More

    రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు.. స్మృతి ఇరానీ కౌంటర్లు

    కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ కరోనా ఉధృతికి కేంద్ర ప్రభుత్వమే కారణమంటూ తీవ్ర విమర్శలు చేశారు. కరోనా థర్డ్ వేవ్ వ‌స్తుంద‌న్న అనుమానాలు వ్య‌క్తం అవుతున్న నేప‌థ్యంలో ఆయ‌న శ్వేత‌ప‌త్రాన్ని విడుదల చేశారు. మూడో వేవ్ కోసం కేంద్ర ప్ర‌భుత్వం సిద్ద‌మై ఉండాల‌ని అన్నారు. రెండ‌వ వేవ్ స‌మ‌యంలో జ‌రిగిన లోపాలు త‌లెత్త‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. తాను రిలీజ్ చేసిన శ్వేత‌ప‌త్రం ల‌క్ష్యం భ‌విష్య‌త్తు ప్ర‌ణాళిక‌ల‌ను సూచిస్తుంద‌ని, నిపుణుల‌తో చ‌ర్చించి నాలుగు విధానాల‌ను డెవ‌ల‌ప్ చేసిన‌ట్లు రాహుల్ చెప్పారు. ప్ర‌భుత్వాలు ప్రిపేరై ఉండాల‌ని, హాస్పిట‌ళ్లు, ఆక్సిజన్‌, మందుల‌తో సిద్దంగా ఉండాల‌ని రాహుల్ తెలిపారు. సెకండ్ వేవ్ స‌మ‌యంలో 90 శాతం మందిని ర‌క్షించుకునేవాళ్ల‌మ‌ని.. కేవ‌లం ఆక్సిజ‌న్ అందుబాటులో లేక‌పోవ‌డం వ‌ల్ల ఆ ఘోరం జ‌రిగిన‌ట్లు ఆయ‌న తెలిపారు. ప్ర‌ధాని మోదీ క‌న్నీళ్లు ప్ర‌జ‌ల్ని కాపాడ‌లేవ‌ని, కేవ‌లం ఆక్సిజ‌న్ మాత్ర‌మే ర‌క్షిస్తుంద‌న్నారు. రెండో ద‌శ క‌రోనా విజృంభ‌ణ స‌మ‌యంలో మృతి చెందిన వారిలో 90 శాతం మంది స‌రైన వైద్య స‌దుపాయాలు అంద‌కే మృతి చెందారు. వారి మృతికి ముఖ్య కార‌ణం ఆక్సిజ‌న్ కొర‌తే. వారి కుటుంబ స‌భ్యుల క‌న్నీళ్ల‌ను ప్ర‌ధాని మోదీ కార్చుతోన్న క‌న్నీళ్లు తుడవలేవు. వారిని ఆయ‌న క‌న్నీరు కాపాడ‌లేదు.. ఆక్సిజ‌న్ మాత్ర‌మే కాపాడుతుంది అని రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. వైద్య స‌దుపాయాల గురించి ఆయ‌న ప‌ట్టించుకోకుండా ప‌శ్చిమ బెంగాల్ ఎన్నిక‌లపైనే దృష్టి పెట్టారు. కుటుంబానికి ఆధారంగా నిలిచిన వారు ప్రాణాలు కోల్పోయారు. వారి కుటుంబాల‌కు ప‌రిహారం కూడా చెల్లించ‌లేని స్థితిలో ప్ర‌భుత్వం ఉందని అన్నారు. శ‌ర‌వేగంగా వ్యాక్సిన్లు వేయాల్సి ఉంటుంది. 100 శాతం వ్యాక్సినేష‌న్ పూర్తి కావాలి. రెండో అంశం ఏంటంటే ఆసుప‌త్రిలో ఆక్సిజ‌న్, వెంటిలేట‌ర్లు వంటి వైద్య స‌దుపాయాలు, త‌గిన‌న్ని బెడ్లు, ఇత‌ర‌ వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉండాలని అన్నారు. దేశంలో రికార్డు స్థాయిలో 86.16 ల‌క్ష‌ల వ్యాక్సిన్ డోసులు వేయ‌డం అభినందించ‌ద‌గ్గ విష‌యం. అయితే, కేవ‌లం ఒక్క రోజు మాత్ర‌మే ఇలా ప‌ని చేసి ఊరుకోవ‌ద్దని రాహుల్ గాంధీ అన్నారు.

    మోదీపై రాహుల్ గాంధీ చేసిన విమ‌ర్శ‌ల‌కు కేంద్ర మంత్రి, బీజేపీ నేత స్మృతి ఇరానీ కౌంటర్ వేశారు. స్మృతి ఇరానీ రాహుల్ గాంధీని “జ్ఞానీ బాబా (తెలివైన సన్యాసి)” అని ఎగతాళి చేసారు, అతను ఇతరులకు “వివేకం ముత్యాలను వెదజల్లుతున్నాడు”, అయితే తన సొంత పార్టీ పాలించిన రాష్ట్రాలు ఎందుకు పేలవంగా ఉన్నాయో ఆత్మపరిశీలన చేసుకోవడం లేదని అన్నారు. సెకండ్ వేవ్ “కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో” ప్రారంభమైందని.. కాంగ్రెస్ పార్టీ పాలించిన ఒక రాష్ట్రం అత్యధిక మరణాల రేటును నమోదు చేసిందని స్మృతి ఇరానీ ఆరోపించారు. ఆమె ఏ రాష్ట్రమో చెప్పలేదు. మహమ్మారిని అరికట్టడానికి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఎలా వ్యవహరించాయో వరుస ట్వీట్లను చేశారు స్మృతి. క‌రోనా పాజిటివిటీ రేటు సైతం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనే అధికంగా ఉంద‌ని ఆమె చుర‌క‌లు వేశారు.

    టీకా వికేంద్రీకరణపై కాంగ్రెస్ “యు-టర్న్” తీసుకుందని అన్నారు. వ్యాక్సిన్ల మీద అనవసరమైన భయాలను కాంగ్రెస్ నాయకులు ప్రజల్లో కలిగించారని ఆమె ఆరోపించారు. టీకాను ప్రజలకు ఇవ్వడమనే విషయంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఘోరంగా విఫలమయ్యాయని.. వ్యాక్సిన్ వేస్టేజీ గురించి కూడా ఆమె విమర్శలు గుప్పించారు.

    Related Stories