పోలవరం వివాదం వెనుక.. పెద్ద కుట్ర: సోము వీర్రాజు

0
804

పోలవరం ప్రాజెక్ట్ కేంద్రంగా తెలుగు రాష్ట్రాల నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూ ఉన్న సంగతి తెలిసిందే..! ఈ సరికొత్త వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. పోలవరంపై వివాదం రేపడం వెనుక పెద్ద కుట్ర దాగుందని.. పోలవరం విషయంలో జరుగుతున్న పరిణామాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అంశాన్ని తిరగతోడినట్లేనని అన్నారు. పోలవరంను ప్రశ్నించడమంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రశ్నించినట్టేనని అన్నారు. 1960లో పోలవరం ముంపు మండలాలను ఖమ్మం జిల్లాలో కలిపారని… రాష్ట్ర విభజన తర్వాత భద్రాచలంతో పాటు మరో రెండు మండలాలను తెలంగాణకు ఇచ్చారని సోము వీర్రాజు చెప్పారు. పోలవరం నిర్మాణం వల్ల ముంపుకు గురయ్యే అవకాశం ఉన్న మండలాలు తెలంగాణలో ఉండటంతో వాటిని ఏపీకి ఇచ్చేశారని తెలిపారు. పోలవరం విషయంలో రాష్ట్ర ప్రజలను ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోసం చేస్తున్నారని సోము వీర్రాజు చెప్పారు. చంద్రబాబు హయాంలో పోలవరంలో అవినీతి జరిగిందని గతంలో జగన్ ఆరోపించారని.. మరి ఈ మూడేళ్ల కాలంలో అవినీతిని బయటపెట్టి చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు.