More

    తన ఆస్తులు ఎంతో చెప్పిన అఖిలేష్ యాదవ్.. ఢీకొట్టబోయేది ఎవరంటే..?

    ఉత్తరప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేశారు ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్. ఆయనపై కేంద్ర మంత్రి ఎస్పీ సింగ్ బఘేల్ ను బీజేపీ పోటీలో దింపింది. మెయిన్‌పురి జిల్లాలోని కర్హాల్‌ అసెంబ్లీ స్థానానికి సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ సోమవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఐదుసార్లు ఎంపీగా, యూపీ పోలీస్‌లో మాజీ అధికారిగా పనిచేసిన ఎస్పీ సింగ్ బఘేల్ ఒకప్పుడు సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్‌కు వ్యక్తిగత భద్రతా అధికారి (పీఎస్‌ఓ)గా ఉన్నారు. ఈ మధ్య కాషాయ పార్టీలో చేరిన అఖిలేష్ యాదవ్ కోడలు అపర్ణా యాదవ్‌ను కర్హాల్ నుండి పోటీకి బీజేపీ దింపుతుందనే ఊహాగానాలకు తెరపడింది. సోమవారం కర్హల్ నుండి ఎస్పీ సింగ్ బఘేల్ నామినేషన్ దాఖలు చేశారు. ఎస్పీ సింగ్ బఘేల్ కు సమాజ్‌వాదీ పార్టీతో అనుబంధం ఉంది. గతేడాది జులైలో కేంద్ర మంత్రివర్గంలోకి వచ్చిన ఎస్పీ సింగ్ బఘేల్ అంతకుముందు సమాజ్‌వాదీ పార్టీ, బహుజన సమాజ్‌ పార్టీలో ఉన్నారు. బఘేల్ ‘గడారియా’ కులానికి చెందినవారు. ఆయన కుటుంబ మూలాలు ఔరయా జిల్లాలోని భట్‌పురా గ్రామంలో ఉన్నాయి. అఖిలేష్ యాదవ్‌కు వ్యతిరేకంగా బఘేల్‌ను పోటీకి దింపి ఆసక్తికర పోరుకు బీజేపీ నాంది పలికింది. కేంద్ర న్యాయశాఖ సహాయమంత్రిగా ఉన్న ఎస్పీ సింగ్‌ బఘేల్‌ సోమవారం బీజేపీ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. అఖిలేశ్‌ నామినేషన్‌ వేసిన కొన్ని నిమిషాల తర్వాతనే బఘేల్‌ నామినేషన్‌ వేశారు. బఘేల్‌ ప్రస్తుతం యూపీలోని ఆగ్రా ఎంపీగా ఉన్నారు. అంతకుముందు రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారు. 2002లో మినహా 1993 నుంచి కర్హాల్‌ స్థానం ఎస్పీకి కంచుకోటగా ఉన్నది.

    ఇక అఖిలేష్ యాదవ్ తన అఫిడవిట్ లో తన ఆస్తుల వివరాలను ప్రకటించారు. అఖిలేశ్ యాదవ్ వద్ద రూ.40.02 కోట్ల ఆస్తులు ఉన్నాయి. అఖిలేశ్ యాదవ్ ఎన్నికల అఫిడవిట్ ప్రకారం.. 8.43 కోట్ల నగదును వివిధ బ్యాంకు ఖాతాల బ్యాలెన్స్ రూపంలో కలిగి ఉన్నారు. 17.93 ఎకరాల భూమి కూడా ఆయన పేరిట ఉంది. ఇది కొన్ని కోట్ల విలువ చేస్తుంది. ఆయనకున్న వ్యవసాయేతర భూమి విలువను రూ.17.22 కోట్లుగా ఆయన ప్రకటించారు. బ్యాంకు రుణానికి సంబంధించి రూ.28.97 లక్షలు చెల్లించాలి. అఖిలేశ్ యాదవ్ తనకు రూ.83.98 లక్షలు, భార్య డింపుల్ యాదవ్ రూ.58.92 లక్షల చొప్పున వార్షిక ఆదాయాన్ని కలిగి ఉన్నట్టు తెలిపారు.

    రాష్ట్రంలో త్వరలో జరుగబోవు అసెంబ్లీ ఎన్నికలు దేశ వచ్చే శతాబ్ధపు చరిత్రను లిఖిస్తాయని అఖిలేశ్‌ అన్నారు. ప్రగతిశీల ఆలోచనతో కూడిన సానుకూల రాజకీయమే తన ‘మిషన్‌’ అని, ఇందులో పాలుపంచుకొవాలని, ప్రతికూల రాజకీయాలను ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మెయిన్‌పురి జిల్లాల్లో మూడో దశలో భాగంగా ఫిబ్రవరి 20న ఎన్నికలు జరగనున్నాయి.

    Trending Stories

    Related Stories