More

    అస్సాం-మిజోరాం బోర్డర్ గొడవలు.. ఆరుగురు పోలీసులు మృతి

    అస్సాం-మిజోరాం సరిహద్దు సమస్య కారణంగా రోజు రోజుకీ ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమవుతోంది. అస్సాంలోని కాచర్‌ జిల్లా, మిజోరంలోని కోలాసిబ్‌ జిల్లాల మధ్య ఉన్న సరిహద్దు వద్ద స్థానికులు, భద్రతాసిబ్బంది మధ్య గొడవ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో కొందరు కాల్పులు జరపడంతో అస్సాంకు చెందిన ఆరుగురు పోలీసులు ప్రాణాలు కోల్పోయినట్టు సీఎం హిమంత బిశ్వశర్మ వెల్లడించారు. మిజోరం సరిహద్దుల నుంచి జరిపిన కాల్పుల్లోనే వారు మృతిచెందినట్లు ఆరోపించారు. రెండు రోజుల క్రితమే సరిహద్దు వివాదాలపై ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమావేశమయ్యారు. అస్సాం, మిజోరం కొన్నేళ్ల నుంచి సరిహద్దు వివాదం కొనసాగుతోంది. గత నెలలో కూడా రెండు రాష్ట్రాల భద్రతా సిబ్బంది మధ్య ఘర్షణ చెలరేగింది.

    ఘర్షణల నివారణకు చర్యలు తీసుకోవాలంటూ మరోసారి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం నాడు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా చర్చించారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య ట్విటర్‌ వేదికగా మాటల యుద్ధం కొనసాగింది. మిజోరం ముఖ్యమంత్రి జోరంతంగా.. సరిహద్దుల్లో చెలరేగిన ఘర్షణలకు సంబంధించిన వీడియోను ట్విటర్‌లో పోస్ట్‌ చేస్తూ అమిత్ షాను ట్యాగ్‌ చేశారు. ‘అస్సాం మీదుగా మిజోరంకు వస్తున్న ప్రజలపై అక్కడివారు దాడులకు పాల్పడుతున్నారు. ఇలాంటి హింసాత్మక చర్యలను ఎలా సమర్థించుకుంటారు?’ అని ట్వీట్ చేశారు. తప్పు మొత్తం మీదేనని హిమంత బిశ్వశర్మ మిజోరం ముఖ్యమంత్రి జోరంతంగాకు సమాధానం ఇచ్చారు. అలా ట్విట్టర్ లో మాటల యుద్ధం కొనసాగుతోంది.

    అస్సాం, మిజోరం స‌రిహ‌ద్దు స‌మస్య ఇప్ప‌టిది కాదు. కొన్ని ద‌శాబ్దాలుగా ర‌గులుతూనే ఉంది. గ‌తేడాది, తాజాగా జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌ల‌తో ఇది మొత్తం దేశం దృష్టిని ఆక‌ర్షించింది. ఒకప్పుడు ఈశాన్య భార‌తం చాలా వ‌ర‌కూ అస్సాంలో భాగంగానే ఉంది. స్వాతంత్ర్యం వ‌చ్చిన త‌ర్వాత ఏర్ప‌డిన నాగాలాండ్‌, మేఘాల‌య‌, మిజోరం, అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లు అస్సాం నుంచి వేరుప‌డిన‌వే. అయితే ఈ రాష్ట్రాలు ఏర్ప‌డిన‌ప్పుడు స‌రిహ‌ద్దుల‌ను స‌రిగ్గా నిర్ణ‌యించ‌క‌పోవ‌డం ఇప్పుడీ స‌మ‌స్య‌ల‌కు కార‌ణ‌మ‌వుతోంది. 1972లో మిజోరంను కేంద్ర పాలిత ప్రాంతంగా.. ఆ త‌ర్వాత 1987లో ప్ర‌త్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేశారు. అయితే అంత‌కుముందు దీనిని లూషాయి హిల్స్‌గా పిలిచేవారు. ప్ర‌స్తుతం ఈ హిల్స్‌ను మీజో హిల్స్ అంటున్నారు. మిజోరం రాష్ట్రంలో ఉన్న ఈ కొండ‌లే ఇప్పుడు వివాదానికి కేంద్ర బిందువుగా ఉన్నాయి. 1970ల నుంచే స‌రిహ‌ద్దు స‌మ‌స్య‌తో అస్సాం, మిజోరం మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌లు మొదలయ్యాయి. 2020లో ఇవి మ‌రింత పెద్ద‌వి అయ్యాయి. తాజాగా చోటు చేసుకున్న గొడవల కారణంగా తీవ్ర‌త దేశం మొత్తానికీ తెలిసి వ‌చ్చింది.

    Trending Stories

    Related Stories