సిరివెన్నెల తుదిశ్వాస విడవడానికి కారణాలు చెప్పిన కిమ్స్ వైద్యులు

0
888

సినీ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి హైదరాబాదులోని కిమ్స్ ఆసుపత్రిలో మృతి చెందారు. ఈ విషయాన్ని తెలుగు సినీ ప్రపంచం జీర్ణించుకోలేకపోతోంది. ఆయన చనిపోవడానికి గల కారణాలను కిమ్స్ ఆసుపత్రి ఎండీ డాక్టర్ భాస్కర్ రావు తెలియజేశారు. ఆరేళ్ల క్రితమే క్యాన్సర్ తో సీతారామశాస్త్రి సగం ఊపిరితిత్తును తీసేయాల్సి వచ్చిందని.. ఆ తర్వాత ఆయనకు బైపాస్ సర్జరీ కూడా జరిగిందని చెప్పారు. కొద్దిరోజుల కిందట క్యాన్సర్ వస్తే దాంట్లో కూడా సగం తీసేశారని.. ఆ తర్వాత కూడా రెండు రోజులు బాగానే ఉన్నారని తెలిపారు. ఆ తర్వాత ఆరోగ్య సమస్యలు తలెత్తాయని, దీంతో అడ్వాన్స్ డ్ ట్రీట్మెంట్ కోసం కిమ్స్ కు తీసుకొచ్చారని అన్నారు. కిమ్స్ లో రెండు రోజుల పాటు వైద్యాన్ని అందించిన తర్వాత ఆయన ఆరోగ్యం మెరుగుపడిందని తెలిపారు. ప్రికాస్టమీ చేసి 45 శాతం ఊపిరితిత్తు తీసేశామని, మిగిలిన 55 శాతం ఊపిరితిత్తుకు ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పారు. ఆయనను ఎక్మో మిషన్ పై పెట్టామని, గత ఐదు రోజుల నుంచి ఆయన ఎక్మో మిషన్ పైనే ఉన్నారని తెలిపారు. క్యాన్సర్, పోస్ట్ బైపాస్ సర్జరీ, కిడ్నీ డ్యామేజ్ తో పాటు ఒబేసిటీ పేషెంట్ కూడా కావడంతో ఇన్ఫెక్షన్ శరీరమంతా సోకిందని చెప్పారు. ఈ కారణాల వల్ల ఆయన మరణించారని తెలిపారు.

సిరివెన్నెల సీతారామశాస్త్రి భౌతికకాయాన్ని అభిమానుల సందర్శనార్థం ఈ ఉదయం ఫిలింనగర్‌లోని ఫిలిం చాంబర్‌కు తీసుకొచ్చారు. ఉదయం పదిన్నర గంటల వరకు అక్కడే ఉంచి 11 గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. సీతారామశాస్త్రి భౌతిక కాయాన్ని సందర్శించిన సినీ రచయిత, నటుడు తనికెళ్ల భరణి కన్నీటి పర్యంతమయ్యారు. స్రవంతీ మూవీస్‌లో ఇద్దరం కలిసి పనిచేశామని గుర్తు చేసుకున్నారు. ప్రతి పదాన్ని చెక్కేవాడని, ఆయన పాట వజ్రం పొదిగినట్టు ఉండేదని అన్నారు. ఆయన పాటల ప్రకాశం తెలుగుజాతి ఉన్నంత వరకు ఉంటుందని చెబుతూ తనికెళ్ల భరణి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.