మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా రైల్వే స్టేషన్‌లో రాబంధుల స్మగ్లర్‌ను అరెస్ట్ చేశారు. రైలు నంబర్ 12144 సుల్తాన్‌పూర్ లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్‌లో ఒక వ్యక్తి బ్యాగ్‌లో కొన్ని పక్షులను తీసుకువెళుతున్నట్లు ఖాండ్వా స్టేషన్‌లో రైల్వే పోలీసులకు సమాచారం అందింది. సమాచారం అందుకున్న వెంటనే రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సదరు వ్యక్తి వద్ద ఉన్న వస్తువులను పరిశీలించారు. స్మగ్లర్ నుండి అంతరించిపోయిన జాతికి చెందిన ఏడు తెలుపు రంగు రాబంధులు దొరికాయి. రైలులో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు.. స్మగ్లర్ దగ్గర దుర్వాసన రావడంతో టికెట్ ఇన్‌స్పెక్టర్‌కు సమాచారం అందించాడు. రైలు ఖాండ్వా రైల్వే స్టేషన్‌కు చేరుకోగానే టికెట్ ఇన్‌స్పెక్టర్ ఆర్పీఎఫ్‌కి సమాచారం అందించారు.ఖాండ్వా రైల్వే స్టేషన్‌లో ఆర్‌పిఎఫ్, అటవీ శాఖ సంయుక్త విచారణలో నిందితుడిని అరెస్టు చేశారు. ఈ రాబంధులు ఈజిప్షియన్ జాతికి చెందిన అరుదైనవిగా గుర్తించారు.
“రైలులో ఒక వ్యక్తి తెల్ల రాబంధులను తీసుకెళ్తున్నట్లు మాకు RPF నుండి సమాచారం వచ్చింది. సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని రైలులో సోదాలు నిర్వహించాయి. నిందితుడు ఫరీద్ అహ్మద్ నుండి ఏడు తెల్ల రాబంధులు (ఈజిప్షియన్ రాబంధులు) స్వాధీనం చేసుకున్న తరువాత అరెస్టు చేశాం. వన్యప్రాణి సంరక్షణ చట్టం, 1972 కింద కేసు నమోదు చేశాం” అని అటవీ శాఖ ఎస్‌డిఓ ఆర్‌ఎస్ సోలంకి తెలిపారు. మరిన్ని వివరాల కోసం నిందితుడిని ప్రశ్నిస్తున్నట్లు ఆయన తెలిపారు. కోర్టు నుండి అనుమతి పొందిన తర్వాత రాబంధులు బయటకు విడుదల చేస్తామని తెలిపారు. రాబంధులను యూపీలోని కాన్పూర్ నుంచి మహారాష్ట్రలోని మాలెగావ్‌కు తరలిస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో రాబంధులు అక్రమ రవాణా జరగడం ఇదే తొలిసారి. రాబంధులన్నింటినీ అటవీశాఖకు అప్పగించారు.