ఐపీఎల్ లో మళ్లీ కరోనా టెన్షన్

0
650

ఐపీఎల్ మొదలై మూడు రోజులు కూడా కాకముందే కరోనా టెన్షన్ మొదలైంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆట‌గాడు నటరాజన్ కు క‌రోనా పాజిటివ్ గా నిర్ధార‌ణ అయ్యింది. ఈ రోజు ఉద‌యం జ‌రిపిన ప‌రీక్ష‌ల‌లో అత‌నికి పాజిటివ్‌గా తేలింది. దీంతో అతడు ఐసోలేస‌న్‌కు వెళ్లాడు. అలాగే న‌ట‌రాజ‌న్‌తో సన్నిహితంగా ఉన్న మరో ఆరుగురు కూడా ఐసోలేషన్‌లోకి వెళ్లారు. ఈ రోజు రాత్రి 7:30 గంట‌ల‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ జ‌ట్ల మధ్య దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదిక‌గా మ్యాచ్ జరగాల్సివుంది. విజయ్‌ శంకర్‌ సహా మరో ఐదుగురిని టీమ్ మేనేజ‌ర్ విజ‌య్‌కుమార్‌, ఫిజియో శ్యామ్ సుంద‌ర్‌, డాక్ట‌ర్ అంజ‌నా వ‌న్న‌న్‌, లాజిస్టిక్స్ మేనేజ‌ర్ తుషార్ ఖేడ్క‌ర్‌, నెట్ బౌల‌ర్ పెరియ‌సామి ఐసోలేష‌న్‌కు తరలించారు.

సన్ రైజర్స్ క్యాంప్‌లోని మిగ‌తా ఆటగాళ్లందరికీ నెగ‌టివ్ రావ‌డంతో నేటి మ్యాచ్ షెడ్యూల్ ప్ర‌కార‌మే యధాతధంగా కొనసాగుతుందని బీసీసీఐ స్ప‌ష్టం చేసింది. మహమ్మారి బారిన పడిన నటరాజన్‌కు ఎలాంటి ల‌క్ష‌ణాలూ లేవని, అతను ప్రస్తుతం జట్టు స‌భ్యుల‌కు దూరంగా మరో చోట ఐసోలేష‌న్‌లో ఉంటున్నాడని తెలిపింది.

నటరాజన్‌ కరోనా నుంచి కోలుకోవడానికి కనీసం 10 రోజలైనా పట్టే అవకాశం ఉంటుంది. రూల్స్‌ ప్రకారం 15 రోజులు ఐసోలేషన్‌లో గడపాల్సిందే. అక్టోబర్‌ 7 వరకు నటరాజన్‌ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడు. ఒక వేళ అతను కోలుకున్నా బరిలోకి దిగే సమయానికి ఎస్‌ఆర్‌హెచ్‌ పరిస్థితి ఎలా ఉంటుందో. ఇప్పటికే ఈ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ పరిస్థితి దారుణంగా ఉంది. తొలి అంచె పోటీల్లో ఏడు మ్యాచ్‌ల్లో ఒక విజయం మాత్రమే సాధించి ఆరు పరాజయాలతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. రెండో అంచె పోటీల్లో ఎస్‌ఆర్‌హెచ్‌ తప్పకుండా రాణించాల్సి ఉండగా.. ఇప్పుడు ఇలా కరోనా భయం మొదలైంది.