ట్యాక్స్ పేయర్స్ కోసం కొత్త వెబ్ సైట్ ను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ తీసుకుని వచ్చింది. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కోసమే కాకుండా ఎన్నో ఉపయోగాల కోసం ఈ కొత్త వెబ్ సైట్ ను తీసుకుని వచ్చారు. కొత్త వెబ్ సైట్ రూపకల్పన కోసం జూన్ 1-6 వరకూ ప్రస్తుతం ఉన్న ఈ-ఫైలింగ్ పోర్టల్ పని చేయలేదు. ఈ ఆరు రోజులు పాత పోర్టల్ డౌన్ చేశారు. కొత్త వెబ్ సైట్ యూజర్ ఫ్రెండ్లీ అని అధికారులు వెల్లడించారు. పాత వెబ్ సైట్ పోర్టల్ అయిన www.incometaxindiaefiling.gov.in ని.. కొత్తగా www.incometax.gov.in మార్చారు.
కొత్త పోర్టల్‌లో అనేక ఇబ్బందులు తలెత్తుతుండడంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సైట్‌ను అభివృద్ధి చేసిన ఇన్ఫోసిస్ అధికారులతో ఆమె భేటీ అయ్యారు. ఇన్ఫోసిస్ తరఫున సంస్థ సీఈఓ సలీల్ పరేఖ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ ప్రవీణ్ రావు సమావేశానికి హాజరయ్యారు. సమస్యలను తొలగించాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన కొత్త వెబ్‌సైట్ వల్ల ఇబ్బందులు తలెత్తడంపై సీతారామన్ వారితో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏమాత్రం సమయం వృథా చేయకుండా వెంటనే వెబ్‌సైట్‌లోని సమస్యల్ని పరిష్కరించాలని ఆదేశించారు. పన్ను చెల్లింపుదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. వీలైనంత త్వరగా వారి సమస్యలకు పరిష్కారం చూపాలని కోరారు. సైట్‌లోని సాంకేతిక సమస్యల్ని ప్రస్తావించిన ఇన్ఫోసిస్ అధికారులు వాటి పరిష్కారానికి తీసుకుంటున్న చర్యల్ని సీతారామన్‌కు వివరించారు.
కొత్త ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ పోర్టల్ లో సాంకేతిక లోపాలను నిర్మలా సీతారామన్ మంగళవారం ఇన్ఫోసిస్ అధికారులతో సమీక్షించారు. సీతారామన్ తో పాటూ ఆర్థిక మంత్రి అనురాగ్ ఠాకూర్, రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్, సిబిడిటి చైర్మన్ జగన్నాథ్ మోహపాత్రా, ఇతర సీనియర్ మంత్రిత్వ శాఖ అధికారులు కొత్త పోర్టల్ ఎదుర్కొంటున్న సమస్యలపై ఇన్ఫోసిస్ అధికారులతో చర్చించారు. ఒక్కో సాంకేతిక లోపాన్ని కూడా ఇన్ఫోసిస్ విభాగానికి వివరించారు. జూన్ 7 న ప్రారంభించిన కొత్త పోర్టల్ లో లాగిన్ కు ఎక్కువ సమయం తీసుకుంటూ ఉండడం, ఆధార్ ధ్రువీకరణ కోసం OTP రాకుండా ఉండడం, ఇంతకు ముందు సంవత్సరాలకు చెందిన ITR లు లభించకపోవడం వంటి అవాంతరాలను ఎదురవుతూ ఉన్నాయి. అనేక మంది పోర్టల్ ఎదుర్కొంటున్న సమస్యలను, పరిష్కరించాల్సిన వాటిని చూపించారు. యూజర్ ఇంటర్‌ఫేస్ వీక్ గా ఉందని కూడా పలువురు వినియోగదారులు ఫిర్యాదు చేశారు.
ఇ-ఫైలింగ్ పోర్టల్ www.incometax.gov.in జూన్ 7 న ప్రారంభించబడింది. కొత్త వెబ్ సైట్ ద్వారా పన్ను చెల్లింపుదారులు చాలా సులువుగా యాక్సెస్ చేసే అవకాశం ఉంటుందని భావించారు. తీరా చూస్తే ఎన్నో సమస్యలు ఉత్పన్నమవుతూనే ఉన్నాయి. సాధారణ ఆదాయపు పన్ను చెల్లింపుదారులు 2020-21 ఆర్థిక సంవత్సరంలో సంపాదించిన ఆదాయానికి, 2021-22 అంచనా సంవత్సరానికి వారి వార్షిక రాబడిని దాఖలు చేయడానికి ఉపయోగించే పోర్టల్ ఇది. వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు అటువంటి రిటర్నులను దాఖలు చేయడానికి చివరి తేదీ సెప్టెంబర్ 30. ఇంకా ఎన్ని రోజులకు ఈ సమస్యలు పరిష్కారమవుతాయోనని వినియోగదారులు టెన్షన్ పడుతూ ఉన్నారు.
ఇన్ఫోసిస్ సంస్థ వార్షిక వాటాదారుల సమావేశంలో సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తున్నట్లు పేర్కొంది. ఇప్పటికే కొన్ని సమస్యలను తీర్చామని వెల్లడించింది. రాబోయే రోజుల్లో మిగిలిన సమస్యలను కూడా తీరుస్తామని స్పష్టం చేసింది. ఎటువంటి సమస్య కనిపించకుండా యూజర్లకు పోర్టల్ సేవలను అందించడమే తమ లక్ష్యమని తెలిపింది.