సోనూసూద్ సోదరి ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రకటించారు. రాబోయే పంజాబ్ ఎన్నికల్లో మోగా నియోజకవర్గం నుంచి బరిలో నిలుస్తారని ఆయన వెల్లడించారు. తన సోదరి మాళవికా సూద్ తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని ప్రకటించారు. మాళవిక సూద్ సచార్ (38) రాజకీయాల్లోకి వచ్చే విషయాన్ని సోనూ ఆదివారం తన సోదరితో కలిసి పంజాబ్‌లోని స్వస్థలం మోగాలో నిర్వహించిన మీడియా సమావేశంలో చెప్పుకొచ్చారు. పంజాబ్ రాష్ట్ర ప్రజలకు సేవ చేసేందుకు ఆమె రాజకీయాల్లోకి వస్తున్నట్లు తెలిపారు. ఆమె ఏ పార్టీలో చేరేది సమయం వచ్చినప్పుడు చెబుతామని ప్రకటించారు. తనకు మాత్రం రాజకీయాల్లో వచ్చే ఆలోచన లేదన్నారు. ప్రస్తుతానికి సోదరికి మద్దతివ్వడం ముఖ్యమని తెలిపారు. మాళవిక కంప్యూటర్ ఇంజనీరింగ్ చదివారు. సామాజిక కార్యకర్తగా చెప్పుకొచ్చారు. ఆరోగ్య రంగంపై శ్రద్ధ చూపుతుంటారు.
తన చెల్లెలు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారన్న విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, సరైన సమయంలో ఆ నిర్ణయం ప్రకటిస్తామని సోనూ సూద్ చెప్పారు. ఇటీవలే తాను రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీని కలిశానని, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్, శిరోమణీ అకాలీదళ్ అధ్యక్షుడు సుక్బీర్ సింగ్ బాదల్ నూ కలుస్తానని చెప్పారు. ఏ రాజకీయ పార్టీలో చేరాలన్నది సిద్ధాంతాలకు సంబంధించిన విషయమని, సమావేశాలతో అదయ్యేది కాదని తెలిపారు. తాను రాజకీయాల్లోకి వస్తానా? రానా? అన్నది పక్కనపెట్టాలని, దానిపై తన నిర్ణయాన్ని తర్వాత ప్రకటిస్తానని చెప్పారు. ముందు మోగాలో మాళవికకు మద్దతును కూడగట్టేందుకు ప్రయత్నిస్తానని అన్నారు. లాక్ డౌన్ సమయంలో సోనూ సూద్ పలు సేవా కార్యక్రమాలు చేశారు. ఆ తర్వాత ఫౌండేషన్ ను ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున విరాళాలు సేకరించిన సంగతి కూడా తెలిసిందే..!