కరోనా బారినపడిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఢిల్లీలోని గంగారామ్ ఆసుపత్రిలో చేరారు. ఆమె పరిస్థితి నిలకడగా ఉందని, ముందుజాగ్రత్తగా ఆసుపత్రిలో ఉంచారని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. భారత జాతీయ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణదీప్ సింగ్ సూర్జేవాలా సోనియా గాంధీని ఆసుపత్రిలో అబ్జర్వేషన్ లో ఉంచారని ట్వీట్ చేశారు.
జూన్ 2న సోనియా గాంధీకి కరోనా పాజిటివ్ అని వెల్లడైంది. నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉండగా, కరోనా కారణంగా ఆమె ఇంటికే పరిమితమయ్యారు. కరోనా సంబంధిత సమస్యలతో ఆమె నేడు ఆసుపత్రిలో చేరారని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ప్రస్తుతం సోనియా ఆరోగ్యం నిలకడగానే ఉందని, వైద్యులు ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నందున ఆమె ఆసుపత్రిలోనే ఉంటారని కాంగ్రెస్ పార్టీ తెలిపింది.