ఐక్యరాజ్యసమితి వేదికగా ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్ ను భారత్ కడిగిపారేసింది. ఐరాస సాధారణ సభ సమావేశంలో కశ్మీర్ అంశాన్ని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రస్తావించాడు. దీంతో భారత్ ఇమ్రాన్ ఖాన్ వక్రబుద్ధిని, పాక్ ప్రభుత్వ తీరును ఎండగడుతూ తీవ్ర విమర్శలు చేసింది. భారీ సంఖ్యలో ఐరాస నిషేధిత జాబితాలోని ఉగ్రవాదులు పాక్ లోనే ఉన్నారని.. అందుకే కశ్మీర్ లో పరిస్థితులు ఇలా తయారయ్యాయని భారత్ తెలిపింది.
పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలకు సమాధానంను భారత తొలి కార్యదర్శి స్నేహా దూబే ఇచ్చారు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడం, సాయం చేయడం, మద్దతునివ్వడంలో ఘనమైన చరిత్ర, విధానాలు పాక్ సొంతమని ఉదాహరణలతో సహా స్నేహ చెప్పుకొచ్చారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి గుర్తించిన అనేక మంది ఉగ్రవాదులకు ఆతిథ్యం ఇవ్వడంలో పాక్ ది ఘనమైన చరిత్ర.. ఒసామా బిన్ లాడెన్‌కు పాక్ ఆశ్రయమిచ్చింది.. అంతేకాదు, ఉగ్రవాదులను అమర వీరులుగా పాక్ నాయకత్వం కీర్తిస్తోంది. భారత దేశానికి వ్యతిరేకంగా నిరాధార ఆరోపణలు, హానికరమైన ప్రచారానికి ఐరాస వేదికను పాక్ ఉపయోగించుకోవడం ఇదే తొలిసారి కాదు.. ఆ దేశాధినేతలు ఈ వేదికను దుర్వినియోగం చేస్తున్నారు.. ఉగ్రవాదులకు స్వర్గంగా మారడం వల్ల సాధారణ ప్రజలు, ముఖ్యంగా మైనారిటీ వర్గాలకు చెందిన వారి జీవితాలు తల్లకిందులు కావడంతో ప్రపంచం దృష్టిని మరల్చడానికి భారత్‌పై ఇటువంటి ఆరోపణలు చేస్తోంది’ అని చెప్పుకుంటూ వెళ్లారు. ఉగ్రవాదులకు మద్దతివ్వడం, సహకరించడం, ఆశ్రయం కల్పించడంలో పాకిస్థాన్ పాత్ర గురించి ఐరాసలో సభ్యదేశాలకు తెలుసునని స్నేహ ప్రస్తావించారు. బహిరంగంగా ఉగ్రవాదులకు మద్దతు, శిక్షణ, ఆర్ధిక, ఆయుధాలు సమకూర్చడమనేది ప్రభుత్వ విధానంగా పెట్టుకున్న ఏకైక దేశం పాక్ అనేది ప్రపంచం గుర్తించింది అని స్నేహ దూబే ఇమ్రాన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. దీంతో స్నేహ దూబే పేరు ఇప్పుడు దేశ వ్యాప్తంగా మారుమ్రోగిపోతోంది. యూఎన్‌లో స్నేహ దూబే మాట్లాడిన తీరు పట్ల సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి. ఆమె మాట్లాడిన వీడియోలను పోస్టు చేస్తూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.
స్నేహ దూబే ఎవరు..?
యూఎన్‌లో భారత్ తరపున ఫస్ట్ సెక్రటరీగా ఉన్నారు స్నేహ దూబే. గోవాలో స్కూల్ విద్యను పూర్తి చేసి పూణెలోని ఫెర్గూసన్ కాలేజీ నుంచి ఉన్నత విద్యను అభ్యసించారు. ఢిల్లీలోని జవర్‌లాల్ నెహ్రూ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ నుంచి ఎంఫిల్ పూర్తి చేశారు. 12 ఏళ్ల వయసులోనూ ఇండియన్ ఫారిన్ సర్వీసెస్‌లో ఉద్యోగం చేయాలన్న లక్ష్యాన్ని పెట్టుకుని 2011లో సివిల్ సర్వీసెస్ రాశారు. మొదటి ప్రయత్నంలోనే ఆమె పాసైంది. ఐఎఫ్ఎస్ ఆఫీసర్ కావడం వల్ల తాను దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కింది. స్నేహ దూబే తండ్రి ఓ మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఇక తల్లి స్కూల్ టీచర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఫారిన్ సర్వీస్‌కు ఎంపికైన తర్వాత విదేశీ వ్యవహారాల శాఖలో తొలిసారి ఆమె అపాయింట్ అయ్యారు. 2014లో మాడ్రిడ్‌లో ఉన్న ఎంబసీలో ఆమె తొలి బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం యూఎన్‌లో ఇండియా ఫస్ట్ సెక్రటరీగా కొనసాగుతున్నారు.
అక్కడ కూడా తాలిబాన్ల గురించే మాట్లాడిన ఇమ్రాన్ ఖాన్
76వ ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో తాలిబాన్లకు మద్దతుగా పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రసంగం చేశారు. తాలిబాన్ల ప్రభుత్వానికి అండగా నిలవాలని ఐక్యరాజ్యసమితి సాధారణ సభను ఆయన కోరారు. తాలిబాన్ల ప్రభుత్వం బలోపేతం కావడానికి, స్ధిరీకరణ కోసం మద్దతివ్వాలని ఆయన ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశారు. ఆప్ఘనిస్తాన్ పౌరుల్ని దృష్టిలో ఉంచుకుని తాలిబాన్ల ప్రభుత్వానికి మద్దతివ్వాలని ఆయన ఐరాస సాధారణ సభలో కోరారు. ఆఫ్ఘనిస్తాన్‌ని నిర్లక్ష్యం చేస్తే, ఐరాస అంచనాల ప్రకారం, ఆఫ్ఘనిస్తాన్‌లో సగం మంది ప్రజలు ఇప్పటికే బలహీనంగా ఉన్నారు వచ్చే ఏడాది నాటికి ఆఫ్ఘనిస్తాన్‌లో దాదాపు 90 శాతం మంది ప్రజలు దారిద్య్రరేఖకు దిగువకు వెళతారని అన్నారు. అస్థిరతకు గురైన ఆప్ఘనిస్తాన్ అస్తవ్యస్తంగా మారడం వల్ల మరోసారి అంతర్జాతీయ ఉగ్రవాదులకు సురక్షిత ప్రాంతంగా మారే అవకాశం ఉందని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. గతంలో అమెరికా ఇది జరగకుండా చూసిందని, ఇప్పుడు ప్రపంచ దేశాలు జోక్యం చేసుకుని ఆప్ఘన్ ను ఆదుకోవాలని ఇమ్రాన్ ఖాన్ కోరారు.