More

    కాంస్యం సాధించిన సింధు.. 49 సంవత్సరాల తర్వాత సెమీస్ లో భారత్

    ఆదివారం నాడు సింధు భారత్ కు పతకాన్ని అందించగా.. భారత పురుషుల హాకీ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. 49 సంవత్సరాల తర్వాత ఒలింపిక్స్ లో సెమీ ఫైనల్ లో అడుగుపెట్టింది.

    టోక్యో ఒలింపిక్స్ లో భారత్ రెండో పతకం సాధించింది. మీరాబాయి చాను వెయిట్ లిఫ్టింగ్ లో రజతం సాధించగా, తెలుగుతేజం పీవీ సింధు బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ లో కాంస్యం నెగ్గింది. ఈ పతకం ద్వారా సింధు చరిత్ర సృష్టించింది. ఒలింపిక్స్ లో రెండు పతకాలు సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. 2016 రియో ఒలింపిక్స్ లో రజతం నెగ్గిన సింధు, ప్రస్తుతం టోక్యో ఒలింపిక్స్ లో కాంస్యం సాధించింది. చైనాకు చెందిన హి బింగ్జియావోతో జరిగిన పోరులో సింధు ప్రత్యర్థిని చిత్తు చేసింది. బింగ్జియావోను వరుస గేముల్లో మట్టికరిపించింది. తొలి గేమును 21-13తో సొంతం చేసుకున్న సింధు, ఆపై రెండో గేమును 21-15తో సాధించింది. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో సింధు చైనీస్ తైపేకి చెందిన వరల్డ్ నెంబర్ వన్ తై జు యింగ్ చేతిలో ఓటమిపాలవడం తెలిసిందే. కానీ కాంస్యం కోసం జరిగిన పోరులో మాత్రం సింధు ఏ మాత్రం వెన్ను చూపలేదు.

    రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి కిరణ్ రిజిజు, పలువురు ప్రముఖులు సింధుకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ… సింధు తిరుగులేని ప్రదర్శనతో అందరం సంతోషిస్తున్నామని తెలిపారు. సింధు భారత్ కు గర్వకారణమని, దేశం నుంచి ఉద్భవించిన అతికొద్దిమంది అద్భుతమైన ఒలింపియన్లలో సింధు కూడా ఒకరని మోదీ ప్రశంసించారు.

    ఒలింపిక్స్ వంటి విశ్వవేదికపై బ్యాడ్మింటన్ ఫైనల్లో ఆడే చాన్స్ కోల్పోయినందుకు బాధపడాలో, కాంస్యం నెగ్గినందుకు సంతోషించాలో అర్థం కావడంలేదని సింధు చెప్పుకొచ్చింది. ఈ కాంస్యం ఇన్నేళ్ల తన కష్టానికి ప్రతిఫలంగానే భావిస్తానని స్పష్టం చేసింది. బింగ్జియావోతో మ్యాచ్ కు ముందు తనలో తీవ్ర భావోద్వేగాలు కలిగాయని, అయితే, మ్యాచ్ లో అవన్నీ పక్కనబెట్టి ఆటపైనే దృష్టి పెట్టానని సింధు వెల్లడించింది. సర్వశక్తులు ఒడ్డి ఆడానని, దేశం కోసం పతకం సాధించింనందుకు ఆనందంగా ఉందని తెలిపింది. అన్ని సమయాల్లోనూ తన వెన్నంటే నిలిచి, తనపై ప్రేమ చూపిస్తున్నందుకు అభిమానులకు రుణపడి ఉంటానని సింధు తెలియజేసింది. ఈ విజయం వెనుక కుటుంబ సభ్యుల కష్టం, స్పాన్సర్ల ప్రోత్సాహం ఉందని వెల్లడించింది.

    ఇక ఆదివారం గ్రేట్ బ్రిటన్ తో జరిగిన పురుషుల హాకీ క్వార్టర్ ఫైనల్స్ లో భారత్ అద్భుతంగా ఆడింది. భారత పురుషుల హాకీ జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. క్వార్టర్ ఫైనల్లో భారత్ 3-1తో బ్రిటన్ పై నెగ్గింది. తద్వారా 49 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్ లో సెమీస్ చేరింది. 1972 ఒలింపిక్స్ లో సెమీఫైనల్ చేరిన తర్వాత భారత పురుషుల హాకీ జట్టు మరోసారి సెమీస్ చేరడం ఇదే ప్రథమం. టోక్యో ఒలింపిక్స్ లో పునర్ వైభవాన్ని గుర్తు చేస్తూ మేటి జట్లను మట్టి కరిపించి సెమీఫైనల్ చేరింది. సెమీఫైనల్లో భారత జట్టు బెల్జియంతో తలపడనుంది.

    Trending Stories

    Related Stories