ఒకే కాన్పులో ఇద్దరు లేదా ముగ్గురికి జన్మనివ్వడమంటే ఒకింత షాక్ అవుతారు.. అలాంటిది ఏకంగా 10 మంది ఒకే కాన్పులో జన్మించడమంటే మాటలా చెప్పండి. కానీ దక్షిణాఫ్రికాకు చెందిన ఓ మహిళ 10 మందికి జన్మనిచ్చింది. అది కూడా 37 సంవత్సరాల వయసులో..! పది మందికి జన్మనిచ్చి గత ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టింది. గోసియామ్ తమరా సిథోల్ అనే మహిళ గర్భం దాల్చింది. సాధారణం కంటే ఆమె కడుపు కాస్త ఎక్కువగానే కనిపించడం మొదలైంది. ఆరో నెలలో వైద్య పరీక్షలు చేయగా.. వైద్యులు కనీసం ఎనిమిది మందికి జన్మనిస్తారని చెప్పారట..! సోమవారం నాడు ఆమెకు డెలివరీ జరిగింది. ప్రిటోరియాలోని ఆసుపత్రిలో ఆమె 10 మంది శిశువులకు జన్మనిచ్చింది. సిజేరియన్ నిర్వహించి 10 మందిని క్షేమంగా బయటకు తీసారు. వీరిలో ఏడుగురు బాలురు ఉండగా.. ముగ్గురు బాలికలు ఉన్నారు. వీరంతా ఆరోగ్యంగా ఉన్నారని.. అయితే వారిని మరికొన్ని రోజులపాటు ఆసుపత్రిలోని ఇంక్యుబేటర్లలో ఉంచి సంరక్షించనున్నట్లు ఆసుపత్రి సిబ్బంది తెలిపింది. 10 మంది శిశువులను తండ్రయ్యానని తెలిసి చాలా ఆశ్చర్య పోయానని సిథోల్ భర్త టెబోహో సోటెట్సీ తెలిపారు. ఏడు నెలల ఏడు రోజులకే ప్రసవ నొప్పులు రావడంతో ప్రిటోరియాలోని వైద్యులను సంప్రదించామని.. సోమవారం పది మందికి జన్మనిచ్చిందని సోటెట్సీ అన్నారు. ఈ మహిళకు ఇప్పటికే ఆరేళ్ల వయసున్న కవలలు ఉన్నారు.

తమరా సిథోల్ భర్త టెబోహో సోటెట్సీ నిరుద్యోగి. కానీ ఇంత మంది పిల్లలు పుట్టడం తనకు ఆనందంగా ఉందనీ, తాను చాలా ఎమోషనల్ అయ్యాయనీ తెలిపారు. నేను చాలా ఆనందంగా ఉన్నాను.. చాలా ఎమోషనల్ అవుతున్నాను. నేను మాట్లాడలేకపోతున్నానని టెబోహో సోటెట్సీ అన్నారు. ఈ ప్రెగ్నెన్సీ సహజమైనదే అని.. ఇంత ఎక్కువ మంది పుట్టడానికి అండం విడుదలైనప్పుడు ఎక్కువ ఎంబ్రియోలు చొచ్చుకు వెళ్లడమే కారణమని వైద్యులు తెలిపారు.
డాక్టర్లు మొదట తమరా సిథోల్ ను స్కాన్ చేసినప్పుడు ఆరుగురు పిల్లలకు జన్మనిస్తుందని అన్నారు. ఆ తర్వాత మరో సందర్భంలో చెక్ చేసినప్పుడు ఎనిమిది మంది పిల్లలకు జన్మనివ్వబోతోందని చెప్పారు. పిల్లలు పుట్టినప్పుడు మాత్రమే మొత్తం 10 మంది ఉన్నట్లు తేలింది. తమరా సిథోల్ ఎకుర్హులేని నగరంలోని తెంబిసాకు చెందినది. ఆమె సి-సెక్షన్ చేయించుకుంది. ప్రిటోరియా నగరంలోని ఆసుపత్రిలో డెలివరీ జరిగింది. గత నెలలో మొరాకోకు చెందిన మాలియన్ హలీమా సిస్సే ఒకే కాన్పులో 9 మంది చిన్నారులకు జన్మనిచ్చింది. ఇప్పుడు సిథోల్ ఒకే కాన్పులో 10 మంది శిశువులకు జన్మనిచ్చి గిన్నిస్ రికార్డు తన పేరిట లిఖించుకుంది.
