దక్షిణ భారతదేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరహాలక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో శుక్రవారం సింహాద్రినాథుడి నృసింహ దీక్షలు ఘనంగా ప్రారంభించారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ నృసింహ దీక్షల ప్రారంభోత్సవ కార్యక్రమంలో భక్తుల హరినామ స్మరణల నడుమ సింహగిరి పులకరించింది. ఏకధాటిగా కురిసిన భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా నృసింహ దీక్షలు ధరించేందుకు పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. తొలుత ఆలయ స్థానాచార్యులు టిపి రాజగోపాల్, పురోహితులు కరి సీతారామాచార్యులు, ఇతర అర్చక పరివారం, సహాయ కార్య నిర్వహణ అధికారి నరసింహారాజు, ఆలయ ధర్మ కర్తల మండలి సభ్యులు గంట్ల శ్రీను బాబు, పలు భజన మండళ్లకు చెందిన భక్త బృందం అంతా తులసి మాలలతో, స్వామి రాగి డాలర్లు, పూజా ద్రవ్యాలు తదితర సామగ్రికి గర్భాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద మంత్రోచ్చరణలు, మృదు మధుర మంగళ వాయిద్యాలు నడుమ మాలలకు మంగళహారతులు ఇచ్చారు. అనంతరం ఆలయ రాజగోపురం ఎదురుగా ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై తొలుత సింహాద్రినాధుడికి పూజలు చేశారు. పురోహితులు కరి సీతారామచార్యులు, శ్రీ కాంత్ , తదితరులు ప్రత్యేక అర్చన గావించారు. తదుపరి అప్పన్న అష్టోత్తరం భక్తులతో స్మరింపచేశారు.