జమ్మూ కశ్మీర్ లో కనిపించకుండా పోయిన భారత జవాన్లు

0
774

జమ్మూ కశ్మీర్ లో గత కొద్దిరోజులుగా తీవ్రవాదులను భద్రతా బలగాలు ఏరి పారేస్తూ ఉన్నాయి. పెద్ద ఎత్తున తీవ్రవాదులను అంతం చేస్తూ ఉన్నాయి. తీవ్రవాదులు ప్రతిఘటిస్తూ ఉండడంతో భారత భద్రతా దళాలకు చెందిన వాళ్లు ప్రాణ త్యాగం చేశారు. పూంచ్-రాజౌరి అటవి ప్రాంతంలో సోమవారం నుంచి ఆర్మీ, ఉగ్రవాదుల మధ్య భారీ స్థాయిలో ఎన్‌కౌంటర్‌ జరుగుతున్నది. గురువారం నాటికి ఐదుగురు జవాన్లు, ఒక జేసీవో వీరమరణం పొందారు. అయితే ఇప్పుడు ఒక జూనియర్‌ కమిషన్డ్‌ ఆఫీసర్‌ (జేసీవో)తోపాటు ఇద్దరు జవాన్ల జాడ తెలియడం లేదు. గురువారం సాయంత్రం నుంచి జేసీవోతో కాంటాక్ట్‌ను ఆర్మీ కోల్పోయింది. ఈ నేపథ్యంలో ఆర్మీ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘పూంచ్‌ జిల్లా నార్ ఖాస్ అటవీ ప్రాంతంలోని మెంధర్ సబ్ డివిజన్‌లో కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్‌ కొనసాగుతున్నది. అక్టోబర్ 14 సాయంత్రం ఆర్మీ దళాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. జేసీవో, ఒక జవాన్‌ తీవ్రంగా గాయపడ్డారు. ఆపరేషన్లు కొనసాగుతున్నాయి’ అని తెలిపింది.

ఇద్దరు జవాన్లు మరణించినట్లు ఆర్మీ శుక్రవారం ధ్రువీకరించింది. గాయపడిన జేసీవో గురించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో జాడ లేని జేసీవో కోసం శనివారం ఉదయం ఆర్మీ భారీ స్థాయిలో సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టినట్లు ఒక అధికారి తెలిపారు. నార్‌ ఖాస్‌ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదుల ఏరి వేతకు భారీగా కూంబింగ్‌ ఆపరేషన్‌ జరుగుతున్నట్లు చెప్పారు. ఈ ప్రాంతంలో సోమవారం మొదలైన్‌ ఎన్‌కౌంటర్‌ ఆరో రోజుకు చేరింది. ఇప్పటి వరకు ఒక జేసీవో, ఏడుగురు జవాన్లు వీరమరణం పొందారు. భద్రతా కారణాల నేపథ్యంలో గురువారం సాయంత్రం నుంచి పూంచ్-జమ్ము జాతీయ రహదారిని అధికారులు మూసివేశారు. జమ్మూ కశ్మీర్ లో అమాయకులను చంపడానికి తీవ్రవాదులు ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున ప్రయత్నించారు. కొందరిని చంపారు కూడా.. దీంతో భారత సైన్యం ఎంతో అప్రమత్తమైంది.