More

    మహా ప్రస్థానంలో సిరివెన్నెల అంత్యక్రియలు

    సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణాన్ని తెలుగు సినీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నెల 24న న్యుమోనియాతో బాధపడుతూ కిమ్స్‌ ఆసుపత్రిలో చేరారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. సిరివెన్నెల మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సిరివెన్నెల పార్థివ దేహాన్ని సందర్శించేందుకు ఉదయం ఫిల్మ్‌ నగర్‌లోని ఫిల్మ్‌ ఛాంబర్‌లోకి తీసుకుని వచ్చారు. అనంతరం సిరివెన్నెల అంత్యక్రియలు నేడు మహాప్రస్థానంలో జరుగుతాయని కుటుంబ సభ్యులు వెల్లడించారు. సిరివెన్నెల అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వేలాదిగా అభిమానులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున మంత్రి పేర్ని నాని అంత్యక్రియలకు హాజరుకానున్నారు.

    సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతి పట్ల భారత ప్రధాని మోదీ, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. సిరివెన్నెల మృతిపై ప్రధాని మోదీ తెలుగులో ట్వీట్ చేశారు. అత్యంత ప్రతిభావంతుడైన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి మరణం తనను ఎంతగానో బాధించిందని చెప్పారు. ఆయన రచనలతో కవిత్వ పటిమ, బహుముఖ ప్రజ్ఞ గోచరిస్తుందని అన్నారు. తెలుగు భాషా ప్రాచుర్యానికి ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. ఆయన కుటుంబసభ్యులకు, స్నేహితులకు సంతాపాన్ని తెలియజేస్తున్నానని అన్నారు. ‘ఓం శాంతి’ అంటూ ట్వీట్ చేశారు. రాష్ట్రపతి ద్వారా పద్మశ్రీ పురస్కారాన్ని అందుకుంటున్న ఫొటోను మోదీ పోస్ట్ చేశారు.

    తెలుగు సినిమా గేయ రచయిత శ్రీ చేంబోలు సీతారామశాస్త్రిగారు పరమపదించారని తెలిసి ఎంతో విచారించానని వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. తొలి సినిమా సిరివెన్నెల పేరునే ఇంటి పేరుగా మార్చుకుని తెలుగు భాషకు పట్టం కడుతూ వారు రాసిన విలువలతో కూడిన ప్రతి పాటనూ అభిమానించే వారిలో తాను కూడా ఒకడినని చెప్పారు.

    సిరివెన్నెల మరణంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఎటువంటి సంగీత ప్రక్రియలతోనైనా పెనవేసుకుపోయే అద్భుత సాహిత్యాన్ని సిరివెన్నెల సృష్టించారని.. పండిత, పామరుల హృదయాలను ఆయన గెలుచుకున్నారని అన్నారు. సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్న ఆయన సాహిత్య ప్రస్థానం… సామాజిక, సాంప్రదాయ అంశాలను స్పృశిస్తూ మూడున్నర దశాబ్దాల పాటు సాగిందని అన్నారు. ఆయన మరణం తెలుగు చలనచిత్ర రంగానికి, సంగీత సాహిత్య అభిమానులకు తీరని లోటు అని అన్నారు.

    ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందిస్తూ.. సినీ గేయ ప్రపంచంలో విలువల శిఖరం సిరివెన్నెల అని కొనియాడారు. అక్షరాలతో ఆయన చేసిన భావ విన్యాసాలు తెలుగువారి చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతాయని అన్నారు. ఆయన హఠాన్మరణం తెలుగువారందరికీ తీరనిలోటు అని చెప్పారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని, ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు.

    టీడీపీ అధినేత చంద్రబాబు స్పందిస్తూ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతి వార్త దిగ్భ్రాంతిని కలిగించిందని చెప్పారు. దాదాపు 3 వేలకు పైగా పాటలు రాసి, సంగీత ప్రియులను అలరించిన పద్మశ్రీ సీతారామశాస్త్రి మరణం తెలుగు సాహితీ లోకానికే తీరని లోటు అని అన్నారు.

    Trending Stories

    Related Stories