More

    ఇక అమేథీలోనే స్మృతి ఇరానీ స్థిరనివాసం

    కేంద్రమంత్రి, అమేథీ ఎంపీ స్మృతి ఇరానీ అన్న మాట నిలబెట్టుకున్నారు. విజయం సాధిస్తే అమేథీలోనే వుంటానని.. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీని నెరవేర్చనున్నారు. ఇంటి కోసం అమేథీలో కొంత స్థలాన్ని కొనుగోలు చేశారు. అక్కడ త్వరలోనే ఇంటి నిర్మాణం ప్రారంభించనున్నారు. దీంతో అమేథీ నుంచి గెలిచి.. అదే నియోజకవర్గంలో సొంత నివాసం ఏర్పాటు చేసుకుంటున్న తొలి ఎంపీగా స్మృతి ఇరానీ రికార్డు క్రియేట్ చేశారు.

    ఇంతవరకు అమేథీ నుంచి గెలిచిన ఏ ఒక్క ఎంపీ కూడా అక్కడ నివాసం ఏర్పాటు చేసుకోలేదు. 1967లో ఏర్పాటైన అమేథీ నియోజవర్గం.. స్మృతి ఇరానీ కంటే ముందు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ఓ రెండేళ్లు మినహా అక్కడ అంతా కాంగ్రెస్ పాలనలోనేవుంది. సంజయ్ గాంధీ ఒకసారి, రాజీవ్ గాంధీ నాలుగుసార్లు, సోనియాగాంధీ ఒకసారి, రాహుల్ గాంధీ మూడుసార్లు గెలుపొందారు. అయితే, వీరిలో ఎవరు కూడా అమేథీలో నివాసం ఏర్పాటు చేసుకోలేదు.

    గత ఎన్నికల్లో గెలిచిన స్మృతి ఇరానీ మాత్రం.. అక్కడే ఇంటిస్థలం కొనుక్కుని.. తాజాగా దానిని రిజిస్ట్రేషన్ కూడా చేయించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన స్మృతి ఇరానీ.. రాహుల్ గాంధీ పేరును ప్రస్తావించకుండా.. ఆయనపై విమర్శలు గుప్పించారు. అమేథీ నియోజకవర్గం నుంచి గెలిచిన ఏ ఒక్క ఎంపీ కూడా అక్కడ నివాసం ఉంటూ పాలన చేయలేదన్నారు. తమ ఎంపీ తమ నియోజకవర్గంలోనే నివాసం ఉంటూ పాలన చేయడం చూస్తే అమేథీ ప్రజలు ఆశ్చర్యానికి గురవుతారని ఆమె అన్నారు. అంతేకాదు, ఇన్నాళ్లూ కిరాయి ఇంట్లో ఉంటూ పాలన సాగించానని, ఇప్పుడు నియోజకవర్గంలో సొంతింటి నిర్మాణం కోసం స్థలాన్ని కొనుగోలు చేశానని స్మృతి ఇరానీ చెప్పారు. త్వరలోనే ఈ స్థలంలో భూమిపూజ ఉంటుందని.. దీనికి నియోజకవర్గ ప్రజలు ఆహ్వానితులేనని తెలిపారు.

    2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆమేథీలో సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న రాహుల్‌ గాంధీ మరోసారి పోటీ చేశారు. అయితే రాహుల్‌ను ఓడిస్తానని సవాల్‌గా తీసుకుని స్మృతి ఇరానీ మొదటిసారి ఆమేథీ నుంచి లోక్‌సభకు పోటీ చేశారు. హోరాహోరి ప్రచారం చేసి చివరకు రాహుల్‌గాంధీని ఓడించి స్మృతి ఇరానీ సంచలనం సృష్టించారు. 55 వేల 120 ఓట్ల మెజారిటీతో స్మృతి ఇరానీ గెలుపొందారు. అయితే స్మృతి ఇరానీ పోటీతో భయపడి కేరళలోని వయనాడ్‌లో రాహుల్‌ గాంధీ పోటీ చేశారని రాజకీయాల్లో టాక్‌ ఉంది. అందుకే రాహుల్‌ ఆమేథీలో ఓటమి పాలవగా వయనాడ్‌లో గెలిచారు.

    ఇదిలావుంటే, తాను గెలిస్తే అమేథీలోనే నివాసం ఉంటానని నాటి ఎన్నికల సమయంలోనే స్మృతి ఇరానీ హామీ ఇచ్చారు. అన్నమాట ప్రకారం.. అమేథీలో అమె సొంతింటిని నిర్మించుకుంటున్నారు. ఎంపీగా విజయం సాధించినప్పటీ నుంచి ఇక్కడ ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. ఇప్పుడు సొంతంగా ఇల్లు నిర్మించుకుని నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండనున్నారు స్మృతి ఇరానీ.

    Trending Stories

    Related Stories