భారత్ లో వ్యాక్సిన్ల కొరతను తీర్చబోతున్నామని కేంద్ర ప్రభుత్వం చెబుతూ ఉన్న సంగతి తెలిసిందే..! ఇతర దేశాలకు చెందిన వ్యాక్సిన్లకు భారత్ ఆమోదముద్ర వేస్తూ ఉంది. ఈ ఏడాది ఆగస్టు-డిసెంబరు మధ్య 200 కోట్ల కరోనా టీకా డోసులు భారత్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని నీతి ఆయోగ్ సభ్యుడు(ఆరోగ్యం) వి.కె.పాల్ వెల్లడించారు. విదేశాలకు చెందిన పలు కంపెనీల వ్యాక్సిన్లు భారత్ లో రాబోయే రోజుల్లో అందుబాటులోకి వస్తే మాత్రం భారతీయులకు వ్యాక్సిన్ టెన్షన్ తీరిపోయే అవకాశం ఉంది. 200 కోట్ల డోసుల్లో సీరం తయారు చేస్తున్న కొవిషీల్డ్ 75 కోట్లు, కొవాగ్జిన్ 55 కోట్లు వుంటాయని పాల్ వెల్లడించారు. బయోలాజికల్-ఈ, నొవావాక్స్, స్పుత్నిక్-వి, జైడస్ క్యాడిలా, జెన్నోవాకు చెందిన టీకా డోసులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. 150 రోజుల్లో ప్రజలందరికీ వ్యాక్సిన్ అందిస్తామని తెలిపింది కేంద్రం.
రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్-వి వ్యాక్సిన్ వచ్చే వారం భారత్ మార్కెట్‌లోని రానున్నట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. స్పుత్నిక్-వి వ్యాక్సిన్ వచ్చే వారం నుంచి భారత మార్కెట్‌లో లభిస్తుందనే ఆశాభావంతో ఉన్నామని చెప్పడం నాకు సంతోషంగా ఉందని వీకే పాల్ తెలిపారు. స్పుత్నిక్-వీ టీకా భారత్ లోనే ఉత్పత్తి జూలైలో ప్రారంభమవుతుందని వీకే పాల్ అన్నారు. దాదాపు 15.6 కోట్ల మోతాదులను తయారు చేయవచ్చని.. ఈ టీకాకు భారత్‌లోని హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీ భాగస్వామిగా ఉందన్నారు. విదేశీ టీకాల దిగుమతికి ఒకట్రెండు రోజుల్లో అనుమతి మంజూరు అవుతుందని డబ్ల్యూహెచ్‌వో, ఎఫ్‌డీఏ ఆమోదించిన టీకాల దిగుమతికి అనుమతి ఇస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
స్పుత్నిక్-వి వ్యాక్సిన్ ధరను డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీ ప్రకటించింది. ఒక్కో డోస్ ధర రూ.995గా నిర్ణయించింది. టీకా వాస్తవ ధర రూ.948 కాగా.. దీనికి జీఎస్టీ అదనమని తెలిపింది. ఇది దిగుమతి చేసుకున్న టీకా ధర మాత్రమేనని తెలిపింది.
దేశీయంగా ఉత్పత్తి చేసే టీకా ధరపై క్లారిటీ రావాల్సి ఉంది. దేశీయ వ్యాక్సిన్ ధరలు మాత్రం తగ్గే అవకాశం ఉందని స్పష్టం చేసింది. రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్టిమెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్) అభివృద్ధి చేసిన స్పుత్నిక్-వి భారత్‌లో రెడ్డీస్ ల్యాబొరేటరీ ఉత్పత్తి చేస్తోంది. ఈ టీకా క్లినికల్ ట్రయల్స్ రెడ్డీస్ నిర్వహించింది. దేశీయంగా ఏడాదికి 85 కోట్ల డోస్‌లను ఉత్పత్తి చేయబోతున్నామని రెడ్డీస్ ల్యాబొరేటరీ ప్రతినిధులు తెలిపారు.
స్పుత్నిక్-వి టీకా 91.6% ప్రభావశీలత కలిగినదిగా మూడో దశ క్లినికల్ పరీక్షల్లో నిర్ధారణ అయినట్లు ఆర్డీఐఎఫ్ ప్రకటించింది. దీన్ని 2 నుంచి 8 డిగ్రీల ఉష్ణోగ్రత మధ్య నిల్వ చేయాలి. ఇది కూడా 2 డోసుల టీకానే.. మొదటి డోసు ఇచ్చిన 21వ రోజున రెండో డోసు ఇవ్వాలి. 28 నుంచి 42 రోజుల మధ్యలో రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది.