బాలీవుడ్ నటుడు శతృఘ్న సిన్హా కుమారై సోనాక్షి సిన్హాపై ఓ చీటింగ్ కేసు నమోదైంది. ఉత్తర ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌కి చెందిన ఏసీజేఎమ్ (అడిషనల్ చీఫ్ జుడీషియల్ మెజిస్ట్రేట్) కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. సల్మాన్ ఖాన్, దిశా పటానీ, పూజా హెగ్డే మరియు ఇతరులతో సోనాక్షి సిన్హా ఇటీవలే ద-బాంగ్ టూర్ నుండి భారత్ కు తిరిగి వచ్చింది. చీటింగ్ కేసులో ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ కావడంతో ఇప్పుడు న్యాయపరమైన చిక్కుల్లో పడింది.
ఈటైమ్స్ నివేదిక ప్రకారం సోనాక్షి సిన్హా ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరు కాలేదని ఆరోపించబడింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొరాదాబాద్ పట్టణం కట్ఘర్ పోలీసు స్టేషన్ పరిధిలో ప్రమోద్ శర్మ అనే వ్యక్తి ఈవెంట్ లు చేస్తుంటాడు. ఈ క్రమంలో ఢిల్లీలోని ఓ ఈవెంట్‌ను ప్లాన్ చేసి దానికి ముఖ్య అతిథిగా సోనాక్షి సిన్హాను ఆహ్వానించాడు. ఆ కార్యక్రమానికి సోనాక్షి సిన్హా హాజరు కాలేదు. అయితే.. సోనాక్షికి ఆ కార్యక్రమానికి వచ్చేందుకు రూ.37 లక్షలు ఇచ్చాడు. ఆమె రాకపోవడంతో తాను ఇచ్చిన డబ్బులను తిరిగి ఇవ్వాలని కోరగా అందుకు సోనాక్షి మేనేజర్ తిరస్కరించాడు. సోనాక్షి సిన్హాను స్వయంగా కలిసి ఎన్నో సార్లు సంప్రదించినా ఫలితం లేకపోవడంతో ప్రమోద్ మోసం కేసు దాఖలు చేశాడు. కేసు విచారణ నిమిత్తం ఆమె మొరాదాబాద్‌కు రావాల్సి ఉండగా ఆమె హాజరు కాలేదు. దీంతో స్థానిక న్యాయస్థానం ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. సోనాక్షి 2010లో యాక్షన్-డ్రామా చిత్రం దబాంగ్‌లో రజ్జో పాండే పాత్రతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఈ చిత్రానికి ఆమె ఫిల్మ్‌ఫేర్ అవార్డును కూడా గెలుచుకుంది. ఆ తర్వాత ఆమె పలు కమర్షియల్ సినిమాల్లో నటించింది. ప్రస్తుతం వర్క్ పరంగా సోనాక్షి ‘డబుల్ ఎక్స్‌ఎల్’ సినిమాలో హ్యూమా ఖురేషితో పాటు ప్రధాన పాత్రలో కనిపించనుంది. ఇది కాకుండా, ఆమె రితీష్ దేశ్‌ముఖ్, సాకిబ్ సలీమ్‌లతో ‘కకుడ’ లో నటిస్తోంది.