ప్రధాని మోదీ భద్రతను పర్యవేక్షించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(SPG) డైరెక్టర్ జనరల్ అరుణ్ కుమార్ సిన్హా కన్నుమూశారు. ఆయన వయసు 61 సంవత్సరాలు. గత కొంతకాలంగా కాలేయ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. 1987 కేరళ కేడర్ ఐపీఎస్ బ్యాచ్ అధికారి అయిన సిన్హా ఆ రాష్ట్ర అడిషినల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఎస్పీజీ చీఫ్ అరుణ్ కుమార్ సిన్హా ఆకస్మిక మృత పట్ల ఐపీఎస్ అధికారుల సంఘం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఆయన సేవలను భవిష్యత్ తరాలు గుర్తుంచుకుంటాయని పేర్కొంది. ఎస్పీజీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టక ముందు తన రాష్ట్ర కేడర్ అయిన కేరళలో, బీఎస్ఎఫ్ లో పలు కీలక బాధ్యతలను ఏకే సిన్హా చేపట్టారు.
2016 నుంచి అరుణ్ కుమార్ సిన్హా ఎస్పీజీ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. అరుణ్ కుమార్ సిన్హా 1987 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. మే 31 వ తేదీన ఆయనకు మరో సంవత్సరం పదవీకాల పొడగింపు లభించింది. అస్వస్థతకు లోను కావడంతో కొన్ని రోజుల క్రితం ఆయనను గురుగ్రామ్ లోని ఒక మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ సెప్టెంబర్ 6, ఉదయం మరణించారు. ఎస్సీజీ 12 వ డైరెక్టర్ గా ఆయన 2016 మార్చి నెలలో బాధ్యతలు స్వీకరించారు. 2024, మే 31 వరకు ఆయన ఆ బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉండగా.. దురదృష్టవశాత్తూ మరణించారు.
మాజీ ప్రధాని దివగంత ఇందిరాగాంధీని భద్రతా సిబ్బందే కాల్చి చంపిన నేపథ్యంలో 1985లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఎస్పీజీని ఏర్పాటుచేసింది. మాజీ ప్రధానులు, వారి కుటుంబ సభ్యులకు ఎస్పీజీ రక్షణ కల్పిస్తుంటుంది. అరుణ్ కుమార్ ఎస్పీజీ చీఫ్ గా రావడానికి ముందు 15 నెలల పాటు ఆ కీలక పదవి ఖాళీగా ఉంది. 2023, మే నెలలో ఎస్పీజీ డైరెక్టర్ జనరల్‌గా ఆయన పదోన్నతి పొందారు.