శివాజీ గణేశన్ కుటుంబంలో ఆస్తి చిచ్చు..!

0
705

అనుబంధం, ఆప్యాయత అంతా భూటకం..ఆత్మ తృప్తి కోసం మనుషులు ఆడుకునే నాటకం అని ఓ సినిమా పాట వుంది. దశాబ్దాల క్రితమే ఆప్యాయతలు, అనురాగాలు కరువైపోయినప్పుడు.. నెట్టింటి, సెల్లింటి, ట్విట్టింటి శకంలో ప్రేమలు, అభిమానాలు పంచుకోవడం, చిన్నా, పెద్దల తారతమ్యాల గురించి మాట్లాడుకోవడం అర్థరహితమే అని..వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. గతించిన సెలబ్రెటీల కుటుంబాల్లోని కొందరు..ఆస్తుల విషయంలో గొడవలు పడుతున్నారు. ఒకప్పటి తమిళ దిగ్గజ నటుడు శివాజీ గణేశన్ కుటుంబీకులు ఆస్తుల కోసం రోడ్డెక్కారు. తమ తండ్రి ఆస్తుల పంపకంలో అన్యాయం జరిగిందని ఆయన కుమార్తెలు కోర్టులో కేసు దాఖలు చేశారు.

శివాజీ గణేశన్ కుటుంబంలో ఆస్తి చిచ్చు రేగింది. తోబుట్టువులు..సోదరులపై కోర్టుకు ఎక్కారు. శివాజీ గణేశన్ మృతి చెందిన రెండు దశాబ్దాల తర్వా ఈ గొడవలు మొదలయ్యాయి. తమ తండ్రి శివాజీగణేశన్ కు చెందిన 271 కోట్ల రూపాయల ఆస్తి పంపకం సరిగా జరగలేదని తోబుట్టువులు, తమ సోదరులపై ఆరోపించారు. వెంటనే తమకు న్యాయం చేయాలని కోరారు. ఆస్తిలో వాటాలు ఇవ్వలేదని, వెయ్యి సవర్ల బంగారం, 500 కిలోల వెండిని తమ సోదరులు తస్కరించారని ఆరోపించారు. దీంతో, ఈ వివాదం చినికి చినికి గాలివానలా మారేలా కనిపిస్తోంది. తమ తండ్రి ఆస్తిలో తమకు వాటా ఇవ్వలేదని, ప్రముఖ తమిళ నటుడు ప్రభుపైన, నిర్మాత రామ్ కుమార్ పైన శివాజీ గణేశన్ కుమార్తెలు శాంతి, రాజ్వీ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.

శాంతి థియేటర్‌లో 82 కోట్ల రూపాయల విలువైన వాటాలను వారు తమ పేరున మార్చుకున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తమ తండ్రి రాసినట్టు చెబుతున్న వీలునామా నకిలీదని పేర్కొన్నారు. జనరల్ పవర్ ఆఫ్ అటార్నీపై సంతకం తీసుకుని తమను మోసం చేశారని ఆరోపించారు. ఈ కేసులో ప్రభు, రామ్ కుమార్ లతో పాటు వారి కుమారులు విక్రమ్ ప్రభు, దుష్యంత్‌లపైనా కేసు పెట్టారు.