కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల అజెండాపై స్పష్టతను ఇవ్వాలని కోరడమే కాకుండా.. విపక్షాలకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా సమావేశాలు ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించారు. ఈ సమావేశాల్లో 9 అంశాలపై ప్రధానంగా చర్చ జరపాలని ఆమె డిమాండ్ చేశారు. పార్లమెంట్ సమావేశాలు జరిపే ముందు ప్రతిపక్షాలతో చర్చలు జరపడం ఆనవాయితీ.. కానీ ఎలాంటి చర్చలు జరపకుండానే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు పిలుపునిచ్చిందని సోనియా గాంధీ అన్నారు. ఈ నెల 18వ తేదీ నుంచి 22వ వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఐదు రోజుల పాటు పార్లమెంట్ కొత్త భవనంలో ఈ సమావేశాలు జరగనున్నాయి.
ప్రతిపక్షాలతో ఎలాంటి చర్చలు జరపకుండానే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు పిలుపునివ్వడం ఇదే మొదటిసారని అన్నారు. ఈ సమావేశాలలో చర్చించబోయే విషయాలపై మాకు ఎలాంటి సమాచారం లేదని.. ఎందుకోసం సమావేశాలకు పిలుపునిచ్చారనే విషయంపై స్పష్టమైన ప్రకటన చేయండని ప్రధాని మోదీని సోనియా గాంధీ కోరారు. ప్రజా సమస్యలను లేవనెత్తడమే ప్రతిపక్ష పార్టీ మా లక్ష్యం. ప్రజా సమస్యలపై చర్చ కోసం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో తగిన సమయం కేటాయించాలని లేఖలో సోనియా గాంధీ కోరారు.
సోనియా గాంధీ ప్రధాని మోదీకి పంపిన లేఖపై కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేష్ మాట్లాడారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల గురించి ఎవరికీ సమాచారం లేదని, అకస్మాత్తుగా ప్రత్యేక సమావేశాన్ని ప్రకటించారని అన్నారు. విపక్షాలతో ఎటువంటి చర్చ లేకుండానే సమావేశాన్ని పిలిచినట్లు సోనియా గాంధీ లేఖలో పేర్కొన్నారని జైరాం రమేష్ తెలిపారు. ముంబైలో జరిగిన ఇండియా కూటమి సమావేశాల సందర్భంగా, ఐదు రోజుల పార్లమెంటు సమావేశాన్ని పిలిచినట్లు మేము విన్నాము. దాని గురించి ఎవరికీ సమాచారం లేదు. సాధారణంగా ప్రత్యేక సమావేశాలు జరిగినప్పుడు, అది అనేక రాజకీయ పార్టీల మధ్య పరస్పర అంగీకారం, చర్చల ద్వారా జరుగుతుందని అన్నారు. ఎజెండాకు సంబంధించిన వివరాలేవీ మా వద్ద లేకపోవడం ఇదే మొదటిసారని జై రాం రమేష్ అన్నారు.
సాధారణంగా పార్లమెంట్ సమావేశాల సమయంలో అజెండా ఏంటి..? ఏయే అంశాలపై చర్చిస్తారనే విషయాన్ని ముందుగానే ప్రకటిస్తారు. కానీ ఈసారి మాత్రం ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఈ నేపథ్యంలో జమిలి ఎన్నికల బిల్లుతో పాటు..ఇండియా పేరును భారత్ గా మార్చడం వంటే కీలక బిల్లులను ఆమోదించేందుకే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించబోతున్నట్లు చర్చ జరుగుతూ ఉంది. పార్లమెంట్ లో అజెండాపై స్పష్టమైన ప్రకటన చేస్తామని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు.ఇప్పటి వరకూ కేంద్రం ఎలాంటి వివరాలను వెల్లడించలేదు.