కరోనా థర్డ్ వేవ్ ప్రమాదం ఇంకా పొంచి ఉంది. అయితే కొందరు నాయకులు, వారి అనుచరులు విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ వస్తున్నారు. బహిరంగ సభలు, భారీగా ర్యాలీలను చేపడుతూ ఉన్నారు. అలానే సమాజ్ వాదీ పార్టీ ఎమ్మెల్యే అబూ అజ్మీ కూడా నిబంధనలను ఉల్లంఘిస్తూ రథంపై ఊరేగారు. అయితే కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆయనపైనా, ఆయన అనుచరుల పైనా కేసు నమోదు చేశారు.
కోవిడ్ -19 నిబంధనలను ఉల్లంఘించినందుకు ముంబైలోని మంఖుర్ద్ సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే అబూ అజ్మీ, మరో 17 మందిపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. అజ్మీ పుట్టినరోజు వేడుకల కోసం పెద్ద ఎత్తున జనాన్ని పోగేశారు ఆయన అనుచరులు. అబూ అజ్మీ కూడా ఏకంగా రథంపై గోవాండి వీధుల్లో కత్తిని ఊపుతూ వచ్చాడు. అజ్మీ, అతని మద్దతుదారులు సామాజిక దూరం, కోవిడ్ మార్గదర్శకాలను విస్మరించడమే కాకుండా మాస్కులు లేకుండా కనిపించారు. సదరు ఎస్పీ నాయకుడి పుట్టినరోజు వేడుకల విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయిన వెంటనే పోలీసులు ఈ చర్య తీసుకున్నారు.
ముంబైలోని శివాజీ నగర్ పోలీస్ స్టేషన్‌లో IPC సెక్షన్ 188, 269, ఇతర నిబంధనల చట్టం 37 (1) (2) మరియు భారతీయ ఆయుధాల చట్టంలోని సెక్షన్లు 4, 25 కింద కేసు నమోదైంది. ఈ విషయంపై తదుపరి విచారణ జరుగుతోంది. ఒక పోలీసు అధికారి మాట్లాడుతూ, “శాసనసభ్యుడు, తన పార్టీ మద్దతుదారులతో కలిసి ఆదివారం సాయంత్రం 5 గంటల నుండి 8.30 గంటల మధ్య గోవాండిలోని శివాజీ నగర్ ప్రాంతంలోని వివిధ ప్రదేశాలలో జన్మదిన వేడుకలను నిర్వహించారు. వేడుకల్లో పాల్గొన్న వారు COVID-19 ప్రోటోకాల్‌లను ఉల్లంఘించారు, సామాజిక దూరం కనిపించలేదు. వారిలో చాలామంది మాస్కులు ధరించలేదు” అని తెలిపారు. ఫవాద్ ఖాన్ అనే పార్టీ కార్యకర్త నుండి కత్తిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.