Bharateeyam

సింధూనది పుష్కరాల వైభవం -చరిత్ర

నదులు మన దేశాభ్యుదయానికి జీవనాడులు. జాతి ప్రగతికి ప్రధాన సోపానాలు. ధరిత్రమాత నలంకరించిన అమూల్యాభరణాలు నదులు. ప్రకృతి పచ్చదనానికి, పంటచేల పరపుష్టికి, సౌందర్యోపాసకుల సంతుష్టికవి అనివార్యాలు. అందుచేతనే మానవజీవితం నదీతీరాల్లోనే వెలసిల్లింది. అంతేకాదు మన పుణ్యపురుషులు, రుషులు నదీతీరాల్లో విడిది చేసేవారు. లోకహితం కోరి యజ్ఞాలు, హోమాలు నిర్వహించేవారు. తిరిగి తమ లోకాలకు తరలే ముందు, వారు దీక్షారూప తపస్సులను నదీజలాల్లో విడిచివెళతారని పురాణ వచనం. అందువల్ల నదులకు ఎనలేని పవిత్రత చేకూరుతుందని పెద్దలు చెబుతారు. ఆయా హోమ హవిస్సులను స్వీకరించడానికి వివిధ దేవతలు తీర్థాలకు వేంచేస్తారు. వారికి ఆతిథ్యం ఇచ్చే నిమిత్తం పుష్కరుడు వస్తాడు. పుష్కరాలు వస్తే దేవతలకే కాదు, నదులకూ గొప్ప పండుగే! ఒక్కో నదిలో ఏడాది చొప్పున 12 పుణ్యనదుల్లో పుష్కరుడు నివాసం ఉంటాడు కాబట్టి, ప్రతి నదికీ 12 ఏళ్లకోసారి పుష్కరాలు వస్తాయి.
అలాగే బృహస్పతిని నవగ్రహాలకు అధిపతిగా తలచటానికి కారణం అతడి ‘గురు’ స్థానం. గురువుల్లో అగ్రగణ్యుడు, పైగా శుభాలు ఇచ్చేవాడు కాబట్టి, ఒక్కొక్క రాశిలో ప్రవేశించగానే ఒక్కొక్క నదికో పుష్కరయోగం కలుగుతుంది. ఇలా పన్నెండు రాశుల్లో పర్యటిస్తూ ఉండటంవల్ల పన్నెండు నదులు పుణ్యతీర్థాలుగా మారి పుష్కర ఘట్టానికి తెరలేస్తుంది. మళ్ళీ గురుడు ఆ రాశిలో ప్రవేశించటానికి పన్నెండు సంవత్సరాలు కావాలి. ఒకసారి పుష్కర యోగం పట్టిన నదిలో స్నానం చేస్తే అన్ని పాపాలు పటాపంచలవుతాయని ప్రజల విశ్వాసం. శుభాలు చేకూరగలవన్న నమ్మకంతో ప్రజలు ధారాళంగా దానధర్మాలు చేస్తారు. భక్తిశ్రద్ధలతో పితృకార్యాలు నిర్వహిస్తారు.
పుష్కరం పన్నెండేళ్లకు ఒకసారి రావటంవల్ల ఆ కాలమానం ఒక కొలమానంగా ప్రజాదృష్టిలో నిలిచిపోయింది. పుష్కర స్నానాభిలాషతో దేశం నలు చెరగుల నుంచి జనసందోహం తరలి రావటం సహజం. కుల, మత, జాతి భేదాలు మరచి స్నానాలు చేయటం అదో దృశ్యకావ్యం! దీనిని తిలకించేందుకు విదేశీ పర్యాటకులు వేల సంఖ్యలో తరలిస్తుంటారు. భారతీయ సంస్కృతిలోని భిన్నత్వంలో ఏకత్వానికి ఈ పుష్కర స్నానాలు తిరుగులేని నిదర్శనాలు.!
ఈ ఏడాది సింధునదికి పుష్కర సంవత్సరం. దేవ గురువు బృహస్పతి కుంభరాశిలో సంచరించే సమయంలో సింధునదికి పుష్కరాలు వస్తాయి. ఈ ఏడాది సింధు పుష్కరాలు కావడంతో చాలా మంది యాత్రీకులు లద్దాక్ లో ప్రవహించే సింధునదీలో పుష్కర స్నానాలు ఆచరించేందుకు విచ్చేస్తున్నారు.ఈ నేపథ్యంలో ఇప్పుడు సింధూనది ప్రాముఖ్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
మన భారతీయులు నీటిని గంగాదేవిగా కొలుస్తారు. గంగను భువిపైకి తెచ్చే ప్రయత్నంలో భగీరథుడు ఎన్నో ఆటంకాలు, అవరోధాలు ఎదుర్కొన్నాడు. పట్టిన పట్టు విడవకుండా, ఆ పరమేశ్వరుణ్ని మెప్పించి గంగను భువిపైకి తెచ్చాడు. శివుడి శిరస్సు మీదుగా దిగివచ్చిన గంగను ఆ పరమేశ్వరుడు భిందు సరోవరంలో విడిచిపెట్టాడు. అక్కడ నుంచి గంగ ఏడు పాయాలై ప్రవహించింది. పావని, హ్లాదిని, నళిని అనే మూడు పాయలు తూర్పువైపుగాను, సీత, సుచక్షువు, సింధువు అనే మూడు పాయలు పడమరవైపుగాను ప్రవహించాయి. ఏడవ పాయ గంగా.. భగీరథుని వెంట వెళ్లిందని మన పురాణాలు చెబుతున్నాయి. సింధునదికి పుష్పభద్ర అనే పేరు కూడా ఉంది.శివుడి జటాజూటం నుంచి పుట్టిన ఈ సింధు నది సాక్షాత్తు గంగా స్వరూపమే. మార్కండేయ మహర్షి ఈ నదితీరంలోనే తపస్సు చేసి భగవంతుడిని ప్రసన్నం చేసుకున్నాడు.
రుగ్వేదంలో కూడా సింధూ నది ప్రస్తావనలు మనకు కనిపిస్తాయి. దాదాపు 176 సార్లు సింధునది ప్రస్తావనలు కనిపిస్తాయని ప్రవచనకారులు చెబుతారు. అలాగే నదిస్తుతి సూక్తంలో కూడా సింధునదిని గురించి చెప్పడం జరిగింది. సింధూ నదీ తీరంలోని ప్రాంతాన్ని సింధు రాజ్యంగా పిలిచేవారు. ఆ రాజ్య ప్రజలను సైంధవులనేవారు. మహాభారత కాలంలో జయద్రదుడు సింధు రాజ్యాన్ని పాలించేవాడు. దృతరాష్ట్రుని కుమార్తె…కౌరవుల చెల్లెలు అయిన దుస్సలను జయద్రదుడు వివాహం చేసుకున్నాడు. కురుక్షేత్ర సంగ్రామంలో జయద్రదుడు అభిమాన్యుని చంపేశాడు. ఆ తర్వాత ఆ సైంధవుడుని అర్జునుడు సంహరించాడు.
అలాగే ప్రాచీన కాలంలో పర్షియన్లు సింధును హిందుగా పలికేవారు. వారి బాషలో స అనే అక్షరానికి బదులుగా హ అక్షరాన్ని పలికేవారు. దాంతో సింధూ కాస్తా హిందూ అయ్యిందని అంటారు. అలాగే ప్రాచీన గ్రీకులు, రోమన్లు సింధూను ఇండోస్, ఇండస్ గా వ్యవహారించేవారు. ఈ కారణంగానే భారత్ కు ఇండియా అనే పేరు వచ్చిదని చెబుతారు.
అలాగే సింధూ నదీ తీరంలోనే హరప్పా, మెహాంజోదారో నాగరికత అనాళ్లు బయటపడ్డాయి.కొంతమంది పరిశోధకులు ఈ నాగరికతను సింధూ నాగరికతగా పేర్కొన్నారు. అయితే మరికొంతమంది చరిత్రకారులు భారత దేశంలో అదృశ్యమైన సరస్వతి నది తీరంలోనే ఉందని… కాబట్టీ దీనిని సరస్వతి నాగరికతగా పేర్కొంటున్నారు.
ఇక మన జాతీయ గీతంలో పంజాబ్, సింధు, గుజరాత, మరాఠా అని అంటాం.! కానీ దేశ విభజన సమయంలో సింధునదీ పాకిస్తాన్ లో భాగమైంది. ఇక సింధు నదీ మనకు లేదని చాలా మంది బాధపడుతుంటారు. ఇంకా కొంతమంది అయితే సింధునదీ, సింధూ ప్రాంతం మన దేశంలో లేదని… మన జాతీయ గీతం నుంచి సింధూ అనే పదాన్ని తొలగించాలని సుప్రీం కోర్టులో పీల్ వేసినట్లు వార్తలు కూడా వచ్చాయి. అయితే దేశ విభజన తర్వాత కూడా మన దేశంలోనే అంతర్భాగంగానే సింధూ నది ఉన్నదనేది నిజం. అయితే దాని ప్రాముఖ్యాన్ని మన పాలకులు గుర్తించలేకపోయారనేది కూడా అంతే నిజం. లద్దాక్ లోని లేహ్ మీదుగా సింధూ నది ప్రవహిస్తూ పాక్ ఆక్రమించిన గిల్గిత్, బాల్టిస్తాన్ లోని స్కర్దూ లోకి ప్రవేశిస్తూందనే విషయాన్ని కాంగ్రెస్ పాలకులు మర్చిపోయేలా చేశారు.
ప్రతి 12 ఏళ్ళకు పుష్కరాలు వచ్చే పుణ్యనదుల్లో సింధు నది కూడా ఒకటి.! దీంతో కొంతమంది సింధునదీ తీరంకు వెళ్లే సౌకర్యాలు లేకపోవడంతో కాశిలోనే సింధునది పుష్కర స్నానాలు ఆచరించేవారు. అయితే 1996 ప్రాంతంలో అప్పటి కేంద్రహోంమంత్రి ఎల్ కే అద్వానీ, ప్రముఖ జర్నలిస్ట్ తరుణ్ విజయ్ తో కలిసి లద్దాక్ రాజధాని లేహ్ లో పర్యటించారు. ఆ సమయంలో లద్దాఖ్ జమ్మూకశ్మీర్ స్టేట్ లో భాగంగా ఉండేది. లేహ్ లో పర్యటించిన సమయంలో తరుణ్ విజయ్ సింధునదీ లేహ్ కు సమీపం నుంచే ప్రవహిస్తుందనే విషయాన్ని అద్వానీకి గుర్తు చేశారు. స్వతహాగా సింధ్ ప్రాంతానికి చెందినవాడైన అద్వానీ ఒకింత ఉద్వేగానికి లోనయ్యాడు. దేశ విభజన విషాధఘట్టాలను చూసిన అద్వానీ.., సింధునదీ భారతీయులకు దూరమైందని ఎంతగానో బాధపడిన విషయాన్ని గుర్తుకు తెచ్చాడు. తరుణ్ విజయ్ తో కలిసి సింధు నదీ తీరం వెళ్లి కంటతడి పెట్టాడు. ఆ తర్వాత సింధూ దర్శన్ వేడుకలు నిర్వహించేందుకు స్వీకారం చుట్టారు. 1997 నుంచి అద్వానీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభం అయ్యింది. తర్వాత కాలంలో దీనిని గురుపూర్ణిమకు మార్చారు. మూడు రోజుల పాటు ఆ సమయంలో సింధూ దర్శన్ వేడుకలను కేంద్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుంది. అయితే యూపీఏ ప్రభుత్వ హయంలో ఈ వేడుకలను పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. అయితే తిరిగి 2014లో కేంద్రంలో మోదీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సింధు దర్శన్ వేడుకలకు మళ్లీ పూర్వశోభను తీసుకుని వచ్చింది. స్వయంగా పీఎం మోదీ కూడా సింధునదీకి వెళ్లి పూజలు చేశారు. లద్దాఖ్ ను మోదీ ప్రభుత్వం కేంద్రపాలిత ప్రాంతంగా చేసింది. ఆ రాష్ట్రంలో పర్యటాక రంగాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా చర్యలు చేపట్టింది. సింధూ పుష్కరాల తేదీలపై కాసింత కన్ఫ్యూజన్ ఉన్నా..ప్రజలు మాత్రం సింధూ పుష్కర స్నానాల కోసం లద్దాఖ్ బాట పడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published.

11 − ten =

Back to top button