భజరంగ్ దళ్ హర్ష మర్డర్ కేస్.. ఇప్పటి దాకా ఆరుగురి అరెస్ట్

0
706

భజరంగ్ దళ్ కార్యకర్త హర్ష హత్యకు సంబంధించి కర్ణాటక పోలీసులు ఇప్పటివరకు మొత్తం 6 మంది వ్యక్తులను అరెస్టు చేశారు. ఈ విషయాన్ని శివమొగ్గ ఎస్పీ లక్ష్మీ ప్రసాద్ మంగళవారం నాడు తెలియజేశారు. ANI ప్రకారం, అరెస్టు చేసిన 6 మంది నిందితులకు క్రిమినల్ రికార్డులు ఉన్నాయని ఎస్పీ లక్ష్మీ ప్రసాద్ తెలిపారు. హత్య కేసులో కర్ణాటక పోలీసులు మరో 12 మందిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. హర్ష హత్య వెనుక గల కారణాలను తెలుసుకునేందుకు ప్రతి నిందితుడిని విడివిడిగా విచారిస్తామని ఎస్పీ లక్ష్మీప్రసాద్‌ తెలిపారు.

అరెస్టయిన నిందితులను ఖాసిఫ్ (కాసిఫ్), సయ్యద్ నదీమ్, ముజాహిద్, రిహాన్ అలియాస్ ఖాసీ, అఫాన్, ఆసిఫ్‌లుగా గుర్తించినట్లు మీడియా నివేదికలు సూచిస్తున్నాయి. నిందితుడు ఖాసిఫ్‌పై ఇప్పటికే పది క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ప్రధాన కుట్రదారులు సయ్యద్ నదీమ్, ఖాసిఫ్ లతో పాటూ మరొక వ్యక్తిని ఫిబ్రవరి 21 న బెంగళూరులో పట్టుకున్నారు. మిగిలిన ముగ్గురిని ఫిబ్రవరి 22, మంగళవారం నాడు పట్టుకున్నారు.

భజరంగ్ దళ్ కార్యకర్త హత్యపై విలేకరుల సమావేశంలో ఎస్పీ లక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ, హర్షను కారులో వచ్చిన నిందితులు వెంబడించి హత్య చేశారని, ప్రత్యక్ష సాక్షులు కూడా చాలా తక్కువ మంది ఉన్నారని చెప్పారు. ఫిబ్రవరి 21న పట్టుబడ్డ ఖాసిఫ్‌ ఆదివారం రాత్రి క్యాంటీన్‌లో టీ తాగుతున్న హర్షపై మరో నలుగురితో కలిసి కారులో వచ్చి దాడి చేసినట్లు విచారణలో అంగీకరించాడు. పదునైన ఆయుధాలతో అతడిపై దాడి చేసిన అనంతరం నిందితులు ఘటనా స్థలం నుంచి పరారయ్యారు.

ఫిబ్రవరి 20న రాత్రి భారతి నగర్‌లో హర్షను ఏడుగురు వ్యక్తులు కత్తులతో పొడిచి హత్య చేశారు. హర్ష హిందూ సంస్థ, భజరంగ్ దళ్ సభ్యుడు. పాఠశాలలు, కళాశాలల దుస్తులు ఒకేలా ఉండాలని డిమాండ్ చేయడానికి కాషాయ శాలువాలు ధరించి కనిపించాడు. 2015లో కూడా అతడి సోషల్ మీడియా పోస్ట్‌లపై కొందరు బెదిరింపులకు పాల్పడ్డారని ఇటీవలే వెలుగులోకి వచ్చింది.