శ్రీలంక ప్రభుత్వం తెలిపింది. దిగుమతుల కోసం నిధులు వెచ్చిందేందుకు విదేశీ కరెన్సీ కొరతను తీర్చడానికి, ఎక్కువ మంది విదేశాల్లో ఉద్యోగాలు చేసి, ఫారెన్ కరెన్సీ పంపేలా ప్రోత్సహించడం ఈ చర్య లక్ష్యం. కరెన్సీ విలువ తరుగుదల, గ్లోబల్ కమోడిటీ ధరల పెరుగుదల, రసాయన ఎరువులపై నిషేధం విధింపు వంటి చర్యలతో ఏప్రిల్‌లో ఆహార ద్రవ్యోల్బణం 57 శాతానికి పెరిగింది. దీంతో అక్కడి ప్రభుత్వం ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ సంస్థతో బెయిలవుట్ ప్యాకేజీ కోసం చర్చలు జరుపుతోంది. జూన్ 20న కొలంబోకు ఐఎంఎఫ్‌ ప్రతినిధి బృందం వచ్చే అవకాశం ఉంది. అమెరికా కూడా శ్రీలంకకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది. యూఎస్ విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ లంక ప్రధాన మంత్రి రణిల్ విక్రమసింఘేతో ఫోన్‌లో ఈ విషయం గురించి మాట్లాడారు.

  Trending Stories

  Related Stories