సెలవుల్లో ఇంటికి వచ్చిన సైనికుడు మిస్సింగ్

0
916

సోమవారం మధ్యాహ్నం జమ్మూ కాశ్మీర్ లైట్ ఇన్‌ఫాంట్రీకి చెందిన సమీర్ అహ్మద్ మల్లా అనే సైనికుడు మరో గ్రామానికి వెళ్ళాడు. అప్పటి నుంచి అతడు కనిపించకుండా పోయాడని, సెల్‌ఫోన్ స్విచ్ఛాఫ్‌లో ఉందని పోలీసులు నిర్ధారించారు. సెలవుపై ఇంటికి తిరిగి వచ్చిన సైనికుడు, సెంట్రల్ కాశ్మీర్‌లోని బుద్గామ్ జిల్లాలోని తన గ్రామం నుండి కనిపించకుండా పోయాడు. ఆ ప్రాంతంలోని మిలిటెంట్లు అతడిని అపహరించినట్లు కుటుంబం తెలిపింది. బుద్గామ్‌లోని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ), తాహిర్ సలీమ్, ఈ సంఘటనను ధృవీకరిస్తూ తాము అతని కోసం వెతుకుతున్నామని తెలిపారు. ఈ సమయంలో దేన్నీ తోసిపుచ్చలేమని.. మిలిటెంట్లు అతన్ని అపహరించే అవకాశం ఉందని సలీమ్ అన్నారు.

జమ్మూలో పోస్టింగ్‌లో ఉన్న మల్లా తన భార్య రెండో బిడ్డకు జన్మనివ్వడంతో సెలవుపై ఇంటికి వచ్చాడు. ‘ఇంట్లో భోజనం చేశాక.. దాదాపు 1.30 గంటలకు బయటకు వెళ్లిపోయాడు. అప్పటి నుండి అతని గురించి ఎటువంటి సమాచారం లేదు. అతని సెల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేయబడిందని’ అతని మామ హబీబుల్లా మాలిక్ తెలిపారు. ఏడు రోజుల క్రితం తన రెండవ బిడ్డ పుట్టినప్పటి నుండి, మల్లా మజామా గ్రామంలోని తన అత్తమామల ఇంట్లో గడిపి, పగటిపూట ఖాగ్‌లోని లోకిపోరా గ్రామంలోని ఇంటికి వెళ్తుంటాడని మాలిక్ తెలిపారు. సోమవారం ఉదయం మల్లా తన పెద్ద కొడుకుతో ఇంటికి తిరిగి వచ్చాడు.. బయలుదేరే ముందు, అతను సాయంత్రం తిరిగి వస్తానని, తన కొడుకును తీసుకువెళతానని తన తల్లికి చెప్పాడని కుటుంబ సభ్యులు తెలిపారు.

గత రెండు రోజులుగా, కుటుంబ సభ్యులు తప్పిపోయిన మల్లా కోసం ఒక గ్రామం నుండి మరొక గ్రామానికి వెళ్లి వెతుకుతున్నారు. అతనిని విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తూ వస్తున్నారు. అతను ఏదైనా తప్పు చేసి ఉంటే, దయచేసి అతన్ని క్షమించి విడుదల చేయండి. మేము అతనితో ఉద్యోగానికి రాజీనామా చేయిస్తామని కుటుంబ సభ్యులు చుట్టుపక్కల గ్రామాల్లో అరుస్తూ తిరుగుతూ వచ్చారు.