‘’Afghanisthan is like the crossroads for every nation that comes to power, But we do not have the strength to control our own destiny. Our fate is determined by our neighbours. There are last days of the Americans, Next it will be China’’ అంటే ‘‘అన్ని దేశాల అధికార సాధనకు ఆఫ్ఘనిస్థాన్ కూడలిగా మారింది. మా గమ్యాన్ని మేం నిర్దేశించుకోలేని ఆశక్తత మాది. మా తలరాతను పోరుగుదేశాలే నిర్ణయిస్తాయి. అమెరికాకు అంతిమ ఘడియలు వచ్చేశాయి. రంగంలో దిగబోయేది చైనా’’
అన్నాడు హమీద్ కర్జాయ్ మంత్రివర్గంలో పనిచేసిన అన్వర్ ఖాన్ జగ్దాలక్ వ్యాఖ్య ఇది. ప్రస్తుతం మనం చూస్తున్న స్థితిని జగ్దాలక్ 2009లోనే ఊహించాడు. న్యూయార్క్ టైమ్స్ పత్రికకు 2009లో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని తేల్చి చెప్పాడు.
తాలిబన్లకు యుద్ధం చేయడమే తప్ప అధికారాన్ని నిలబెట్టుకోవడం చేతకాదని మరోసారి తేలిపోయింది. చైనా రంగ ప్రవేశం చేసింది. ఆసియా భౌగోళిక రాజకీయ మైదానాన్ని హఠాత్తుగా ఉద్రిక్తత ఆవహహించింది. కేవలం భౌగోళిక రాజకీయాలనే కాదు, వందల ఏళ్ల సైనిక చరిత్రకూ, యుద్ధ పద్ధతులకూ సవాలు విసిరుతోంది తాజా ఆఫ్ఘనిస్థాన్ అస్థిర స్థితి. తొమ్మిది వేల మంది పంజిషేర్ తిరుగుబాటుదారులు తాలిబన్ మూకలకు సవాలు విసురుతుంటే అగ్రరాజ్యం హడలిపోయి ఆకాశయానంలో పారిపోయింది. అమెరికా యుద్ధకళ ప్రపంచం ముందు అభాసు పాలైంది. శ్వేతసౌధం ఇప్పటికైనా మోతుబరి తత్వం మానుకుంటే కాస్త ప్రతిష్ఠ మిగులుతుంది.
పంజషేర్ లోయ స్వాధీనంలో తాలిబన్లకు పాకిస్థాన్ ప్రత్యక్ష సాయమందించడం అంతర్జాతీయ రాజకీయాల్లో అత్యంత సంచలనం సృష్టించింది. ఆఫ్ఘన్ పొరుగుదేశం, చమురు దిగ్గజం ఇరాన్ పాకిస్థాన్ పై భగ్గున మండిపడింది. విచారణకు ఆదేశించింది. 170 చ.కి.మీ అంగీకృత సరిహద్దు దాటి ఇతర దేశంలోకి చొరబడి పాక్ వాయుసేన ఎలా దాడి చేస్తుందంటూ ఘాటుగా ప్రశ్నించింది. పంజిషేర్ స్వాధీనంలో పాక్ జోక్యంపై ఇరాన్ స్పందన ఆఫ్ఘన్-పాకిస్థాన్ లకు చెంపపెట్టుగా మారింది. చైనాకు సైతం ఇరాన్ వ్యాఖ్యలు ఒకింత ఇబ్బందిని కలిగించే అవకాశాలూ లేకపోలేదు.
ప్రభుత్వ ఏర్పాటులో జాప్యానికి కారణాలు క్రమంగా బయటపడుతున్నాయి. పాకిస్థాన్ అనుకూల హక్కాని నెట్ వర్క్, బరాదరి వర్గాల మధ్య విభేదాలు బట్టబయలయ్యాయి. బరాదర్ పై దాడి జరిగిందనీ, వైద్యం కోసం పాకిస్థాన్ లోని ఓ ఆధునాతన ఆసుపత్రికి హుటాహుటిన తరలించారనే వార్తలు కూడా వెలువడుతున్నాయి.
ఆఫ్ఘనిస్థాన్ పరిణామాలు భారత్, ఇరాన్, యూరప్ దేశాలకు ఎలాంటి సమస్యలు సృష్టించే ఛాన్స్ ఉంది? చైనా, రష్యాలు తాలిబన్ వర్గాల విభేదాలను మరింత రెచ్చగొట్టి….మరో అంతర్యుద్ధానికి తెరతీస్తారా? ఆఫ్ఘన్ పొరుగునే ఉన్న మధ్య ఆసియా పరిస్థితి ఏంటి? అమెరికా ఫారెన్ పాలసీ ఎక్స్ పర్ట్ ప్రొఫెసర్ సీన్ మెక్ ఫ్లేట్ యూఎస్ విదేశాంగ విధానంపై ఏమన్నారు? ఉగ్రవాద వ్యతిరేక యుద్ధంలో అమెరికా ఎందుకు దారుణ ఓటమి పాలయింది? జర్మనీ ఎలా స్పందించింది? తాలిబన్లు అధికారాన్ని నిలబెట్టుకుంటారా?
ఇలాంటి ప్రశ్నలకు జవాబు చెప్పే ప్రయత్నం చేస్తాను.
అమెరికా ప్రొఫెసర్, ఫారెన్ పాలసీ ఎక్స్ పర్ట్ సీన్ మెక్ ఫ్లేట్ ఆసక్తికరమైన పరిశీలన చేశారు…‘durable chaos,’ i.e. a protracted conflict fought between the armed forces of a national state and a nonstate actor in unconventional battlefields in which rules of engagement are unclear’ ఒక దేశానికీ, సాయుధ ముఠాలకు మధ్య జరుగుతున్న దీర్ఘకాలిక ఘర్షణలో ఇతర దేశం తలదూర్చినపుడు…గెరిల్లా యుద్ధమైదానాల్లో మోహరించే బలగాల స్థితి అస్పష్టంగా ఉంటుంది. ‘మన్నికైన గందరగోళం’గా పరిణమిస్తుంది.
దురానీ సామ్రాజ్య విచ్ఛిత్తి తర్వాత ఆఫ్ఘన్లను ఎవరు, ఎప్పుడు, ఎలా పాలిస్తారో తెలియకుండా పోయింది. ఆనాటి నుండీ వందల తెగల సమాహారంగా ఉన్న ఖైబర్, బోలాన్, హిందూకుష్ పర్వత శ్రేణులు అనేక యుద్ధాలను చూశాయి. మహా సామ్రాజ్యాలను మట్టి కరిపించాయి. అయితే తమను తాము ఎలా పాలించుకోవాలో తెలియలేదు. వ్యూహాత్మక భూభాగం కావడం వల్ల అగ్రదేశాల యుద్ధ మైదానంగా మారిపోయింది.
పాకిస్థాన్ పారిపోయిన ఆఫ్ఘన్ రాజు షా షుజాను 1839లో కాబూల్ కు తీసుకోచ్చి తొత్తు రాజ్యాన్ని ఏర్పాటు చేసి, నిలబెట్టలేక కాళ్లకు బుద్ధిచెప్పింది బ్రిటీష్ సామ్రాజ్యం. 2001 తర్వాత అమెరికా హమీద్ కర్జాయ్, అష్రఫ్ ఘనీలను పట్టుకొచ్చి, విగ్రహాలుగా నిలబెట్టి ఏదో సాధించాలని ప్రయత్నించి బొక్కబోర్లా పడింది.
ఆఫ్ఘనిస్థాన్ ఆసియా ఖండ హృదయస్థానంలో ఉన్న దేశం. పాకిస్థాన్, ఇరాన్ లతో అత్యధిక భౌగోళిక సరిహద్దు పంచుకుంటున్న దేశం. చైనాకు కేవలం 91 చ.కిమీ సరిహద్దు మాత్రమే ఉంది. వంద ఏళ్లుగా పాక్-ఆఫ్ఘన్ ల మధ్య 2, 670 చ.కి.మీ సుదూర డురాండ్ లైన్ వివాదం ఉంది. ఇరాన్ తో 921 చ.కి.మీ సరిహద్దు ఉంది. ఉత్తరాన ఉజ్బెకిస్థాన్, తుర్క్ మెనిస్థాన్ లు, ఈశాన్యంలో తజకిస్థాన్, చైనాలు ఉన్నాయి.
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ లోని గిల్గిత్-బల్టిస్థాన్ కు ఆనుకుని ఆఫ్ఘనిస్థాన్ లోని వఖాన్ కారిడార్ ఉంది. ఆ పొరుగునే 385కిలో మీటర్ల దూరంలో పాకిస్థాన్ 1963లో చైనాకు ధారాదత్తం చేసిన షక్స్ గమ్ లోయ ఉంది. భారత్ సరిహద్దుల్లోకి ఏకకాలంలో చైనా, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ దేశాలు ప్రమాదాన్ని తెచ్చిపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలే జరిగితే పాక్ ఆక్రమిత కశ్మీర్ స్వాధీనంలో ఊహించని సవాళ్లు ఎదురవుతాయి.
పీఓకే స్వాధీనంలో మూడు దేశాలను, టోపోగ్రఫికల్ సవాళ్లను ఎదిరించి యుద్ధాన్ని గెలవాలంటే ఆర్థిక భారం ఊహించనంత పెరుగుతుంది. పీఓకే స్వాధీనం రోజురోజుకూ జటిలమవుతోంది. తనవద్ద లేకపోయినా సరే గిల్గిత్-బాల్టిస్థాన్ ప్రాంతం భారత్ స్వాధీనం కాకూడదని భావిస్తోంది పాక్. అందుకే అక్కడ చైనారాకకు పచ్చ జెండా ఊపింది. గిల్గిత్-బాల్టిస్థాన్ ను చైనా తన్నుకుపోయినా ఫరవాలేదు అనేది పాక్ బలమైన భావన.
భద్రతా బలగాలు ఏడేళ్లు శ్రమించి కట్టడి చేసిన కశ్మీర్ ఉగ్రవాదం అఫ్ఘనిస్థాన్ పరిణామాల నేపథ్యంలో మరింత బలపడి, మరిన్ని దాడులకు తెగబడవచ్చు. నిజానికి పాకిస్థాన్ అత్యంత బలహీనంగా ఉన్నస్థితిలో తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్ ను ఆక్రమించుకున్నారు. ఈ పరిణామంతో పాకిస్థాన్ ప్రాణం లేచి వచ్చింది. రాబోయే అక్టోబర్, నవంబర్ మాసాల్లో భారత సైన్యం పర్వత శ్రేణుల్లోని వ్యూహాత్మక ప్రాంతాలను శీతాకాలం దృష్ట్యా మూసివేస్తుంది. ఇదే అదనుగా ఉగ్రవాదులు కశ్మీర్ లోకి ప్రవేశించే అవకాశం ఉంది.
పొరుగున తన తొత్తు ప్రభుత్వం ఉంటే చైనాతో బేరసారాలు చేయవచ్చు. భారత్ ను ఇబ్బంది పెట్టి తనపై జరుగుతున్న దౌత్యపరమైన ఒత్తిడిని నియంత్రించవచ్చు. ఇదీ పాక్ భావన. ఆఫ్ఘనిస్థాన్ ను తాలిబన్లు ఆక్రమించుకోవడం తాలిబన్ల విజయం అనడం కంటే….పాకిస్థాన్ విజయంగా పేర్కొంటే మంచిదంటారు విశ్లేషకులు. ఈ మొత్తం స్థితిని దృష్టిలో ఉంచుకుని భారత ప్రభుత్వం పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్-చైనా వ్యూహాలకు ప్రతివ్యూహాలు సిద్ధం చేసే అవకాశం ఉందంటారు పరిశీలకులు.
ఇరాన్-ఆఫ్ఘన్ సంబంధాలు ఎలా ఉన్నాయో, ఉండబోతున్నాయో చూద్దాం….
సంప్రదాయ ఆయుధాల తయారీలో పేరున్న రివల్యూషనరీ గార్డ్ కోర్-IRGC విభాగం కుద్స్ ఫోర్స్ ద్వారా ఇరాన్ తాలిబన్లతో కొన్నేళ్లుగా సన్నిహితంగానే ఉంటోంది. తాలిబన్ నాయకులకు ఇరాన్ ఆతిథ్యం ఇవ్వడంతో పాటు వారికి ఆర్థిక, ఆయుధ సహకారాన్ని అందించింది.
దానికి బదులుగా తాలిబాన్లు ఆఫ్ఘన్ షియా తెగ హజారాలను ఆమోదించడం మొదలుపెట్టారు. అందుకే సెంట్రల్ ఆఫ్ఘనిస్థాన్ లో ఉన్న హజారా భూభాగం ఒక్క బులెట్ కూడా పేలకుండానే సులభంగా తాలిబన్ల వశమైంది.
ఇరాన్ కూడా అమెరికా వదిలిపెట్టిన లేదా ప్రస్తుతం తాలిబాన్ల చేతుల్లో ఉన్న కొన్ని ఆధునిక డ్రోన్లు, క్షిపణులు, ఇతర ఆయుధ సామాగ్రిని తెప్పించుకుని విశ్లేషించుకోవడానికి ఆసక్తి చూపించవచ్చు. ఆఫ్ఘనిస్థాన్ లో సుస్థిరత ఏర్పడితే ఇరాన్ కు వలస వచ్చే వారి సంఖ్య కూడా తగ్గొచ్చు. ప్రస్తుతం ఇరాన్ 7,80,000 మంది శరణార్థులకు ఆశ్రయం ఇస్తోంది.
అయితే ఆఫ్ఘనిస్థాన్ వ్యవహారంలో పాకిస్థాన్ జోక్యాన్ని వ్యూహాత్మక కారణాల మూలంగానే ఇరాన్ వ్యతిరేకిస్తోంది. పాక్ జోక్యం వల్ల క్రమంగా చైనా ప్రభావం పెరిగితే ఇరాన్ కు ప్రమాదమే! సౌదీ అరేబియాతో యెమెన్‌లో పోరాటం, పశ్చిమాసియాలో ప్రధాన శక్తిగా ఎదగాలని కోరుకోవడం, ఇరాక్‌తో ఆధిపత్య యుద్ధం, అమెరికా విధించిన ఆంక్షలకు సౌదీ మద్దతుపై ఆగ్రహంలాంటి అంశాలలో ఇరాన్ గతేడాది తరచూ వార్తల్లో నిలిచింది.
అమెరికాతో ఆ దేశపు సంబంధాలు క్షీణిస్తుండగా, చైనాతో క్రమంగా బలపడుతున్నాయి. ద్వైపాక్షిక సంబంధాల విషయంలో చైనాతో ఇరాన్ సఖ్యంగానే ఉన్నా దీర్ఘాకాలిక వ్యూహం దృష్ట్యా డ్రాగన్ ప్రమాదాన్ని ఇరాన్ ఖచ్చితంగా గుర్తించిందంటారు నిపుణులు.
సేనలు వైదొలగడం ద్వారా ఆఫ్ఘన్ ప్రజలను రక్షించే పనులను పూర్తిగా నిలిపివేయకూడదు. తాలిబన్లు దేశాన్ని స్వాధీనపర్చుకున్న నేపథ్యంలో మరింత అత్యవసర పరిస్థితిలో కూరుకుపోయిన ఆప్ఘన్లకు సాయం చేయాలంటూ ఆగస్టు 25న జర్మనీ పార్లమెంట్లో ఏంజెలా మెర్కెల్ పేర్కొన్నారు.
కొత్తగా అధికారంలోకి వచ్చిన తాలిబన్ నాయకులతో ఎటువంటి సంబంధాలను ఏర్పర్చుకుంటామో ఇప్పట్లో నిర్ణయించలేమంటూ యూరోపియన్ యూనియన్ కౌన్సిల్ చార్లెస్ మైఖేల్ ఆగస్టు 24న జరిగిన జి-7 దేశాల సమావేశం నేపథ్యంలో తేల్చి చెప్పారు.
మధ్య ఆసియా లోని మూడు దేశాలతో ఆఫ్ఘనిస్థాన్ కు ప్రత్యక్ష సరిహద్దులున్నాయి. తజికిస్థాన్ తో 1357 చ.కి.మీ, ఉజ్బెకిస్తాన్ తో 144 చ.కి.మీ, తుర్క్‌మెనిస్తాన్‌తో 804 చ.కి.లమీ సరిహద్దు ఉంది, ఈ మూడు దేశాలూ ఆత్మరక్షణలో పడ్డాయి. దీంతో ఈ 3 దేశాలు సరిహద్దులను మూసి వేశాయి. పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేని స్థితిలో రష్యా నుండి ఆధునిక ఆయుధాలను సేకరిస్తున్నాయి.
ఇక ‘War On Terrorism’ పేరుతో అమెరికా చేసిన యుద్ధాలు ఎందుకు విఫలమయ్యాయో చూద్దాం….
యుద్ధకళ మా దొడ్లోనే పుట్టిందని బీరాలు పలికే అమెరికా, ప్రపంచంలోని అనేక దేశాలకు ఆయుధ అమ్మకాలు చేసే అగ్రరాజ్యం ఎందుకు తెగ సంస్కృతి ఉన్న తాలిబన్ ఫైటర్లతో ఓడిపోయిందనే ప్రశ్నకు ఆసక్తికరమైన జవాబు దొరికింది. టోరెంటో కేంద్రంగా పనిచేసే international intelligence వెబ్ సైట్ Geopolitical monitor.comలో Jose Miguel Alonso ఆఫ్ఘన్ పరిణామాలను చర్చిస్తూ.. ‘‘What Afghanistan Teaches about the Art of the Possible’’ పేరుతో ఓ ఆసక్తికరమైన వ్యాసం రాశారు.
స్థిరయుద్ధ అనుభవం మాత్రమే ఉన్న అమెరికా, పశ్చిమాసియా దేశాల పర్వత ప్రాంతాల్లో చేసే గెరిల్లా యుద్ధం చేసే సాయుధ మూకలతో యుద్ధానికి దిగడమే వ్యూహాత్మక తప్పిదమని జోస్ మిగ్వెల్ అలెన్సో అంటారు. జర్మన్ తత్వవేత్త కార్ల్ స్మిత్ వ్యాఖ్యానాన్ని ఈ సందర్భంగా ఊటంకించారాయన…‘‘ man is an earthling. As such, the political behaviors of human groups are heavily influenced by the spatial and material contextual circumstances in which they live, grow, thrive, decline, and fight against each other. In fact, the idea that geography is a powerful driver of political actions and interactions’’ అన్నాడు కార్ల్ స్మిత్.
అంటే ‘‘మనిషి భూతలజీవి. మానవ సమూహాల రాజకీయ ప్రవర్తనపై ప్రాదేశిక, భౌతిక నేపథ్య ప్రభావముంటుంది. పుట్టి పెరిగిన వాతావరణం, గెలుపోటములు, పరస్పర పోరాటాల ప్రకరణం వెంటాడుతుంది. భౌగోళిక అంశం రాజకీయ చర్య, ప్రతిచర్యలను పురికొల్పడంలో శక్తివంతమైన పాత్ర పోషిస్తుంది’’ అని అర్థం.
కఠిన పర్వత ప్రాంతాల్లోని తెగలతో ఆధునిక ఆయుధ సంపత్తి గల సైన్యం యుద్ధం చేసి గెలవడం దాదాపు అసాధ్యమనేది ఆయన అంచనా. ప్రష్యన్ యుద్ధనిపుణుడు క్లాస్ విట్జ్ ‘‘psychological dimension that cannot be manipulated with hardware or weaponry alone’’ అంటే యుద్ధంలోని మానసిక కోణాన్ని ఆయుధ సంపత్తి, సామాగ్రితో మాత్రమే సంభాళించలేం అంటాడు.
తాలిబన్ సేనలు ఆఫ్ఘనిస్థాన్ లోని వందలాది తెగల సమాహారం. తెగ సంస్కృతి ప్రధాన బలం, బలహీనత ఏంటంటే…యుద్ధంలో ఉన్న ఐక్యత అధికారం పంచుకోవడంలో ఉండదు. ఆఫ్ఘనిస్థాన్ తెగలపై అధ్యయనాలు చేసిన అనేక నిపుణులు ‘తెగల ఐక్యత’ కలలో మాత్రమే సాధ్యమని నిర్ధారించారు. 1890 నుంచి ఆఫ్ఘనిస్థాన్-పాకిస్థాన్ లోని తెగల చరిత్ర చదివిన వారికి ఈ విషయం అర్థమవుతుంది. అందుకే ఇప్పుడు కూడా తాలిబన్లు అధికారాన్ని నెలలకు మించి నిలబెట్టుకోలేరు.
నేషనలిస్ట్ హబ్….మొదటి నుంచీ సమాచారం సేకరించిన మూల రచనలు, పత్రికలు, పుస్తకాల వివరాలను వెల్లడిస్తూనే ఉంది. అయితే ఇటీవలి కాలంలో మేం రెఫర్ చేస్తున్న అరుదైన పుస్తకాల కోసం కొంతమంది అడుగుతున్నారు. ఈ విన్నపాన్ని పరిగణలోకి తీసుకుంటూ… JOIN అయిన Subscribersకు ఒక వేళ ఏదైనా పరిశోధన నిమిత్తం, సివిల్స్, గ్రూప్స్ ప్రిపేర్ అయ్యేవారికి మేం రెఫర్ చేసిన రేర్ బుక్స్ ఉచితంగా PDF ఫార్మాట్ లో పంపిస్తాం. నేషనలిస్ట్ హబ్ కు మెయిల్ చేస్తే మా టీమ్ స్పందిస్తుంది.