అరణ్యాల్లో ఆవాసాలు ఏర్పరచుకున్న మానవజాతి.. వన్యప్రాణులు ఇంటి పరిసరాల్లోకి రాగానే ‘‘జనావాసాల్లోకి జంతువులు’’ అంటూ విచిత్రమైన వాదనను సమర్థవంతంగా వినిపిస్తుంది. సదరు వాదనకు అంగీకారం, సమ్మతి కూడా చాలా సహజంగానే ఏర్పడుతుంది. దీన్నే దురాక్రమణ తత్వం అంటారు ప్రాచీనులు. ప్రాణికోటి నివసించే ప్రకృతిని ఆక్రమించి, మూగజీవుల సంచారంపై అభ్యంతరం వ్యక్తం చేయడమే పతనానికి పాదులు వేయడం అన్నమాట.
కర్ణాటకలోని హాసన జిల్లాలో 60కి పై చిలుకు వానరాలను విషం పెట్టి, చిత్రహింసలకు గురిచేసి చంపిన ఘటన మానవ నాగరికత పరిణామంలోని హైన్యాన్ని సూచిస్తోంది. వానరం హైందవ ధర్మంలో పూజ్యనీయ ప్రాణి. వానరం లేని రామాయణం లేదు. హనుమ లేనిదే సీత రాముడి చెంతకు చేరలేదు. హనుమంతుడి ప్రతిరూపంగా భావించే వానరం మనిషి క్రూరత్వం కారణంగా అంతరిస్తోంది.
కనీస విచక్షణ మరిచి మూగజీవాల పట్ల అమానుషంగా ప్రవర్తించారు. వానరాలకు విషం పెట్టి.. గోనె సంచుల్లో కుక్కి తీవ్రంగా కొట్టారు. ఈ ఘటనలో 60 కోతులు మరణించాయి. హసన్ జిల్లా బెళూర్ తాలూకా చౌడనహళ్లి గ్రామం సమీపంలోని రోడ్డు పక్కన జూలై 30వ తేదీ ఉదయం స్థానిక యువకులు కొన్ని గోనెసంచుల మూటలను గుర్తించారు. వెంటనే వాటిని తెరవగా.. అందులో కోతులు కన్పించాయి. కొన్ని సంచుల్లో ఉన్న కోతులు అప్పటికే మరణించగా.. మరికొన్ని తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్నాయి.
శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్య కాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం అంటూ హనుమను స్మరిస్తే…విచక్షణా జ్ఞానం లభిస్తుందని నమ్మకం. ఎంతటి ఉగ్రతేజమో… అంత మృదుమధురం, ఎంత దేహదారుఢ్యమో…అంత సమున్నత బుద్ధిబలం, ఎంత ప్రతాప రౌద్రమో…అంత తీక్షణమైన బ్రహ్మచర్యం… ఇది హనుమ స్వరూపం. హనుమ తొమ్మిది అవతారాలు ఎంతో ఆసక్తికరం.
హనుమకు ప్రతిరూపమైన వానరాన్ని ఎందుకు దారుణంగా చంపారు? దక్షిణ భారతదేశంలోని ఆలయాల్లో మాత్రమే దర్శనమిచ్చే ‘బానెట్ మకాక్’ జాతి వానరాలు క్రమంగా నశించిపోవడానికి కారణమెవరు? వానర మాంసాన్ని విక్రయిస్తూ, ఎగుమతి చేస్తున్న దారుణాల గురించి ఆయా రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు పట్టించుకుంటున్నాయా?
కేంద్రం 2014లో వానరాల ఎగుమతిని ఎందుకు నిషేధించింది? కర్ణాటకలో గతంలో కూడా వానరాల వధ జరిగిందా? నాలుగు దశాబ్దాల క్రితం భారతదేశం నుంచి అమెరికాకు వానరాల ఎగుమతి ఎందుకు జరిగింది? శాస్త్ర పరిశోధన పేరుతో వానరజాతిని వధిస్తున్నదెవరు?
ఇలాంటి విషాదకరమైన…గతం, వర్తమానంలోని మనిషి అల్పత్వం గురించి తెలుసుకుందాం. విశ్లేషించే ప్రయత్నం చేద్దాం.
న్యూయార్క్ టైమ్స్ పత్రిక 1978, జనవరి 23న అచ్చైన సంచికలో ‘‘Export Ban on Monkeys Poses Threat to Research’’ పేరుతో ఓ కథనాన్ని రాసింది. ఈ కథనంలో ‘‘India, the world’s largest supplier of the monkeys, says it will stop exporting them. in the Indian press that, contrary to an international agreement, the monkeys were being used in military weapons testing inthis country. Last year, American scientists used about 12,000 of the monkeys, nearly all imported’ from India, where they are trapped in the wild.’’ అని పేర్కొంది.
అడవుల్లో వేటాడి వెంటాడి పట్టుకున్న 12వేల వానరాలను 1978లో అమెరికాకు పరిశోధనల నిమిత్తం ఎగుమతి చేశారు నాటి పాలకులు. వాటిని ఆయుధ పరీక్షల కోసం, శాస్త్ర పరిశోధనల కోసం వాడారట. ప్రపంచంలోనే వానరాల ఎగుమతిలో అతిపెద్ద దేశంగా ఆవిర్భవించిందట భారత్. ఇది జరిగి సరిగ్గా నాలుగున్నర దశాబ్దాల కాలం గడిచిపోయింది. తాజాగా హాసన జిల్లాలో వానర వధ జరిగింది.
ప్రకృతి ఒడిలో సేదతీరిన అచ్చెరువొందే జీవి, దైవాంశ సంభూతమైన ప్రాణిని ఎగుమతి చేసి…మనదేశం తనకు తాను కీడు చేసుకుంది. ప్రాకృతిక బంధాన్ని అభాసు పాలు చేస్తూ అమెరికాతో వాణిజ్య బంధాన్ని పటిష్ఠం చేసుకుంది. 1956 నుంచి 1978 వరకూ 22 ఏళ్లపాటు ఏటా 30 నుంచి 40 వేల వానరాలు మన దేశం నుంచి అమెరికాకు తరలిపోయాయి. అమెరికాలోని వాక్సిన్ పరిశోధన కేంద్రాలకు ఏటా 16 వేల వానరాలు అవసమని గణాంకాలు చెపుతున్నాయి.
దక్షిణ భారత దేశంలోని ‘బానెట్ మకాక్’ జాతి వానరాలు పరిశోధనకు అనువుగా ఉంటాయంటారు అమెరికా శాస్త్రవేత్తలు. అందుకు కారణమూ లేకపోలేదు. బానెట్ మకాక్ జాతి వానరాలకు 90శాతం పై చిలుకు మనిషి పోలికలు ఉండటమే కారణం. బానెట్ మకాక్ జాతి వానరాలు దక్షిణాది ప్రాచీన ఆలయాల్లో సందడి చేస్తూ…భక్తులను పారవశ్యానికి గురిచేస్తాయి.
వన్యప్రాణులు ముఖ్యంగా వానరాలు జనావాసాల్లోకి ఎందుకు వస్తాయి అంటూ పర్యావరణ పత్రిక ‘‘Mongabay’’ 2019, అక్టోబర్ 23న ఓ కథనాన్ని రాసింది. దేశ రాజధాని ఢిల్లీ నగరాన్ని వానరాలు అతలాకుతలం చేసిన నేపథ్యంలో ఈ కథనాన్ని ప్రచురించింది ‘Mongabay’ మేగజైన్. ప్రకృతి విధ్వంసం, పర్యావరణ హానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారులు అరణ్యాలను చదును చేస్తున్నకొద్దీ….ఆవాసాలు కరువై వన్యప్రాణులు జనావాసాల్లోకి వస్తున్నాయని Mongabay కథనం పేర్కొంది.
అక్కడితో ఆగలేదు…మరో ఆసక్తికరమైన అంశాన్ని ఈ కథనానికి జోడించింది. నగరాల్లోని ఆకాశహర్మ్యాల ద్వారబంధాలు దాటాక ఆకర్శించే అందమైన కలప ఆకృతుల్లో వానరాల ప్రాణాలు స్థాణువుగా మారాయని మానవీయమైన వ్యాఖ్యానం జోడించింది. మహానగరాలకు కలపగా మారి తరలిపోతున్న చెట్లతో పాటు వాటినే ఆశ్రయాలుగా భావించే వానరాలు మోడువారిన దుంగలవెంట అమాయకంగా పరుగులు తీస్తున్నాయి. Sterilization పేరుతో వానరజాతిని అంతం చేయాలనే చట్టబద్ధమైన కుట్ర కూడా చాలా సహజంగానే జరిగిపోతోంది.
2014, ఏప్రిల్ 12న టైమ్స్ ఇండియా పత్రిక భయంకరమైన వార్తను ప్రచురించింది. ‘‘Illegal monkey meat trade rampant in Chhattisgarh’’ అనేది ఈ వార్తా కథనం శీర్షిక. ఛత్తీస్ గఢ్ లోని రాజానంద్ గావ్ జిల్లాలో అక్రమంగా వానర మాంసాన్ని విక్రయించడం, ఎగుమతి చేయడం జరుగుతోందని ఈ కథనం బహిర్గతం చేసింది. వేల సంఖ్యలో వానరాలను చంపి, వాటి మాంసాన్ని ఎండబెట్టి ప్యాకింగ్ చేసి అమ్ముతున్నట్టూ ఈ కథనం పేర్కొంది. బస్తర్ రీజియన్ లో సైతం వానరమాంస వ్యాపారం యథేచ్చంగా సాగుతోంది.
‘‘ Citizen Matters’’ అనే మరో తలకిందుల ఆలోచన చేసే పత్రిక ‘‘ Monkey business: The oft-ignored menace in our cities’’ అంటూ ఓ కథనాన్ని ప్రచురించింది. పట్టణీకరణ సమస్యలపై వెలువడే పత్రిక వానరాల వల్ల ప్రజాజీవనానికి వచ్చే ఇబ్బందుల గురించి వాపోయింది. నోరు లేదు కాబట్టి సరిపోయింది కానీ, ప్రకృతిలో నివసించే ప్రాణికోటి మానవజాతిపై ఎన్ని ఫిర్యాదులు చేయాలి? కేవలం మనిషి కేంద్రంగా మాత్రమే చేసే ఆలోచనల పర్యవసానమే ఈ తరహా కథనాలకు కారణం. మనిషి ప్రకృతిలో భాగమన్న ఇంగితాన్ని పక్కన బెట్టడం వల్ల వచ్చే మతి భ్రమణ వ్యాఖ్యానాలివి.
దక్షిణ భారత దేశంలోని ప్రాచీన ఆలయాలు కేంద్రంగా వందల ఏళ్లుగా నివసించే బానెట్ మకాక్ జాతి వానరాలు గడచిన పాతికేళ్లుగా క్రమంగా అంతరించిపోతున్నాయని..‘Scroll.In పత్రిక ‘‘South India is losing its endemic bonnet monkey to an aggressive invader from the north’’ అంటూ 2017, సెప్టెంబర్ 4న ప్రత్యేక కథనాన్ని రాసింది.
దక్షిణాదిలో ప్రవహించే కృష్ణా, గోదావరి, పెన్నా, తపతి, కావేరీ, మహానది, వైగై లాంటి నదీ తీర ప్రాంతాల్లోని ప్రాచీన ఆలయాలు- విరూపాక్ష, మీనాక్షీ, హొయిసలేశ్వర, మహాబలిపురం, యాగంటి, చాముండేశ్వరి, అన్నపూర్ణేశ్వరి దేవస్థానాల్లో భక్తుల కోలాహలంతో పాటు వానర సంచారం కూడా అధికంగానే ఉంటుంది. చాళుక్యులు, తూర్పు చాళుక్యులు నిర్మించిన దేవాలయాల్లో బానెట్ మకాక్ జాతి వానరాలు సందడి చేస్తాయి. అయితే వాటి సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. 2003 నుంచి 2015 నాటికి వీటి సంఖ్య సుమారు 50 శాతం తగ్గిపోయిందని స్క్రోల్ ఇన్ పత్రిక పేర్కొంది.
1978లో నిలిచిపోయిన వానరాల ఎగుమతి తొంభయ్యో దశకంలో మారిన పరిస్థితులు, ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో తిరిగి ప్రారంభమైంది. అయితే 2014 జూన్ లో కేంద్రం అమెరికాకు వానరాల ఎగుమతిని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అమెరికాలోని Walter Reed Military Hospital కు వేల సంఖ్యలో తరలిపోతున్న వానరాల గురించి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. defense research laboratory ల్లో nuclear bomb ప్రయోగాల కోసం వానరాలను తరలిస్తున్నట్టూ తాజాగా బయటపడింది. ఒక వానరం ఖరీదు 50 డాలర్లనీ, యూ.కే, జర్మనీ, నెదర్లాండ్స్ దేశాలకు మన దేశం నుంచి వానరాలు తరలిపోతున్నాయనే వాస్తవం కూడా ఇటీవలే బయటపడింది.
2020, అక్టోబర్ లో 33 వానరాలను చంపిన ఘటన కర్ణాటకలోని సాగర తాలూకాలో వెలుగు చూసింది. ఈ కేసులో దస్తగిర్ అనే యువకుడితో పాటు మరికొంత మంది అరెస్టయ్యారు. మొత్తంగా దక్షిణ భారతదేశంలోని ఆలయాల్లో సేదతీరే వానరాల వధ హేయమైంది.
ఈ ఏడాది జూలై 13న శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలంలోని బెజ్జిపల్లి గ్రామంలోని సీతారామ స్వామి మందిరం వద్ద ఓ అపురూప దృశ్యం కనిపించింది. అక్కడి ఆలయ గోపురంపై ఉన్న సీతారామలక్ష్మణ హనుమాన్ విగ్రహాల వద్ద ఓ వానరం కొద్దిసేపు కూర్చుంది. శ్రీరామచంద్రుడికి రెండుచేతులు జోడించి దండంపెట్టగా ఆంజనేయ విగ్రహాన్ని చూసుకుంటు కొద్దిసేపు అక్కడే వానరం నిలిచిపోయింది. ఇలాంటి ఘటనలు మనదేశంలోని దేవాలయాల్లో అనేకం జరుగుతుంటాయి. వానరాలు కనుమరుగైపోతే..రాబోయే రోజుల్లో మన దేవాలయాల్లో వ్యాపార విలువలే తప్ప ధార్మిక పవిత్రత ఏమీ మిగలదని మనం గుర్తించాలి.
హనుమ లంకలో సీతాన్వేషణలో విఫలమయ్యానని భావించిన మరుక్షణం..ప్రాణం విడుద్దామనుకుంటున్న వేళ ‘‘జీవన్ భద్రాణి పశ్యతి’’ అనే వివేచన కలుగుతుంది. మరణం అనేక దోషాలకు కారణం. బతికి ఉంటే మంగళకరమైనవి చూడగలుగుతాం’ అని తర్కించుకుంటాడు. ప్రాణంపై అంత విశ్వాసాన్ని మనలో నింపిన హనుమ ప్రతిరూపాన్ని…వ్యాపారం చేస్తున్నారు. మాంసాహారంగా మార్చి తినేస్తున్నారు. జూలో బందీచేసి కాసులు ఏరుకుంటున్నారు..యుద్ధ అవసరాలకు దైవాన్ని అమ్ముకుంటున్నాం…ఇదీ మన ఆధునిక నాగరికత సాధించిన ప్రగతి. ఇకనైనా…మన ప్రాచీనత విలువను తెలుసుకుందాం..ప్రకృతిని కాపాడదాం.