మతపరమైన కార్యక్రమాలపై కొత్త నిబంధనలను తీసుకుని వచ్చిన యోగి సర్కార్

0
724

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లోని యోగి ఆదిత్యనాథ్ సర్కారు మతపరమైన కార్యక్రమాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. సమావేశాలు, ఊరేగింపులకు నిర్వాహకుల నుంచి తప్పనిసరిగా అఫిడవిట్ (ప్రమాణపత్రం) తీసుకోవాలని ఆదేశించారు. సోమవారం రాత్రి ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి యోగి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. రంజాన్, అక్షయ తృతీయ ఒకే రోజు వస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని పోలీసు అధికారులను కోరారు. అనుమతి ఇచ్చే ముందే శాంతి, సామరస్యాన్ని కాపాడుతామంటూ నిర్వాహకుల నుంచి అఫిడవిట్ తప్పకుండా తీసుకోవాలని అన్నారు. సంప్రదాయంగా వస్తున్న మతపరమైన కార్యక్రమాలకే అనుమతి ఇవ్వండి. కొత్త కార్యక్రమాలకు అనుమతులు వద్దని యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు.

ఉత్తరప్రదేశ్‌లోని ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత విశ్వాసాలతో పూజించే స్వేచ్ఛ ఉందని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. “శోభాయాత్ర లేదా మతపరమైన ఊరేగింపులను తగిన అనుమతి లేకుండా నిర్వహించరాదు, అనుమతికి ముందు, శాంతి మరియు సామరస్యాన్ని కాపాడేందుకు నిర్వాహకుడి నుండి అఫిడవిట్ తీసుకోవాలి, సాంప్రదాయకంగా జరిగే మతపరమైన ఊరేగింపులకు మాత్రమే అనుమతి ఇవ్వాలి. కొత్త వాటికి అనుమతులు ఇవ్వకూడదు’’ అని ముఖ్యమంత్రి కార్యాలయం హిందీలో ట్వీట్ చేసింది. ప్రతి ఒక్కరికీ తమ పూజా పద్ధతిని అనుసరించే స్వేచ్ఛ ఉంది.. మైక్‌లు ఉపయోగించవచ్చు, కానీ ఎక్కువ శబ్దం రాకుండా చూసుకోండి. ఇతరులకు అసౌకర్యం కలిగించవద్దు. కొత్త ప్రాంతాలలో మైక్‌లను అనుమతించవద్దని అన్నారు.

ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. స్టేషన్ హౌస్ ఆఫీసర్ల (ఎస్‌హెచ్‌ఓ) నుండి ఎడిజి వరకు రాబోయే 24 గంటల్లో తమ ప్రాంతాల్లోని మత పెద్దలు, సమాజంలోని ఇతర ప్రముఖులతో మాట్లాడాలని ముఖ్యమంత్రి సూచించారు. సామరస్యాన్ని దెబ్బతీసే ప్రకటనలు ఇచ్చే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రోడ్లపై ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా సూచించబడిన ప్రదేశాల్లో మతపరమైన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించిన సీఎం, అధికారుల అనుమతి లేకుండా మతపరమైన ఊరేగింపులు జరపరాదని అన్నారు.