మాజీ సైనికుల సమస్యలపై లేఖ రాసిన సోము వీర్రాజు.. పవన్ తో భేటీ

కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కి బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఏపీలోని మాజీ సైనికుల సమస్యలు ఇప్పటికీ పెండింగ్ లో ఉన్నాయని చెప్పారు. విజయవాడలో ఆర్మీ బెటాలియన్ హెడ్ క్వార్టర్స్ ను ఏర్పాటు చేయాలని కోరారు. పలు రాష్ట్రాల లాగా ఏపీలో కూడా మాజీ సైనికుల వాహనాలకు టోల్ గేట్ రాయితీని వర్తింపచేయాలని కోరారు. మిలిటరీ డిస్పెన్సరీల్లో ఫార్మసీ సౌకర్యాన్ని మెరుగు పరచాలని రక్షణ మంత్రిని కోరారు.
కడప జిల్లా బద్వేలు ఉపఎన్నికపై తమ మిత్రపక్షమైన జనసేనతో చర్చించి, ఎవరు పోటీ చేయాలన్న విషయమై త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోనున్నామని ఇప్పటికే సోము వీర్రాజు చెప్పారు. తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక మాదిరిగానే పోటీ చేయాలా? లేదా అన్న దానిపై ఇంకా స్పష్టతకు రాలేదన్నారు. రోడ్ల నిర్మాణంపై బహిరంగ చర్చకు సిద్ధమా అని రాష్ట్ర ప్రభుత్వానికి సోము వీర్రాజు సవాల్ చేశారు. మిత్రపక్షమైన జనసేనతో కలిసి గాంధీ జయంతి సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. భాజపా తరఫున చేనేత కార్మికులకు బాసటగా నిలిచేందుకు చేనేత వస్త్రాలను కొనుగోలు చేస్తామన్నారు.
తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో సోము వీర్రాజు భేటీ అయ్యారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఇరు పార్టీల నేతలూ సమావేశమయ్యారు. బద్వేలు ఉప ఎన్నిక, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. అక్టోబర్ 2న శ్రమదానం వివరాలను జనసేన నేతలు సోము వీర్రాజుకు వివరించారు. అక్టోబర్ 7న నెల్లూరులో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించబోయే మత్స్య గర్జన సభ వివరాలను బీజేపీ నేతలు పవన్‌కు వివరించినట్టు సమాచారం.