గాయని శ్రావణ భార్గవి ఎట్టకేలకు

0
809

టాలీవుడ్ గాయని శ్రావణ భార్గవి ఎట్టకేలకు వెనక్కి తగ్గింది. వివాదానికి కారణమైన తన వీడియోలో బ్యాక్ గ్రౌండ్ లో వస్తున్న అన్నమయ్య కీర్తనను తొలగించింది. వీడియోను మాత్రం తొలగించలేదు. కేవలం సంగీతం వినిపిస్తుండగా, ఆ వీడియో కొనసాగించింది. శ్రావణ భార్గవి అన్నమయ్య సంకీర్తన అయిన ‘ఒకపరి కొకపరి వయ్యారమై..’ అనే కీర్తనకి వీడియో చేసి తన యూట్యూబ్ ఛానల్ లో పెట్టింది. ఈ వీడియోలో తన అందాన్ని అభివర్ణిస్తున్నట్టుగా ఆ సంకీర్తనని పాడిందనే విమర్శలు వచ్చాయి. అన్నమయ్య పెద్ద కుమారుడు పెద తిరుమలాచార్యులు వెంకటేశ్వర స్వామికి అభిషేకం కైంకర్యం చేస్తూ భక్తి భావంతో పాడిన కీర్తనను శ్రావణ భార్గవి తన అందాన్ని చూపిస్తూ, కాళ్లు ఊపుతూ పాడి వీడియో చేయడం చాలా తప్పని అన్నమయ్య వంశస్థులు ఆగ్రహించారు.

వివాదంపై గాయని శ్రావణ భార్గవి స్వయంగా వివరణ ఇచ్చింది. తానెప్పుడూ కావాలని వివాదాలను రేకెత్తించలేదని స్పష్టం చేసింది. అన్నమయ్య పట్ల విశేష గౌరవంతో ఆ వీడియో రూపొందించానని, అందుకు ఎంతో శ్రమ, సమయం ఖర్చు చేశానని వెల్లడించింది. ప్రతికూల ధోరణులకు తానెప్పుడూ దూరంగా ఉంటానని, ఏమాత్రం ప్రోత్సహించనని స్పష్టం చేసింది. ఏదేమైనా తన వీడియో ఓ కళాఖండం అని విశ్వసిస్తున్నానని, ప్రతి అంశానికి ఓ దృష్టికోణం ఉంటుందని అభిప్రాయపడింది. అది చూసే తీరును బట్టి ఉంటుందని, తీరు మారినప్పుడే మార్పు కనబడుతుందని శ్రావణ భార్గవి వివరణ ఇచ్చింది.

శనివారం నాడు.. గాయని శ్రావణి భార్గవి పై అన్నమయ్య అభిమానులు తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అన్నమయ్య కీర్తనలతో చేసిన వీడియో తొలగించాలని, పాట తొలగించాలని విజ్ఞప్తి చేసిన తాళ్లపాక వంశీయులతో శ్రావణి భార్గవి దురుసుగా మాట్లాడారని శ్రావణి భార్గవి పై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.