టాలీవుడ్ ప్రముఖ సింగర్ శ్రావణ భార్గవి వివాదంలో చిక్కుకుంది. తిరుమల శ్రీవారిని తన పద సంకీర్తనలతో మెప్పించి, మైమరపించిన తొలి తెలుగు వాగ్గేయ కారుడు అన్నమాచార్యుల సంకీర్తలను శ్రావణ భార్గవి పాడటంతో ఈ వివాదం మొదలైంది. శ్రావణ భార్గవి చేసిన వీడియోపై అన్నమయ్య వంశస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్నమయ్య పెద్ద కుమారుడు పెద తిరుమలాచార్యులు వెంకటేశ్వర స్వామికి అభిషేకం కైంకర్యం చేస్తూ భక్తి భావంతో పాడిన కీర్తనను శ్రావణ భార్గవి వివిధ భంగిమల్లో కనిపిస్తూ, కాళ్లు ఊపుతూ పాడి చిత్రీకరించడాన్ని పలువురు తప్పుబట్టారు. ఈ విషయాన్ని టిటిడి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళతామని, అవసరం అయితే కోర్టుకు కూడా వెళ్తామని అన్నమయ్య వంశస్తులు చెబుతున్నారు.
విమర్శలపై సింగర్ శ్రావణ భార్గవి స్పందించారు. తాను పాడిన పాటలో ఎలాంటి తప్పులేదని.. మీరు చూసే చూపులోనే తప్పుందని సమాధానం ఇచ్చింది. ‘ఆ వీడియోలో అశ్లీలత ఎక్కడ కనిపించింది? నేను ఆ పాటను ఎంత భక్తితో పాడానో నాకు తెలుసు. ఈ పాటలో మీకు తెలుగుదనం తప్పా ఇంకేదైనా కనిపిస్తే అది మీ చూపులో లోపం. నా ప్రాబ్లం కాదు.మీరు చూసే చూపులో లోపం ఉంటే దుప్పటి కప్పుకుని కూర్చున్నా అశ్లీలంగా కనిపిస్తుంది. నేనేం లిరిక్స్ మార్చి పాడలేదు. నా అంతరాత్మకి తెలుసు నేను తప్పుచేయలేదని. నిజంగా ఈ పాట తప్పు అంటే.. దేవుడే ఆ పాటని తీయించేస్తాడు. మగ గాయకులు ఆల్బమ్స్ రిలీజ్ చేసినప్పుడు ఎలాంటి వివాదాలు ఉండవు. కానీ అదే ఆడవాళ్లు రిలీజ్ చేసినప్పుడే ఇలాంటి వివాదాలు సృష్టిస్తారు’ అంటూ శ్రావణ భార్గవి చెప్పుకొచ్చింది.