టీడీపీ అధినేత చంద్రబాబు చిత్తూరు జిల్లా కుప్పం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఆ సమయంలో చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల ఫలితాలకు పొత్తులకు సంబంధం లేదని అన్నారు. తమ పార్టీ గతంలో పలు పార్టీలతో పొత్తులు పెట్టుకుని గెలిచిందని, పొత్తులు లేకుండా కూడా గెలిచిందని ఆయన తెలిపారు. ఒక్కోసారి పొత్తులు పెట్టుకున్నప్పటికీ ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయని అన్నారు. పొత్తులు అనేవి రాష్ట్రంలోని పరిస్థితులను బట్టి ఆధారపడి ఉంటాయని తెలిపారు. ప్రస్తుతంలో ఏపీలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా అందరూ కలవాల్సిన అవసరం ఉందని అన్నారు. సీజగన్ విధ్వంసక పాలన పోవాలంటే ధర్మ పోరాటం చేయాలని.. ఇందుకు ప్రతి ఒక్కరూ కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు.
చంద్రబాబు నాయుడు పొత్తు రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శలు చేశారు. చంద్రబాబు ఎవరినైనా లవ్ చేస్తారని, అవసరం వచ్చినప్పుడు లవ్ చేయడంలో ఆయన దిట్ట అని అన్నారు. ఆ తర్వాత ఆయన ఏం చేస్తారో తన నోటితో తాను చెప్పలేనని సోము వీర్రాజు అన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీని కూడా లవ్ చేశారని అన్నారు. లవ్ చేయడం వదిలేయడం ఆయన నైజం.. మామ నుంచి అందరినీ ప్రేమించారన్నారు. 1996లో కాంగ్రెస్ పార్టీలో చక్రం తిప్పి.. అప్పటి నుంచి అన్ని పార్టీలతో లవ్ చేస్తున్నారని తర్వాత ఆయనేంటో చూపిస్తారన్నారు. జనసేన పార్టీ తమ మిత్రపక్షమే అని సోము వీర్రాజు చెప్పారు.
మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి కూడా పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ మంచి వ్యక్తి.. ఆయనతో కలిసి పనిచేసేందుకు టీడీపీ సిద్ధంగా ఉంటుందన్నారు. ఈ రాక్షస పాలనను అంతం చేయడానికి టీడీపీతో జనసేన కలిసిరావాలని పిలుపును ఇచ్చారు.