More

  సిరివెన్నెల మృతికి నెలరోజుల ముందు.. ఈ వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు..!

  సాహితీ శిఖరాగ్రగణ్యులు సిరివెన్నెల సీతారామశాస్త్రి.. తెలుగు సినీ ప్రపంచంపై సాహితీ వెన్నెల కురిపించి.. అలసి, సొలసి.. నింగికేగి అప్పుడే ఏడాది పూర్తయింది. తన పరమ గురువు సద్గురు శివానంద మూర్తి కాలం చేసిన ఆరేళ్ల తర్వాత ఆయన కూడా భౌతికమైన ఈ లోకానికి సెలవంటూ వెళ్లిపోయారు. అయితే, సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఈ లోకాన్ని వీడటానికి సరిగ్గా నెలరోజుల ముందు ఓ అద్భుతం చోటు చేసుకుంది. ఆయనకు భవిత కనిపించిందో.. లేక, గురువు పిలుపు వినిపించిందో ఏమో తెలియదు గానీ.. పరమ గురువు దర్శనమిచ్చిన ప్రదేశానికి వెళ్లాలనిపించింది. గురువు ఆశ్రమానికి కడసారి వీడ్కోలు పల్కడానికి వెళ్లినట్టుగా.. బీమిలిలోని సద్దురు శివానందమూర్తి ఆశ్రమం ఆనందవనానికి వెళ్లారు. నెల రోజుల్లో తాను కూడా గురు సన్నిధికి చేరుతానని, గగన సాహితీ సామ్రజ్యాన్ని ఏలుతానని ఆయన భావించారో ఏమో.. అక్కడ గురు ఆశ్రమంలో,.. పండు వెన్నెల్లో.. సిరివెన్నెల ధ్యానం చేశారు, గానం చేశారు. శివానందమూర్తి శిష్యులతో ఆడిపాడారు.

  స్పాట్ ()

  విశాఖ భీమిలి ఆనందవనం నిత్య ఆధ్యాత్మిక నందనవనం. ఆ సుందర వనంలో.. సిరివెన్నెల అడుగుపెట్టడంతో ఆధ్యాత్మిక సొబగులకు సాహితీ కవితా గాన సౌరభాలు తోడయ్యాయి. గురుతుల్యుని స్మరిస్తూ, నిష్ఠాగరిష్టతతో, నియమబద్ధంగా, నిశ్శబ్దంగా కొంతసేపు ధ్యానం చేశారు. ధ్యానముద్ర నుంచి బయటకు వచ్చాక, సద్గరు శివానంద మూర్తి శిష్యబృందంతో కలిసి.. తాను రచించిన అత్యద్భుత పాటలు పాడుతూ తనను తాను మైమరచిపోయారు. గురువు శుభాశీస్సీసులతో అప్పటివరకు అందంగా పేర్చి, కూర్చిన పాటల పూదోటను ఆనంద వనంలో విలీనం చేసినట్టు భావించారో ఏమో..? దాదాప్యం చెంది తన గీతాలను గానకళా సామ్రాట్టుగా.. గీతాలాపన చేసి.. అక్కడున్న అందరి ఆశ్చర్యచకితుల్ని, ఆనందభరితులను చేశారు సిరివెన్నెల. సాహితీ కోవిదుడు, గానకళా రాజ్యంలో తేలియాడుతుంటే ఆశ్రమ సమీప ప్రకృతి పులకించిపోయింది. శిశుర్వేత్తి, పశుర్వేత్తి, వేత్తిగాణ రసం ఫణి: అన్నట్టు.. ప్రకృతి రమణీయమైన ఆ సుందర ఆశ్రమ పరిసరాల్లోని తరువులు, గిరులు, పశుపక్ష్యాదులు దివ్యానుభూతి పొందాయి. ః

  స్పాట్ ()

  ఈ అద్భుత దృశ్యాలను తన సెల్ ఫోన్ లో బంధించారు సద్గురు శివానందమూర్తి మరో శిష్యులు, సిరివెన్నెల ఆత్మీయులు మామిడి గిరిధర్ గారు. సెల్ ఫోన్లలో చిత్రీకరించడం వల్ల వీడియోల్లో కాస్త క్లారిటీ లోపించి ఉండవచ్చు. కానీ, శాస్త్రిగారి స్వీయ రచనలను, తానే స్వయంగా ఆలపిస్తున్న విధానాన్ని, భాషకందని భావమైన ఆర్థ్రతను అర్థం చేసుకుంటే.. మనస్సు విశాలమవుతుంది. గురుదేవులు శివానంద మూర్తి భౌతికంగా ఈ లోకంలో లేకపోయినా.. ఈ దృశ్యం చూస్తే.. గురుదేవుల పాదాల చెంత ప్రియశిష్యుడు పాటల దక్షిణ సమర్పిస్తున్నాడనే భావన కలుగుతుంది.

  స్పాట్ ()

  ఆశ్చర్యం , అబ్బురం, కాకతాళీయం.. ఇలా ఏ పదాలు అనుకున్నా.. ఇవన్నీ సిరివెన్నెల గురుదేవుల ఆశ్రమ సందర్శన సమయంలో ఆవిష్కృతమయ్యాయి. దేశభక్తిని ప్రబోధించేలా.. పాటలు రాయాలన్న గురుదేవుల సూచనల మేరకు.. సిరివెన్నెల కొన్ని అద్భుతమైన గీతాలకు రూపకల్పన చేశారు. అయితే, ఆ పాటలను ఆలకించడానికి గురుదేవులు లేకపోయినా.. భువి నుంచి దివికి తాను మరో మాసంలో వెళ్లిపోతానని ముందే తెలిసిందో ఏమో.. ఆయన రచించిన దేశభక్తి ప్రబోధిత పాటలన్నీ ఆశ్రమంలో అతి మధురంగా, శ్రవణానందంగా గానం చేశారు. పాడుతూ తాను తన్మయత్వం చెందారు. అక్కడున్న అందరిని అలరించారు.

  స్పాట్ ()

  సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి, నేషనలిస్ట్ హబ్ కు ఉన్న సాన్నిహిత్యం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నేషనలిస్ట్ హబ్ పురుడుపోసుకున్నప్పటి నుంచి ఒక మార్గదర్శకుడి పాత్రను పోషించారు. ఫౌండర్, సీఈవో సాయికృష్ణగారికి అన్ని విషయాల్లో గురుతుల్యులుగా వ్యవహరించి.. సంస్థ పురోగతికి సలహాలు, సూచనలు అందించారు. నేషనలిస్ట్ హబ్ ద్వితీయ వార్షికోత్సవానికి విచ్చేసి.. దిశానిర్దేశం చేశారు. పుణ్యజీవి, ధన్యజీవి, వాగ్దేవి మాత వరప్రసాదితులు.. సిరివెన్నెల సీతారామశాస్త్రి చూపించిన అభిమానాన్ని నేషనలిస్ట్ హబ్ సర్వదా గుర్తుంచుకుంటుంది. దేశం కోసం, ధర్మం కోసం పరితపించిన ఆయన ఆశయాలకు అనుగుణంగా తన ప్రయాణం సాగిస్తుంది. ప్రాత:స్మరణీయులు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి నేషనలిస్ట్ హబ్ అందించే గొప్ప నివాళి అదే.

  Trending Stories

  Related Stories