More

    ఆరుగురు పాకిస్తాన్ శరణార్థులకు భారత పౌరసత్వం

    దేశంలో ప్రవేశపెట్టిన కొత్త పౌరసత్వ సవరణ చట్టం ప్రకారం.. తొలిసారి ఆరుగురు పాకిస్తాన్ శరణార్థులకు పౌరసత్వం లభించింది. దశాబ్దాల కాలంగా భారత్ లోనే జీవిస్తున్న వారికి.. దేశ పౌరసత్వం కల్పించినట్టు మధ్యప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది.

    పాకిస్తాన్ లో మతపరమైన హింసకు గురై.. భారత్ లో బతికేందుకు వచ్చారని.. మధ్యప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి నరోత్తం మిశ్రా తెలిపారు. భారత పౌరసత్వ పత్రాల్ని అధికారికంగా ఈ ఆరుగురికీ అందించారు. పాకిస్తాన్‌లోని సింధ్‌ ప్రావిన్స్ నుంచి వీరు 1988-2005 సమయంలో భారత్‌లోని మధ్యప్రదేశ్‌కు వచ్చారని, ఈ నేపథ్యంలోనే వారికి పౌరసత్వ సవరణ చట్టం కింద భారత పౌరసత్వం అందిచామని అధికారులు తెలిపారు. పౌరసత్వం పొందిన ఆరుగురిలో నందలాల్, అమిత్ కుమార్‌లు భోపాల్‌లో నివసిస్తుండగా.. అర్జునదాస్, జైరామ్ దాస్, నారాయణ్ దాస్, సౌశల్యబాయిలు మాండ్‌సోర్‌కు చెందినవారుగా ఉన్నారు. 31 ఏళ్లుగా వీరు అటు పాకిస్తాన్, ఇటు భారత్ కు రెండింటికీ చెందకుండా ఉన్నారు. ఇప్పుడు పౌరసత్వం రావడంతో భారతీయులమనే గర్వం ఉందని అంటున్నారు.

    రాష్ట్ర ప్రభుత్వం తమకు భారత దేశ పౌరసత్వం కల్పించడం పట్ల చాలా సంతోషంగా శరణార్థులు సంతోషం వ్యక్తం చేశారు. 31 ఏళ్లుగా తాను అటు పాకిస్తాన్‌, ఇటు భారత్‌కు చెందిన వాడని కాదనే భావన ఉండేదని.. కానీ, ప్రస్తుతం తాను భారతీయుడినని గర్వంగా ఉన్నట్లు శరణార్థుల్లో ఒకరైన అర్జున్‌దాస్ మంచందాని మీడియాతో తెలిపారు.

    పౌరసత్వ సవరణ చట్టాన్ని.. మధ్యప్రదేశ్ తో పాటు.. మరి కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే అమలు చేస్తున్నాయి. 2019లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీఏఏ.. 2020 జనవరి 10 నుంచి అమల్లోకి వచ్చింది. పౌరసత్వం సవరణ చట్టం ప్రకారం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్‌లలో మతపరమైన హింసకు గురయ్యే హిందూ, సిక్కు, బౌద్ధ, జైన, పార్శీ, క్రైస్తవ వలసదారులకు భారత పౌరసత్వం కల్పిస్తోంది. అయితే 2014కు ముందు భారత్ కు వలసవచ్చి ఉండాలి.

    సీఏఏ ఆమోద యోగ్యం కాదని కొన్ని ముస్లిం వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో.. దేశ ప్రయోజనాల కోసమే ఈ చట్టం తెచ్చామని బీజేపీ చెబుతోంది. ఈ చట్టంతో ముస్లింలకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పింది. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చింది. రాజకీయ లబ్ది కోసమే కొన్ని పార్టీలు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాయని, దుష్ప్రచారం చేస్తున్నాయని బీజేపీ ఆరోపించింది.

    Trending Stories

    Related Stories