భారత్, ఇంగ్లండ్ టెస్టు సిరీస్ లో 5వ టెస్టు మ్యాచ్ వాయిదా పడింది. కరోనా కారణంగా బీసీసీఐ, ఈసీబీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఈ టెస్టు మ్యాచ్ రద్దులో ఐపీఎల్ పాత్ర కూడా ఉందని వార్తలు వచ్చాయి. ఐపీఎల్ రెండో భాగం ప్రారంభం అవుతున్న నేపథ్యంలోనే 5వ టెస్టు మ్యాచ్ రద్దు చేశారని వస్తున్న విమర్శలపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వివరణ ఇచ్చాడు. ఆఖరి మ్యాచ్‌ను రీషెడ్యూల్ చేస్తామని సౌరవ్ గంగూలీ తెలిపారు. దీన్ని మరో సిరీస్‌గా (ఏకైక టెస్టు) అనుమతించబోమని ఆయన స్పష్టం చేశారు. ఈ సుదీర్ఘ సిరీస్‌ను బీమా చేసిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) వివాద పరిష్కారానికి ఐసీసీ తలుపు తట్టింది. దీన్ని నిశితంగా గమనించిన బీసీసీఐ అసంపూర్తి సిరీస్‌ను పూర్తి చేసేందుకు సిద్ధమని తెలిపింది.
బీసీసీఐ అంత నిర్లక్ష్యమైన బోర్డు కాదని.. ఇతర బోర్డులను కూడా చాలా గౌరవిస్తుందని గంగూలీ చెప్పారు. జట్టు ఫిజియో నితిన్ పటేల్ కరోనాతో ఐసోలేషన్‌లో ఉన్నాడని, ఆ సమయంలో జూనియర్ ఫిజియో యోగేష్ పార్మర్ అందరికీ సేవలందించాడని ఆయన వివరించారు. కొందరు ఆటగాళ్లకు కరోనా పరీక్షలు కూడా యోగేష్ చేసినట్లు గంగూలీ తెలిపారు. అవసరమైన వారికి మసాజ్ కూడా చేశాడని, అలాంటి యోగేష్‌కు కరోనా సోకిందని తెలియడంతో ఆటగాళ్లు భయపడ్డారని గంగూలీ స్పష్టం చేశారు. ఆటగాళ్లు కరోనా భయంతో ఆడటానికి నిరాకరించారని, వారి భయాన్ని అర్థం చేసుకోవాలని అన్నాడు. ఈ కారణంగానే 5వ టెస్టు రద్దయిందని, ఈ నిర్ణయంలో ఐపీఎల్ ప్రస్తావనే లేదని స్పష్టంచేశాడు.
ఆఖరి మ్యాచ్ ను నిర్వహించాలని భారతజట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా కోరినట్లు తెలుస్తోంది. ఐదో టెస్టును నిరవధికంగా వాయిదా వేయడానికి ముందు కెప్టెన్ విరాట్ కోహ్లి మ్యాచ్ ను ఎలాగైనా నిర్వహించాలని కోరినట్లు తెలుస్తోంది. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ నేపథ్యంలో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఇరు జట్లకు కీలకం.. ఇక టీమిండియా సెకండ్ ఫిజియో యోగేశ్ పర్మార్‌కు పాజిటివ్‌గా తేలడంతో మ్యాచ్ నిర్వహణ కుదరదని భావించారు. ఆటగాళ్లందరికీ పరీక్షలు నెగటివ్ వచ్చినప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా మ్యాచ్ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన ఈసీబీ ఆ తర్వాత నిరవధికంగా వాయిదా వేసినట్లు వెల్లడించింది. రెండు రోజుల తర్వాత మ్యాచ్‌ను నిర్వహించాల్సిందిగా కోహ్లి ప్రతిపాదించినట్లు సమాచారం. హెడ్ కోచ్‌తో పాటు కీలక అడ్వైజర్లు అందుబాటులో లేకపోవడం, ఫిజియోథెరపిస్టు కూడా కరోనా బారిన పడటంతో రెండు లేదా మూడు రోజుల అనంతరం మ్యాచ్ ఆడించాలని కోరగా ఈసీబీ అందుకు ఒప్పుకోలేదని తెలుస్తోంది.