సింగర్ కెకె హఠాన్మరణం

0
865

ప్రముఖ సింగర్, సాంగ్ రైటర్ కెకె(కృష్ణ కుమార్ కున్నత్) కన్ను మూశారు. కోల్‌కతాలోని నజ్రుల్ మంచా ఆడిటోరియంలో కచేరీ ముగిసిన తర్వాత 53 ఏళ్ల గాయకుడు తాను బస చేసిన హోటల్‌లో కుప్పకూలిపోయాడు. ఆయన మృతి చెందినట్లు సీఎంఆర్‌ఐ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. మంగళవారం నాడు కోల్‌కతాలో ప్రదర్శన ఇచ్చిన కొన్ని గంటల తర్వాత కెకె మరణించారనే వార్త తెలిసింది. ఆయన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీలో కొన్ని గంటల క్రితం కోల్‌కతా ఆడిటోరియంలో జరిగిన సంగీత కచేరీ విజువల్స్ ఉన్నాయి.

కృష్ణకుమార్ కున్నత్ ‘పల్’, ‘యారోన్’ వంటి ఎన్నో పాటలకు ప్రసిద్ధి చెందారు. ఎన్నో బాలీవుడ్ సినిమాలలో హిట్ సాంగ్స్ పాడాడు. 1999లో కెకె తొలి ఆల్బం ‘పల్’ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. 2000ల ప్రారంభం నుండి, అతను ప్లేబ్యాక్ సింగింగ్‌లో కెరీర్‌ను ప్రారంభించాడు. కెకె హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ వంటి ఇతర భాషలలో పాటలను రికార్డ్ చేశారు. మరణవార్త ఆయన అభిమానులను, ప్రముఖులు, సన్నిహితులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన మృతికి సంతాపం ప్రకటిస్తూ సినిమా ప్రముఖులు, రాజకీయనాయకులు ట్వీట్లు చేస్తున్నారు. కెకె మృతిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన పాటలు అన్ని రకాల భావోద్వేగాలను ప్రతిబింబిస్తాయని, అన్ని వయసుల వారిని అలరిస్తాయని అన్నారు. ఆయన పాటల ద్వారా ఎప్పటికీ కెకెను గుర్తుంచుకుంటామని అన్నారు. కెకె కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.